Cryptocurrency: మదుపరుల పుట్టిముంచిన క్రిప్టో

ఈ ఏడాది ఇప్పటిదాకా ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అమెరికా వడ్డీ రేట్లు పెంచడం పత్రికలు, టీవీల్లో ప్రధాన వార్తలయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే పరిణామం ఒకటి వాటి మధ్యలోనే చోటుచేసుకుంది. అది... నవంబరు నెల ఆరంభంలో ప్రపంచ క్రిప్టో ఆస్తుల మార్కెట్‌ విలువ దారుణంగా పతనం కావడం.

Updated : 13 Dec 2022 11:56 IST

ఈ ఏడాది ఇప్పటిదాకా ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అమెరికా వడ్డీ రేట్లు పెంచడం పత్రికలు, టీవీల్లో ప్రధాన వార్తలయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే పరిణామం ఒకటి వాటి మధ్యలోనే చోటుచేసుకుంది. అది... నవంబరు నెల ఆరంభంలో ప్రపంచ క్రిప్టో ఆస్తుల మార్కెట్‌ విలువ దారుణంగా పతనం కావడం.

గతేడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్త క్రిప్టోల విలువ 2.7 లక్షల కోట్ల డాలర్లు. ప్రస్తుతం అది 83,300 కోట్ల డాలర్లకు పడిపోయింది. నవంబరు 11న అగ్రశ్రేణి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ అయిన ఎఫ్‌టీఎక్స్‌ దివాలా తీసింది. ఫలితంగా ప్రపంచమంతటా 10 లక్షల మందికి పైగా క్రిప్టో మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. ఎఫ్‌టీఎక్స్‌ దివాలా తీయకుండా ఆపడానికి కావాల్సిన 800 కోట్ల డాలర్లను దాని సంస్థాపకుడు, సీఈఓ అయిన 30 ఏళ్ల శామ్యూల్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌ సేకరించలేకపోయారు. అతణ్ని సరికొత్త డిజిటల్‌ ఫైనాన్స్‌ యుగ వైతాళికుడిగా వర్ణించిన నోళ్లు ఇప్పుడు మూతపడిపోయాయి.

దురాశ దుఃఖానికి చేటు

ఆర్థిక నిపుణులు ఎఫ్‌టీఎక్స్‌ను 2001 అక్టోబరులో నిలువునా మునిగిన ఇంధన వాణిజ్యం, మౌలిక వసతుల కల్పనా సంస్థ ఎన్రాన్‌తో పోలుస్తున్నారు. అది అమెరికాకు చెందిన సంస్థ. పర్యవేక్షణా లోపం, నిర్లక్ష్యం, ఖాతాదారుల నిధుల దుర్వినియోగం, వందల కోట్ల డాలర్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టలేకపోవడం ఎఫ్‌టీఎక్స్‌ పుట్టి ముంచాయి. ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌టీఎక్స్‌ మార్కెట్‌ విలువను 3200 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. నేడు ప్రపంచమంతటా విస్తరించిన 134 ఎఫ్‌టీఎక్స్‌ అనుబంధ సంస్థల నెత్తిపై 5000 కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి. వాటిలో 100 సంస్థలు కేవలం ముగ్గురు వ్యక్తుల చేతుల్లోనే కొనసాగుతున్నాయి. వారు రకరకాల లావాదేవీలతో ఎఫ్‌టీఎక్స్‌ను గుప్పిట్లో ఉంచుకున్నారు. తాము స్థాపించింది వినూత్న కంపెనీ అని చెప్పి ఎప్పటికప్పుడు కొత్త ఖాతాదారులు, ఆర్థిక సంస్థలను మభ్యపెట్టి నిధులు సేకరించిన ఎన్రాన్‌తో ఎఫ్‌టీఎక్స్‌కు చాలా పోలికలున్నాయి. 2019లో స్థాపితమైన ఎఫ్‌టీఎక్స్‌లో వెంచర్‌ పెట్టుబడిదారులు, పింఛన్‌ నిధులు, కంపెనీలు, ఇతర భారీ మదుపరులు వందల కోట్ల డాలర్లు గుమ్మరించారు. చివరకు ఎఫ్‌టీఎక్స్‌ ఉద్యోగులు సైతం మదుపు చేశారు. నిరుడు చేతిలో డబ్బు తిరగక ఇబ్బంది పడుతున్న ఇతర క్రిప్టో ఎక్స్ఛేంజీలకు ఎఫ్‌టీఎక్స్‌ 740 కోట్ల డాలర్లను రుణంగా ఇచ్చింది. తాను దూర కంత లేదు, మెడకో డోలు అన్నట్లు తనబోటి పిరమిడ్‌ సంస్థలకూ అప్పులిచ్చి ఆదుకుంది. ఇప్పుడు తానే బోల్తా పడింది.

