అమిత్‌షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు.

Updated : 10 May 2024 03:52 IST

దేశం నలుమూలలా వ్యాపించింది
మధ్యంతర ఉత్తర్వులను తొలగించండి 
హైకోర్టును ఆశ్రయించిన దిల్లీ పోలీసులు
నిరాకరించిన న్యాయస్థానం.. జూన్‌ 12కు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఈ కేసులో తెలంగాణతోపాటు నాగాలాండ్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో పలువురికి సమన్లు జారీ అయ్యాయన్నారు. మన్నె సతీష్‌ తదితరులు వాస్తవాలను తొక్కిపెట్టి కఠినచర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు పొందారని, వాటిని తొలగించాలని కోరుతూ దిల్లీ పోలీసులు గురువారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టగా దిల్లీ పోలీసుల తరఫున టి.సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ ప్రతినిధులకు చెందిన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల నుంచి ‘ఎక్స్‌’, ఫేస్‌బుక్‌ల్లో వీడియో అప్‌లోడ్‌ అయినట్లుందని, అందువల్ల వారికి నోటీసులు జారీ చేశామన్నారు. వారు దర్యాప్తునకు సహకరించనందున దిల్లీలోని పటియాలా కోర్టు నుంచి మన్నె సతీష్‌, పి.నవీన్‌, కోయ గీతలపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌లు పొందినట్లు తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురాకుండా ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారన్నారు. కోయ గీతకు చెందిన మొబైల్‌ ఫోన్‌ సీజ్‌ చేశామని, కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఇదే కేసులో అరుణ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయగా.. పలు సంచలన విషయాలను వెల్లడించారన్నారు. తెలంగాణ పోలీసులు ల్యాప్‌టాప్‌లు సీజ్‌ చేయడంతో తమ దర్యాప్తునకు ఇబ్బంది ఏర్పడుతోందని వివరించారు. ఈ కేసునూ దిల్లీకి బదిలీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేనపుడు ఇబ్బంది ఏముందన్నారు. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సవరించడానికి నిరాకరిస్తూ విచారణను జూన్‌ 12వ తేదీకి వాయిదా వేశారు. దిల్లీ పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ ప్రతినిధులు మన్నె సతీష్‌, ఎ.అస్మా తస్లీమ్‌, ఎ.శివకుమార్‌, పి.నవీన్‌, కోయ గీత, పి.వంశీకృష్ణలు దాఖలు చేసిన పిటిషన్‌లో కఠిన చర్యలు తీసుకోరాదంటూ గత వారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

పీసీసీ పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీలో నమోదైన కేసుపై దర్యాప్తు పేరుతో తమ సామాజిక మాధ్యమ రాష్ట్ర కార్యదర్శుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వడానికి గురువారం హైకోర్టు నిరాకరించింది. కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన పిటిషన్‌లో కోరారు. జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టి ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందున ఈ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని, మూసివేస్తామని పేర్కొన్నారు. ఇందులో తేల్చాల్సిన అంశాలున్నాయని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు