మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి

‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్‌ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి.

Published : 08 May 2024 04:04 IST

మేడిగడ్డలో సీసీబ్లాకులు తీసేసి మళ్లీ కొత్తగా అమర్చాలి
ఆప్రాన్‌కు మరమ్మతులు, గ్రౌటింగ్‌ సహా పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలి
మధ్యంతర నివేదికలో ఎన్‌.డి.ఎస్‌.ఎ. నిపుణుల కమిటీ సిఫార్సులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్‌ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచడానికి అవసరమైన చర్యలు చేపట్టండి. ఇలా చేయడంలో సమస్య వస్తే ఆ గేట్లను కూడా తొలగించండి. దెబ్బతిన్న సీసీబ్లాకులు తీసేసి మళ్లీ కొత్తగా అమర్చాలి. ఆప్రాన్‌కు మరమ్మతులు, గ్రౌటింగ్‌ సహా అనేక పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలి’ అని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌.డి.ఎస్‌.ఎ.) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతోపాటు దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి ఇందుకు గల కారణాలు, పునరుద్ధరణ చర్యలను తెలియజేసేందుకు కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా నిపుణుల కమిటీని ఎన్‌.డి.ఎస్‌.ఎ. నియమించిన విషయం తెలిసిందే. వర్షాకాలంలోగా మరమ్మతులు చేయకుంటే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున తక్షణం చేపట్టాల్సిన చర్యలతో మధ్యంతర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు 90కి పైగా సిఫార్సులతో నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను ఎన్‌.డి.ఎస్‌.ఎ. నీటిపారుదల శాఖకు అందజేసింది.  ‘‘వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా మేడిగడ్డ బ్యారేజీకి ఉన్న అన్ని గేట్లను పూర్తి స్థాయిలో తెరిచి ఉంచాలి. గేట్ల నిర్వహణకు సంబంధించినవన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆప్రాన్‌ సహా అన్నీ యథా స్థితికి తెండి’’ అని కమిటీ సిఫార్సు చేసింది. నదీ గర్భాన్ని తగిన రీతిలో చదును చేసి పటిష్ఠం చేయాలని సూచించింది.

వర్షాకాలంలోగా చేపట్టాల్సిన మధ్యంతర చర్యలివే....

వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోగా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో 85 రేడియల్‌ గేట్లకు గాను 77 ఎత్తగలిగినట్లు నీటిపారుదల శాఖ నివేదించింది. 15 నుంచి 22 వరకు గేట్లు ఎత్తేటప్పుడు సమస్యలు వచ్చాయి. ఈ ఎనిమిది గేట్లు ఏడో బ్లాకులో ఉన్నాయి. ఈ గేట్లను పైకి ఎత్తే పనిని వర్షాకాలంలోగా పూర్తి చేయాలి. ఏడో బ్లాకులోని పియర్స్‌, రాఫ్ట్‌ సహా కుంగి ఈ రేడియల్‌ గేట్లకు ఇబ్బందికర పరిస్థితి(డిస్ట్రెస్‌ కండిషన్‌) ఉంది. 20వ పియర్‌ మరీ అధ్వానంగా ఉంది. ఇది 1.2 మీటర్లు కుంగడంతోపాటు  కాంక్రీటు దెబ్బతిని భారీగా బీటలు వారింది. ఏడో బ్లాకులోని పియర్స్‌కు, రాఫ్ట్‌కు ఎగువన, దిగువన భారీగా బీటలు వచ్చాయి. దీంతో రేడియల్‌ గేట్లు, గేట్లు పైకి ఎత్తే మెకానిజం కూడా సరిగా లేదు. గేట్లపైన, స్ట్రక్చర్‌పైన నీటి పవ్రాహ వేగాన్ని నియంత్రించేందుకు వర్షాకాలంలోగా ఏడో బ్లాకులోని అన్ని గేట్లను పూర్తి స్థాయిలో పైకి ఎత్తి ఉంచాలి. ఇది చేసేలోగా రేడియల్‌ గేట్లకు సంబంధించిన అన్ని వ్యవస్థలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ప్రతి గేటుకు సంబంధించినవన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఏడో బ్లాకులో పైకి లేవని 15 నుంచి 22 వరకు గేట్లకు సంబంధించి చర్యలు తీసుకోవాలి. గ్యాంట్రీకేన్‌ను ఏడో బ్లాకులో కాకుండా వేరే బ్లాకులో ఉంచాలి. గేట్లు ఎత్తక ముందే పియర్స్‌ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

  • పియర్‌ 20కి తీవ్రంగా నష్టం జరిగినందున  ఇరువైపులా ఉన్న రేడియల్‌ గేట్లు 20, 21 పూర్తిగా తొలగించాలి. మిగిలిన ఆరుగేట్లను సురక్షితంగా పైకి లేపాలి. ఇందులో ఏమైనా సమస్య వస్తే ఈ గేట్లను కూడా పూర్తిగా తొలగించాలి.
  • ఏడో బ్లాక్‌ ఎగువన, దిగువన పక్కకెళ్లిపోయిన, దెబ్బతిన్న సీసీ బ్లాకులను పూర్తిగా తొలగించాలి. ఎక్కడైనా బుంగలు గుర్తిస్తే ఇసుక బస్తాలతో మూసివేయాలి. ఇది కొత్తగా సీసీ బ్లాకులు, ఇన్వెర్టెడ్‌ ఫిల్టర్స్‌ వేయకముందు జరగాలి.
  • కుంగిన 20వ పియర్‌ వద్ద, రాఫ్ట్‌ జరగడం వల్ల సీకెంట్‌ పైల్‌ కట్‌ ఆఫ్‌కు, ప్లింత్‌ శ్లాబ్‌కు మధ్యలో ఖాళీ వచ్చింది. దిగువన సీకెంట్‌ పైల్‌ పైభాగంలోని ప్లింత్‌శ్లాబ్‌ దెబ్బతింది. 20వ పియర్‌ ఎగువ భాగంలోనూ, 17, 18వ పియర్‌ దిగువభాగంలోనూ ఇసుక బుంగలు ఏర్పడ్డాయి. సీకెంట్‌ పైల్‌, పైల్‌ రాఫ్ట్‌ జాయింట్‌ వ్యవస్థ, రాఫ్ట్‌ దిగువన ఏర్పడిన గుంతలపై మరింత లోతుగా పరిశోధన జరగాలి.
  • ఏడో బ్లాక్‌ పియర్స్‌కు, రాఫ్ట్‌కు ఏర్పడిన బీటలను నిరంతరం పర్యవేక్షించాలి. దీనికి టెల్‌-టేల్స్‌ పద్ధతిని అనుసరించాలి. కొలతల్లో కచ్చితత్వం ఉండాలి. ప్లస్‌ లేదా మైనస్‌ ఒక మిమీ కంటే ఎక్కువ తేడా ఉండరాదు.
  • 16 నుంచి 22వ పియర్‌ వరకు పక్కకు జరగడటం లేదా బీటలు వారడం చోటుచేసుకుంది. ఈ పియర్స్‌ను బ్రేసింగ్‌ సిస్టమ్‌ను వినియోగించి తగిన స్థానంలో ఉండేలా చూడాలి. ఇవి జరగకుండా చూడటానికి లాటీస్‌ గ్రైడర్‌ వినియోగించవచ్చు. రాఫ్ట్‌పైకి భారీగా బరువైనవి తేకుండా జాగ్రత్తపడాలి. రాఫ్ట్‌లో లోపాలున్న లేదా దెబ్బతిన్న ప్రెషర్‌ రిలీజ్‌ వాల్వ్స్‌ బాగు చేయాలి. లేదా మార్చాలి.
  • ఏడో బ్లాకులోని పియర్స్‌పైన ఆప్టికల్‌ టార్గెట్స్‌ ఏర్పాటు చేయాలి. పైభాగంలోనూ, దిగువన, మధ్యలో ఏర్పాటు చేయాలి. నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలను రికార్డు చేయాలి.
  • బ్యారేజీ ఎగువన, దిగువన సీకెంట్‌ పైల్‌, పారమెట్రిక్‌ జాయింట్‌ పరిస్థితిని అంచనా వేయాలి. పక్కకు జరిగిన, దెబ్బతిన్న ప్లింత్‌శ్లాబ్‌ను బ్యారేజీపైన, దిగువన తొలగించి రివర్‌బెడ్‌ పటిష్ఠంగా ఉండేలా చూడాలి. అవసరానికి తగ్గట్లుగా ఇన్వెర్టెడ్‌ ఫిల్టర్‌ వేయాలి. ప్లింత్‌ శ్లాబ్‌ దిగువన నీటి బుంగలను గుర్తిస్తే అరికట్టడంతోపాటు పారామెట్రిక్‌ జాయింట్‌లను పునరుద్ధరించాలి. ఏడోబ్లాక్‌ రాఫ్ట్‌ పలుచోట్ల దెబ్బతింది. దిగువన గుంతలు ఏర్పడ్డాయి. ఇలాంటిచోట ఇసుక బస్తాలతో నింపాలి. తర్వాత తగిన మందంలో సిమెంట్‌ శ్లాబ్‌ వేయాలి.
  • రాఫ్ట్‌ కింద ఏర్పడిన గుంతల వివరాలను జీపీఆర్‌ పరీక్షలో గుర్తించారు. దానిని నీటిపారుదల శాఖ పరిశీలించి సిమెంట్‌-ఇసుక-నీటితో గ్రౌటింగ్‌ చేయాలి. గ్రౌటింగ్‌ కోసం రాఫ్ట్‌లో 48 నుంచి 76 మీటర్ల డయా హోల్‌వేయాలి. గ్రౌటింగ్‌కు ముందు బోర్‌హోల్‌ కెమెరాతో గుంత తీవ్రతను అంచనా వేయాలి. గ్రౌటింగ్‌ పూర్తి స్థాయిలో చేయాలి.
  • ఒకటి నుంచి ఆరో బ్లాక్‌ వరకు, ఎనిమిదో బ్లాకులో బ్యారేజీ ఎగువన, దిగువన సీకెంట్‌ పైల్స్‌, పారామెట్రిక్‌ జాయింట్‌ల పరిస్థితిని అంచనా వేయాలి. ఈ బ్లాకులలోని స్ట్రక్చర్‌పై, గేట్లపై నీటి ప్రవాహ తీవ్రత పడకుండా ఉండేందుకు అన్ని గేట్లను పైకి ఎత్తి ఉంచాలి. నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎగువన, దిగువన చర్యలు తీసుకోవాలి. సీసీ బ్లాకులు దెబ్బతింటే మార్చాలి. బుంగలు ఉంటే గ్రౌటింగ్‌ చేయాలి.
  • అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి కూడా ఇలాంటి సిఫార్సులనే చేసింది.
  • జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ను మూడు బ్యారేజీలకూ చేయించాలి. ఈ పరీక్షలన్నీ సి.ఎస్‌.ఎం.ఆర్‌.ఎస్‌.(దిల్లీ), సి.డబ్ల్యూ.పి.ఆర్‌.ఎస్‌.(పుణె), ఎన్‌.జి.ఆర్‌.ఐ.(హైదరాబాద్‌) తదితర సంస్థలతో చేయించాలి.

ప్రాణహిత నుంచి లేనట్లేనా!

వచ్చే వర్షాకాలంలో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఎన్‌.డి.ఎస్‌.ఎ. కమిటీ సిఫార్సుల ప్రకారం బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు వర్షాకాలంలో అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి ఉంచాలి. అలా చేస్తే వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోతుంది. ప్రాణహిత నది నుంచి వచ్చే ప్రవాహాన్ని మేడిగడ్డలో నిల్వ చేయకపోతే అన్నారం బ్యారేజీకి ఎత్తిపోయడం సాధ్యం కాదు. ప్రధాన గోదావరికి వరద వచ్చి శ్రీరామసాగర్‌ నిండి ఎల్లంపల్లికి ప్రవాహం మొదలైన తర్వాతనే కాళేశ్వరం ఎత్తిపోతల పంపుహౌస్‌ నుంచి మధ్య మానేరుకు నీటిని మళ్లించడానికి వీలయ్యే అవకాశం ఉంది.


నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా..

  • మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్‌లో ప్రారంభించి వెంటనే రిజర్వాయర్‌లో నీటిని నింపారు. ఆ సంవత్సరం వర్షాకాలంలోనే బ్యారేజీకి దిగువన సీసీబ్లాక్‌, ఆప్రాన్‌లు దెబ్బతిన్నాయి. నీటిని విడుదల చేసి పునరుద్ధరణ పనులు చేపట్టకుండా యథావిధిగా నిల్వను కొనసాగించారు.
  • 2023 అక్టోబరు 21న బ్యారేజీ రోడ్డు బ్రిడ్జి ఏడో బ్లాక్‌ వద్ద కుంగడం గుర్తించారు. పియర్‌ స్ట్రక్చర్‌కు నష్టం వాటిల్లడంతో పాటు దిగువన 16-17 పియర్స్‌ మధ్య, 17-18 పియర్స్‌ మధ్య రెండు ఇసుక బుంగలు ఏర్పడ్డాయి. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులు కాగా, ఏడో బ్లాకులో 11 నుంచి 22 వరకు పియర్స్‌ ఉన్నాయి. ఇందులో 16 నుంచి 21 వరకు పియర్స్‌ జరిగాయి. పియర్స్‌కు, రాఫ్ట్‌కు బీటలు వచ్చాయి. 20వ పియర్స్‌ రాఫ్ట్‌తో సహా 1.2 మీటర్లు జరిగింది. ఈ పియర్‌ దిగువన 70 మిల్లీ మీటర్ల వెడల్పు బీటలు రాగా పైకి వెళ్లేటప్పటికి 300 మిమీ వెడల్పు ఉంది. రేడియల్‌ గేట్స్‌ దిగువన కూడా పియర్స్‌ బీటలు వారాయి. రాఫ్ట్‌ కుంగింది. ఏడో బ్లాక్‌కు ఎక్కువ నష్టం జరిగింది. బ్యారేజీ దిగువన సీసీ బ్లాకులు, లాంచింగ్‌ ఆప్రాన్‌లు పక్కకు జరగడం లేదా దెబ్బతినడం జరిగింది. ప్లింత్‌ శ్లాబ్‌ దెబ్బతింది. దిగువన రాఫ్ట్‌ అనేక చోట్ల దెబ్బతినడం లేదా కొట్టుకుపోవడాన్ని గుర్తించాం.
  • అన్నారంలో బ్యారేజీ ఎగువన, రాఫ్ట్‌ వద్ద ఇసుక మేట వేయడంతో పూర్తిగా పరిశీలించడం సాధ్యం కాలేదు. ఇక్కడ కూడా బ్యారేజీ దిగువన 2019లోనే సీసీ బ్లాకులు పక్కకు జరిగాయి. మళ్లీ 2020లో కూడా సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోవడం, రాఫ్ట్‌ వియరింగ్‌ కోట్‌ కొట్టుకుపోవడం జరిగింది. 2020లో రెండు చోట్ల సీపేజీ ఏర్పడగా  అరికట్టారు. తర్వాత కూడా వరుసగా ఏర్పడగా 2024 ఫిబ్రవరిలో గ్రౌటింగ్‌తో అరికట్టారు. సీసీ బ్లాకులు, లాంచింగ్‌ ఆప్రాన్‌లు బ్యారేజీ మొత్తం దెబ్బతిన్నాయి. స్టిల్లింగ్‌ బేసిన్‌ కూడా అనేక చోట్ల పాడైంది.
  • సుందిళ్ల బ్యారేజీలో కూడా సీసీ బ్లాకులు 2019లోనే పక్కకు జరిగాయి. రాఫ్ట్‌ వియరింగ్‌ కోట్‌ కూడా కొట్టుకుపోయింది. 2020 మేలో సీపేజీని గుర్తించారు. 2022 ఆగస్టులో సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోవడం, కొట్టుకుపోవడం సంభవించింది. 2023 అక్టోబరులో కూడా సీపేజీని గుర్తించి గ్రౌటింగ్‌ ద్వారా అరికట్టారు. బ్యారేజీ దిగువన మొత్తం సీసీబ్లాకులు, లాంచింగ్‌ ఆప్రాన్‌ దెబ్బతినడం, కొట్టుకుపోవడం కమిటీ గుర్తించింది.

2019 నుంచే కాళేశ్వరం బ్యారేజీలకు నష్టం వాటిల్లడం ప్రారంభమైంది. అయితే నీటిని ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టలేదు. వర్షాకాలంలోగా కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టడంతోపాటు ఈ పరిస్థితికి గల కారణాలను లోతుగా అన్వేషించడానికి బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించాలి.

ఎన్‌.డి.ఎస్‌.ఎ. నిపుణుల కమిటీ


మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ పునరుద్ధరణకు మేము సూచిస్తున్నవి మధ్యంతర, తాత్కాలిక చర్యలు మాత్రమే. ఈ చర్యలు ఇప్పటికే దెబ్బతిన్న బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా చూడటానికే. అయితే స్ట్రక్చర్‌లో అనూహ్యమైన పరిణామాలు సంభవించి ఇంకా తీవ్రంగా నష్టం జరిగే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేం.

ఎన్‌.డి.ఎస్‌.ఎ. నిపుణుల కమిటీ


డిజైన్లు.. నిర్మాణంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆరా

ఈనాడు, హైదరాబాద్‌ - ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి - మహదేవపూర్‌, న్యూస్‌టుడే: మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌.. ఇంజినీర్లు, నిర్మాణదారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. బ్యారేజీ పై భాగం, నదిలోపలి భాగంలో పియర్స్‌ కుంగిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఎంత మేర దెబ్బతింది, బ్యారేజీ ప్రస్తుత పరిస్థితి ఏంటని నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీ అనిల్‌కుమార్‌లను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ నిర్మాణాన్ని ఒరిజినల్‌ డిజైన్‌ ప్రకారమే చేపట్టారా, లేదంటే సొంతంగా మార్పులు చేశారా అని ఆయన సందేహం వెలిబుచ్చగా.. ఒరిజినల్‌ డిజైన్ల ప్రకారమే చేపట్టారని ఇంజినీర్లు తెలిపారు. ఏడో బ్లాక్‌లోని పియర్స్‌తోపాటు ఇంకేమైనా పియర్స్‌ కుంగాయా. నేలలోకి ఎంత మేర పియర్‌ దిగిపోయింది అని ప్రశ్నించి ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఇంకా లోపాలు ఏంటంటూ వాకబు చేశారు. బ్యారేజీ ప్రాంతాన్ని చూస్తుంటే నిర్వహణ పరమైన(ఓ అండ్‌ ఎం) లోపాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన సందేహం వ్యక్తంచేశారు. ఇంత పెద్ద బ్యారేజీకి ఎలా నష్టం వాటిల్లిందని ప్రశ్నించడంతోపాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఈ నిర్మాణం ఒక పసిపాప లాంటింది. జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. వాణిజ్యపరంగా చూడొద్దు. నిర్మాణదారులుగా మీ బాధ్యత అది’ అని జస్టిస్‌ పీసీ ఘోష్‌ సూచించారు. బ్యారేజీ కట్టాల్సిన చోట నీటిని నిల్వ చేసేలా డ్యాం ఎందుకు కట్టారంటూ ఇంజినీర్లను అడిగారు. జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులకు సంబంధించి పలు అంశాలపై ఇంజినీర్ల నుంచి వివరాలు తీసుకున్నారు. అధికారులు, నిర్మాణ సంస్థ సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ మాట్లాడుతూ.. తాను ఇంజినీరింగ్‌ నిపుణుడిని కాదని, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, లోపాలను అంత త్వరగా గుర్తించలేమన్నారు. త్వరలోనే కమిషన్‌ నిపుణుల బృందం వచ్చి పరిశీలిస్తుందన్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికను కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. అంశాలవారీగా క్షుణ్నంగా పరిశీలించి అధ్యయనం చేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. అనంతరం జస్టిస్‌ పీసీ ఘోష్‌ తన సతీమణితో కలిసి కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. రాత్రికి రామగుండంలోని ఎన్టీపీసీ విశ్రాంతి గృహానికి చేరుకుని బస చేశారు. ఈఎన్సీ నాగేంద్ర, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌, బ్యారేజీ సీఈ సుధాకర్‌రెడ్డి, నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు కమిషన్‌ పర్యటనలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు