కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల

కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది.

Published : 08 May 2024 03:57 IST

నారాయణపూర్‌ నుంచి 1.9 టీఎంసీలు వదిలేందుకు అక్కడి జలవనరులశాఖ అంగీకారం
రేపు జూరాల జలాశయానికి చేరుకోనున్న ప్రవాహం

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకను పలుమార్లు కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా పలుమార్లు ఆ రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపారు. నాగర్‌కర్నూల్‌ సీఈ విజయ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఇంజినీర్ల బృందం వారం క్రితం బెంగళూరు వెళ్లి ఆ రాష్ట్ర అధికారులకు లేఖ అందజేశారు. ఈ క్రమంలో  అక్కడి అధికారులు నీటిని విడుదల చేయనున్నట్లు వర్తమానం పంపగా.. మరోమారు సీఈ బృందం కర్ణాటక వెళ్లింది.

ప్రవాహ నష్టాలు లేకుండా..

కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న భారీ ప్రాజెక్టు నారాయణపూర్‌. అక్కడి నుంచి ప్రస్తుతం దిగువన కర్ణాటక- తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాయిచూర్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం కోసం గుర్జాపూర్‌ బ్యారేజీ వరకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం కూడా ఒక టీఎంసీ విడుదల చేయనున్నారు. ప్రవాహ నష్టాలు లేకుండా ఉండాలంటే నదిలో ప్రవాహం కొనసాగుతున్నప్పుడే తెలంగాణకు కూడా నీటిని విడుదల చేస్తామని సమాచారం అందజేశారు. గుర్జాపూర్‌ బ్యారేజీ నుంచి జూరాల జలాశయానికి దాదాపు 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నీటిని విడుదల చేస్తే గురువారం ఉదయానికి జూరాలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూరాల పూర్తి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలకు 2.70 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిని తోడుకునే మట్టానికి(ఎండీడీఎల్‌) పైన 0.04 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలయ్యే జలాలు వేసవి తాగునీటి అవసరాలను తీర్చుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని