రైల్వే భద్రతపై సందేహాలెన్నో!

ఒడిశాలో ఇటీవలి ఘోర రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో మరో నెత్తుటి అధ్యాయంగా నిలిచింది. ఆ ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. పదకొండు వందల మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రం రైళ్ల పాక్షిక ప్రైవేటీకరణపై దృష్టి సారించింది. వేగవంతమైన రైళ్లను అందుబాటులోకి తెస్తోంది...

Updated : 06 Jun 2023 04:36 IST

ఒడిశాలో ఇటీవలి ఘోర రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో మరో నెత్తుటి అధ్యాయంగా నిలిచింది. ఆ ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. పదకొండు వందల మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రం రైళ్ల పాక్షిక ప్రైవేటీకరణపై దృష్టి సారించింది. వేగవంతమైన రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఒడిశా దుర్ఘటన మన రైల్వే భద్రతపై ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది.

భారతీయ రైల్వే వ్యవస్థ అమెరికా, చైనా, రష్యా తరవాత ప్రపంచంలోనే నాలుగో అతి పెద్దది. నిరుడు మార్చి నాటికి దేశీయంగా రైల్వే లైన్ల పొడవు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు. సిబ్బంది పరంగా మన రైల్వే విశ్వవ్యాప్తంగా పదో స్థానంలో నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి దేశీయంగా మొత్తం రైల్వే వ్యవస్థను విద్యుదీకరించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి రైల్వేలో కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలని లక్షించింది. రైల్వే ఆస్తుల నిర్వహణ, సిగ్నలింగ్‌, ప్రయాణికుల సమాచార వ్యవస్థ తదితరాలన్నింటి డిజిటలీకరణ, ఆధునిక సాంకేతికత వినియోగంపై కేంద్రం తన నిబద్ధతను తరచూ వల్లెవేస్తోంది. దేశవ్యాప్తంగా అధిక వేగంతో ప్రయాణించగల 15 వందేభారత్‌ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అహ్మదాబాద్‌-ముంబయి బులెట్‌ రైలు పనులూ కొనసాగుతున్నాయి. ఒడిశా దుర్ఘటన- వేగవంతమైన రైళ్లను నడపడానికి భారత్‌ సిద్ధంగా ఉందా అన్న మౌలిక సందేహాన్ని ముందుకు తెస్తోంది.

కాలం చెల్లిన బోగీలు

గత నాలుగేళ్లలో సంభవించిన పది రైలు ప్రమాదాల్లో ఏడు- పట్టాలు తప్పడానికి సంబంధించినవే. ట్రాక్‌ లోపాలు, నిర్వహణ సమస్యలు, ఆపరేటింగ్‌ తప్పిదాల వల్లే ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. రైలు మార్గాల ఆధునికీకరణకు నిధులు తగ్గడం, అందుబాటులో ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుకోక పోవడం వల్ల రైళ్లు పట్టాలు తప్పడం అధికమవుతోంది. ప్రయాణికులు, సరకు రవాణా ఆదాయం తగ్గడం రైల్వే భద్రతపై సమధిక నిధులు వెచ్చించడానికి అడ్డంకిగా మారింది. 2000-2016 మధ్య కాలంలో రైళ్లు పట్టాలు తప్పడం వల్ల రూ.86,486 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఒక అధ్యయనంలో తేలింది. రైళ్లు పట్టాలు తప్పడానికి అత్యధికంగా ఆ శాఖ నియంత్రణ లోపాలే కారణమని అనిల్‌ కాకోద్కర్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష కమిటీ కుండ బద్దలుకొట్టింది. కాలంచెల్లిన, సురక్షితం కాని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) బోగీలను తొలగించి ఆధునిక లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు అందుబాటులోకి తేవాలని కాకోద్కర్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చి దశాబ్దం దాటినా, నేటికీ ఐసీఎఫ్‌ కోచ్‌లను రైల్వే శాఖ పూర్తిగా మార్చలేకపోయింది. 2016 నవంబరులో ఇందౌర్‌-రాజేంద్రనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కాన్పుర్‌ వద్ద పట్టాలు తప్పింది. ఆ ఘటనలో 140 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన లోపభూయిష్ఠ రైలు బోగీలే ఆ ప్రమాదానికి కారణమని దానిపై విచారణ జరిపిన రైల్వే భద్రతా కమిషన్‌ (సీఆర్‌ఎస్‌) వెల్లడించింది. ఈ క్రమంలో భద్రత ప్రాధాన్యాన్ని గుర్తించిన అప్పటి రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు 2017 ఏప్రిల్‌లో దక్షిణ కొరియా, జపాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు చెందిన అంతర్జాతీయ ఏజెన్సీలను సంప్రదించారు. రైలు ప్రమాదాలపై సీఆర్‌ఎస్‌ దర్యాప్తు విధానాన్ని ప్రపంచబ్యాంకు నివేదిక తప్పుపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే భద్రతా నియంత్రణ, దర్యాప్తులకు సంబంధించి స్వతంత్ర వ్యవస్థను కొలువుతీర్చాలని అది సూచించింది. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ పరిధిలోని సీఆర్‌ఎస్‌ రైలు ప్రమాదాలపై దర్యాప్తు జరుపుతోంది. దీనికి పరిమితమైన అధికారం, సామర్థ్యాలే ఉన్నాయి. ప్రమాదాల నివారణ చర్యలను పటిష్ఠంగా బలోపేతం చేసేందుకు రైల్వే బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా నిర్వహణ వ్యవస్థను కొలువు తీర్చాలనీ ప్రపంచ బ్యాంకు సూచించింది.

రుసుముల పెంపు భయం

భారతీయ రైల్వే దేశానికి జీవరేఖ లాంటిది. మన రైళ్లలో నిత్యం   2.40 కోట్ల మంది ప్రయాణం సాగిస్తున్నారు. రైల్వేను కేవలం ఆదాయ కోణంలోనే చూడటం సరికాదు. సామాజిక సంక్షేమం పరంగానూ అది కీలకమైంది. సామాన్యులే అధికంగా రైళ్లలో ప్రయాణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తమ రైల్వేల ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. భారత్‌లో మాత్రం సర్కారు ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. దేశీయంగా 109 మార్గాల్లో 151 రైళ్లను ప్రైవేటు సంస్థలు నడుపుతాయి. పట్టాలు, స్టేషన్లు, సిగ్నలింగ్‌ భద్రత, వాటి రోజువారీ నిర్వహణ బాధ్యత మాత్రం రైల్వే శాఖదే. కోచ్‌ల సేకరణ, నిర్వహణ వ్యయాన్నే ప్రైవేటు సంస్థలు భరించాలి. రైల్వేలో ఈ ద్వంద్వ నియంత్రణ వల్ల బాధ్యత, జవాబుదారీతనం దెబ్బతింటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పాక్షిక ప్రైవేటీకరణను మిగిలిన మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణికుల రుసుముల నిర్ణయంపై రైల్వే శాఖ నియంత్రణ కోల్పోతే అది సామాన్యులకు, సామాజిక సంక్షేమానికి శరాఘాతమవుతుంది. దీనికి ఆస్కారం లేకుండా కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. ‘విశ్వగురు’ హోదాను ఆకాంక్షిస్తున్న ఇండియా రైల్వే భద్రతపై సరైన దృష్టి సారించాలి. అందుకోసం సమధికంగా నిధులు కేటాయించాలి. పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగం, అందుబాటు ధరల్లో రుసుములు తదితరాల పరంగా ఇతర రవాణా సాధనాలతో పోలిస్తే భారతీయ రైల్వేను మేటిగా నిలపడం తప్పనిసరి.


ఖాళీల మేట

భారతీయ రైల్వేలో మొత్తం మంజూరైన పోస్టులు 14.93 లక్షలు. కొంత కాలంగా నియామకాలు మందకొడిగా కొనసాగుతుండటంతో 3.14 లక్షల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. ఈ ఏడాది 43శాతం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆధునిక విధానాల ద్వారా రైల్వే  ప్రమాదాలను పూర్తిగా నిలువరించేందుకు రతన్‌ టాటా నేతృత్వంలో 2015లో కాయకల్ప కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఆ సమయానికే రైల్వే భద్రతకు సంబంధించిన విభాగంలో 1.5 లక్షల పోస్టులు ఖాళీగా మూలుగుతున్నాయి. రైల్వేలో ఖాళీలను నిరంతరాయంగా భర్తీ చేయాలని కార్మిక సంఘాలు డిమాండు చేస్తున్నాయి. ఉద్యోగ విరమణలు, కొత్త రైళ్ల ప్రారంభం వల్ల ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని అవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రైళ్ల భద్రతలో కీలకంగా నిలిచే ట్రాక్‌ పర్సన్లు, పాయింట్‌మెన్‌, విద్యుత్తు పనులు, సిగ్నల్‌, టెలికాం సహాయకులకు సంబంధించి లెవెల్‌-1లో 1.03 లక్షల దాకా ఖాళీలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.