ప్రజానీకాన్ని భ్రమల్లో ముంచి సొమ్ము చేసుకోవడమనేది 1634-38 మధ్య టులిప్‌ పూల మాయతో మొదలైంది. అప్పట్లో ఐరోపాలో ఖరీదైన టులిప్‌ పూలను ఆట్టొమన్‌ సామ్రాజ్యం నుంచి దిగుమతి చేసుకునేవారు. వాటి వ్యాపారంలో కనీవినీ ఎరగని లాభాలు వస్తాయనే ఆశతో నెదర్లాండ్స్‌లో మదుపరులు ఎగబడ్డారు. చివరకు అది వట్టి భ్రమ అని తేలి నిండా మునిగారు. అప్పటిదాకా ప్రధాన ఆర్థిక శక్తిగా ఉన్న నెదర్లాండ్స్‌ టులిప్‌ వ్యామోహం వల్ల బలహీనపడిపోయింది. అలాంటి కుంభకోణాలు ఆ తరవాత చాలానే జరిగాయి. మిసిసిపీ పథకం (1719-20), సౌత్‌ సీ సంస్థ బుడగ (1720), బ్రిటిష్‌ రైల్వే మాయ (1840వ దశకం), పాంజీ పథకం (1920) వంటివి అందులో కొన్ని. 1924-29లో అమెరికాలో స్టాక్‌ మార్కెట్‌ బుడగ ఒక్కసారిగా పేలిపోయి మహా ఆర్థిక కుంగుబాటు సంభవించింది. అటుపైన జపాన్‌ స్థిరాస్తి బుడగ (1984-89), డాట్‌కామ్‌ బుడగ (1990ల నుంచి 2000 వరకు), అమెరికా గృహాల మార్కెట్‌ బుడగ (2007) ఒకటి తరవాత ఒకటి పేలిపోయి లక్షలాది మదుపరులను నిలువునా ముంచాయి.

ఏదైనా వస్తువును లేదా సేవను అమ్మి లాభాలను ఆర్జించడాన్ని వ్యాపారం అంటారు. పాంజీ పథకంలో ఉత్పత్తులు, సేవలు ఏవీ ఉండవు. ఒక మిథ్యను చూపి బోలెడు లాభాలు వస్తాయని జనాన్ని ఆకర్షిస్తారు. మొదటి విడతలో మదుపు చేసిన వారికి తరవాత పెట్టుబడి పెట్టినవారి సొమ్ముతో ప్రతిఫలం ముట్టజెబుతారు. చివరకు అందరికీ కుచ్చుటోపీ పెడతారు. ఇదే పాంజీ లేదా పిరమిడ్‌ పథకాల సారాంశం. కేవలం 45 రోజుల్లోనే 50శాతం లాభాలు వస్తాయని చెప్పి అమెరికా, కెనడాలలో జనాన్ని బురిడీ కొట్టించిన కార్లో పాంజీ పేరు ఇలాగే చరిత్రకెక్కింది. డబ్బు యావకు అంతే లేదు కాబట్టే కొత్తకొత్త కుంభకోణాలు పుట్టుకొస్తాయి.

మిథ్యా వ్యాపారం

క్రిప్టో అనేది కేంద్ర బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ జారీ చేసినది కాదు. దానికి చట్టబద్ధత లేదు. అధికార కరెన్సీకి సమాన విలువ గల వస్తుసేవలను కొనుక్కోవచ్చని ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు భరోసా ఇస్తాయి. క్రిప్టోకు జనం ఆపాదించుకొన్నదే తప్ప ఎలాంటి అధికారక విలువ లేనే లేదు. అది వట్టి ఊహ, అపోహలపై జరిగే కుహనా వ్యాపారం. వాస్తవాలను పట్టించుకోకుండా జనం సులభంగా లాభాలు వస్తాయనే ఆశతో మిథ్యా వ్యాపారాలపై మక్కువ చూపడం శోచనీయం. క్రిప్టోల విజృంభణ మఖలో పుట్టి పుబ్బలో అంతమయ్యే తంతు అని చరిత్ర చెబుతోంది. మదుపరులు అది గ్రహించకపోవడం వల్లనే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి మారుతోంది.


ఆర్థిక సూత్రం వక్రీకరణ

ఆధునిక డిజిటల్‌ యుగంలో సాంకేతికత ఆధారంగా వినూత్న వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ ఏడాది నవంబరు నాటికి ప్రపంచంలో 9,310 క్రియాశీల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయని అంచనా. వాటిలో 100 కోట్ల డాలర్లకన్నా ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్నది 70 క్రిప్టోలకు మాత్రమే. బ్లాక్‌చైన్‌ సాంకేతికత సాయంతో అతి కొద్ది క్రిప్టో నాణేలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గిరాకీకన్నా తక్కువగా సరఫరా అయ్యే వస్తుసేవల విలువ చాలా ఎక్కువగా ఉంటుందన్న ఆర్థిక సూత్రం వక్రీకరణే క్రిప్టో కుంభకోణానికి మూలం. క్రిప్టో కరెన్సీకి డిజిటల్‌ ప్రపంచంలో తప్ప వాస్తవ జగత్తులో ఉనికి లేదు. అది ఒక నంబరు మాత్రమే. క్రిప్టో అనేది కరెన్సీ కాదు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు