విద్యుత్‌ వాహనం పర్యావరణానికి శ్రేయం

దేశీయంగా ముడి చమురు దిగుమతి వ్యయం నానాటికీ భారంగా మారుతోంది. కర్బన ఉద్గారాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. విద్యుత్తు వాహనాలు (ఈవీ) ఆ సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. వాటి వాడకం పెరగాలంటే ప్రభుత్వాలు తగిన ...

Published : 26 Sep 2022 00:58 IST

దేశీయంగా ముడి చమురు దిగుమతి వ్యయం నానాటికీ భారంగా మారుతోంది. కర్బన ఉద్గారాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. విద్యుత్తు వాహనాలు (ఈవీ) ఆ సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. వాటి వాడకం పెరగాలంటే ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులను కల్పించాలి. భారత్‌లో వాటి తయారీని పెంచాలి.

క్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. బొగ్గు, సహజ వాయువు, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం నెలకొంది. చమురు ధరలను తగ్గించడం... దీర్ఘకాలంలో దేశీయ ఇంధన భద్రత సాధన తదితర అంశాలు ప్రభుత్వాలకు సవాలుగా మారుతున్నాయి. భారత్‌ చమురు వినియోగంలో దాదాపు 85శాతం రవాణాకు సంబంధించినదే. విద్యుత్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచితే ఇండియా ముడి చమురు దిగుమతి బిల్లును తగ్గించుకోవచ్చు. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకొనేందుకూ ఇది దోహదపడుతుంది. ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం- భారత్‌ ఈవీల మార్కెట్‌ పరిమాణం 2025 నాటికి రూ.55,302 కోట్లకు చేరనుంది. భారతీయ ఈవీ మార్కెట్‌ 42.38శాతం సమ్మిళిత ఆర్థిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) సాధిస్తుందని అంచనా. ఈ రంగంలో వృద్ధికి ఉన్న సానుకూల అంశాలు దేశంలో తమ వ్యాపారాలను విస్తరించడానికి విదేశీ సంస్థలకు విస్తృత అవకాశాలను కల్పిస్తాయి.

ప్రమాణాల సాధన కీలకం

ఎలెక్ట్రిక్‌ వాహన రంగంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలను, వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించి... ఈవీ బ్యాటరీల దేశీయ తయారీని పెంచడానికి 2021లో రెండు ఉత్పాదక అనుబంధ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని పరిమిత ఛార్జింగ్‌, మౌలిక సదుపాయాలు, సరసమైన రుణ సదుపాయాలు లేకపోవడం, స్వల్పంగా ఉన్న దేశీయ డిమాండ్‌ తదితర బహుళ సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోంది. మౌలిక సదుపాయాల కొరత, నైపుణ్యం లేని సిబ్బంది వంటివి విదేశీ పెట్టుబడిదారులను ఇబ్బంది పెడతాయి. నాణ్యమైన బ్యాటరీలను వినియోగించడం ద్వారా ప్రమాదాలను నిరోధించవచ్చు. దేశంలో ఈ రంగం ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నందువల్ల ఆటొమొబైల్‌ పరిశ్రమలు ఈవీల రూపకల్పనలో నైపుణ్యం సాధించలేకపోతున్నాయి. దేశంలో విస్తరిస్తున్న విదేశీ సంస్థలకు విశ్వసనీయమైన మార్గదర్శనం, ఇతర సేవలు అందించడానికి సరైన సంప్రదింపుల వ్యవస్థ అవసరం. నమూనాలు, ఉత్పత్తి, మౌలిక సదుపాయాలపై నిపుణుల తయారీ కోసం సమగ్ర మానవ వనరుల అభివృద్ధి వ్యూహాన్ని అందించే సంస్థను ఏర్పాటుచేయాలి. అధిక వ్యయం, ఛార్జింగ్‌ పాయింట్ల కొరత వంటి సమస్యల వల్ల వినియోగదారుడు వీటి కొనుగోలుకు వెనకాడుతున్నాడు. భారత్‌లో ఎలెక్ట్రిక్‌ కారు ప్రారంభ ధర సుమారు రూ.13 లక్షలు; సాధారణ ఇంధనంతో నడిచే వాహనం సగటు ధర సుమారు రూ.4.5 లక్షలు. మూడు రెట్ల అధిక వ్యయంతో కూడిన ఈ రంగంలో తక్కువ వ్యవధిలో స్థిరమైన లాభాన్ని పొందాలంటే తగిన చర్యలు తీసుకోవాలి. వినియోగదారుల విభాగాన్ని ఏర్పాటుచేయాలి. ఈవీల ప్రాధాన్యాన్ని గుర్తించడంలో సహాయపడే మార్కెటింగ్‌ వ్యూహాలు అవసరం. ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియంను ఎక్కువగా దిగుమతి చేసుకొంటున్నాం. ఈ రంగంలో పెట్టుబడికి సిద్ధంగా ఉన్న కంపెనీలకు ఇది ప్రధానమైన అడ్డంకి. బ్యాటరీల తయారీ సామర్థ్యం ఇప్పటికీ తక్కువగానే ఉన్నందువల్ల దేశీయ అవసరాలకు తగిన ప్రణాళికలు రూపొందించాలి. విదేశీ సంస్థలతో సంయుక్త భాగస్వామ్యం అవసరం. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీలను అందజేస్తే ప్రైవేటు వ్యాపారులు ముందుకొస్తారు. ప్రపంచస్థాయి ప్రమాణాలను అనుసరించడానికి నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.

ఎగుమతికీ అవకాశం

సాధారణ వాహన కొనుగోళ్లలో 80శాతం వరకూ ఫైనాన్స్‌పైనే జరుగుతుంటాయి. ఈవీల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉంటోంది. వినియోగదారులు సరసమైన వడ్డీ రేటుకు రుణం పొందడానికి వీలుగా పరిమిత కాల రిస్క్‌ షేరింగ్‌ విధానాల ద్వారా రుణ మద్దతు ఇస్తే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకొస్తాయి. తద్వారా అధికార ఆదాయ రుజువు పత్రాలు చూపలేనివారు, కొరియర్‌, ఫుడ్‌ డెలివరీ వంటి విభాగాల్లో పనిచేసేవారు ఎలెక్ట్రిక్‌ వాహనాలను రుణాలపై పొందేందుకు ఆసక్తి చూపుతారు. ఇతర ఆటొమొబైల్‌ దిగుమతి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపాలి. దానివల్ల థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు వాహనాలను ఎగుమతి చేయడం ద్వారా అక్కడి మార్కెట్లను ఆకట్టుకోవచ్చు. దేశీయ డిమాండ్‌కు ఎగుమతులు తోడైతే భారత్‌ ఈ రంగంలో తిరుగులేని ఉత్పాదక శక్తిగా ఆవిర్భవించవచ్చు. తయారీ రంగంలో పరిశోధన- అభివృద్ధి విభాగానికి ప్రోత్సాహకాలు అందిస్తే స్థానిక సాంకేతికతతో ఈవీల ఎగుమతి కేంద్రంగా రూపొందేందుకు వీలుంది. ఉత్పాదకతలో సగభాగం దేశీయ వినియోగానికి వీలున్నందువల్ల ఇందుకు తగిన రహదారి సౌకర్యాలను మెరుగుపరచాలి. ఇటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగితే దేశానికి ఆర్థికంగా ప్రయోజనకరం. ఉద్యోగాల కల్పన, ఉద్గారాల తగ్గింపు, ఇంధన భద్రతలకూ మార్గం సుగమమవుతుంది.


పెరగాల్సిన ఛార్జింగ్‌ సదుపాయం

విస్తృతమైన ఛార్జింగ్‌ వ్యవస్థ అందుబాటులో ఉంటే వినియోగదారుడిలో ఈవీల వాడకంపై ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. నగర పరిధిలోనే కాకుండా దూర ప్రయాణాలకూ ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఛార్జింగ్‌ మౌలిక వసతులు తక్కువ సామర్థ్యంతో ఉన్నాయి. పెట్రోలు పంపులు సాధారణ వాహనాలకు సేవలు అందిస్తున్నట్లు ఈవీలకు ఛార్జింగ్‌ అందించడం సాధ్యం కాదు. ఒక్కో వాహనాన్ని కొన్ని ఛార్జింగ్‌ పాయింట్లకే పరిమితం చేస్తారు. దేశంలోని 84 వేల పెట్రోలు పంపుల ప్రస్తుత నెట్‌వర్క్‌ను బ్యాటరీ ఛార్జింగ్‌ పాయింట్లుగా ఉపయోగించడానికి మంత్రిత్వ శాఖలు ప్రయత్నిస్తే విద్యుత్తు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల బ్యాటరీల మార్పిడి సులభమవుతుంది.


తక్కువ నిర్వహణ వ్యయం

దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం ప్రస్తుతం కీలక దశలో ఉంది. తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల ఇవి త్వరగా వినియోగదారుల ఆదరణ పొందే వీలుంది. కొరియర్‌ సేవలు అందించే సంస్థలకు సంప్రదాయ వాహనాలతో పోలిస్తే ఎలెక్ట్రిక్‌ వాహనాలు బాగా ఉపకరిస్తాయి. ఇంధన, పర్యావరణ, జలమండలి(సీఈఈడబ్ల్యూ)లోని సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ ఫైనాన్స్‌ (సీఈఎఫ్‌) ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్న విద్యుత్‌ వాహనాల అమ్మకాలు 2022లో 2.5శాతానికి చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.