ఇసుకాసురుల విధ్వంసకాండ

‘ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అక్రమార్కులతో కుమ్మక్కై, అడ్డగోలు తవ్వకాలకు దన్నుగా నిలుస్తోంది’ అని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తాజాగా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఏపీలో జగన్‌ హయాములో నదీగర్భాలను ఇసుకాసురులు కుళ్లబొడిచేశారు. దానివల్ల ప్రజల జీవితాలు పెను ప్రమాదంలోకి జారిపోయాయి.

Published : 05 May 2024 00:28 IST

‘ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అక్రమార్కులతో కుమ్మక్కై, అడ్డగోలు తవ్వకాలకు దన్నుగా నిలుస్తోంది’ అని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తాజాగా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఏపీలో జగన్‌ హయాములో నదీగర్భాలను ఇసుకాసురులు కుళ్లబొడిచేశారు. దానివల్ల ప్రజల జీవితాలు పెను ప్రమాదంలోకి జారిపోయాయి.


జగన్‌ ఏలుబడిలో ఇష్టారీతిగా జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఏపీకి పొంచి ఉన్న పెను ప్రమాదాలివి...

  • అడ్డగోలుగా ఇసుకను తవ్వడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. తాగునీటికి తీవ్ర కటకట తలెత్తుతుంది. సాగునీరందక పొలాలు ఎండిపోతాయి.
  • అక్రమ తవ్వకాలకు భారీ వాహనాలు, యంత్రాలను వినియోగించడం వల్ల వాయు కాలుష్యం పెచ్చరిల్లి, ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది.
  • ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేయడం వల్ల నదీప్రవాహాల్లో మార్పులు వస్తాయి. దానివల్ల నదీతీరాలు కోతకు గురై వర్షాకాలంలో ఆకస్మిక వరదలు ముంచెత్తి నివాసాలు, పంటపొలాలు దెబ్బతింటాయి.
  • ఇసుకను విచ్చలవిడిగా తవ్వేస్తే నదీగర్భం లోతు పెరుగుతుంది. నదీముఖద్వారాలు వెడల్పవుతాయి. దానివల్ల నదీజలాల్లో ఉప్పదనం పెరుగుతుంది. వాటిలో మలినాలు ఇబ్బడిముబ్బడిగా పోగుపడతాయి. భార లోహాల సాంద్రత ఎక్కువై ప్రజల ఆరోగ్యం గుల్లబారుతుంది.
  • యథేచ్ఛగా ఇసుక తవ్వకాల వల్ల నదీ గర్భం ఎండిపోతుంది. దానివల్ల ఇసుక తిన్నెలపై ఆధారపడి జీవించే స్థానిక వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో చిక్కుతుంది. నదుల్లోనూ జీవజాతుల ఆవాసాలు నాశనమవుతాయి. మత్స్య ఉత్పత్తులపై దుష్ప్రభావం కనిపించి, వాటిపై ఆధారపడి బతికే ఎందరికో ఉపాధి దెబ్బతింటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో నదీ పరీవాహక ప్రాంతాలు, చెరువుల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలతో పర్యావరణ వ్యవస్థలకు, విలువైన జీవవైవిధ్యానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ఏపీలో పర్యావరణ అనుమతులు పొందకుండా సాగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఈ సందర్భంగా బట్టబయలయ్యాయి. విచ్చలవిడి ఇసుక తవ్వకాలపై న్యాయస్థానాలు పదేపదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా జగన్‌ సర్కారు ధోరణిలో మార్పు రాలేదు. ప్రకృతి విధ్వంసాన్ని నియంత్రించాల్సిన అధికార వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తుండటం విచారకరం.

నిబంధనలకు పాతర

రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నదులకు నరకయాతన మొదలైంది. ఇసుక తవ్వకాల విధాన రూపకల్పనలో జగన్‌ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఆ తరవాత తవ్వకాలను ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలను ప్రోత్సహించింది. వీటిపై అధికార వ్యవస్థలు మిన్నకుండిపోయాయి. ఇలా అన్నిస్థాయుల్లో అక్రమాలు, నేరపూరిత నిర్లక్ష్యం రాజ్యమేలాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 ప్రకారం, ఇసుక చిన్నతరహా ఖనిజాల జాబితాలోకి వస్తుంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) 2006 నిబంధనల ప్రకారం, పర్యావరణ అనుమతులు పొందిన నిర్దేశిత ప్రాంతాల్లోనే ఇసుక తవ్వకాలు జరపాలి. హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో పర్యావరణ మంత్రిత్వ శాఖ సుస్థిర ఇసుక తవ్వకాలు, యాజమాన్య పద్ధతుల నిర్వహణ కోసం 2016లో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇసుక విధానాన్ని అమలులోకి తేవడంలో చేసిన జాప్యం వల్ల లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. 2019 సెప్టెంబర్‌లో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు సాగించేలా ఒక విధానాన్ని జగన్‌ సర్కారు అమలులోకి తెచ్చింది. దీన్ని పక్కన పెట్టి రెండో విధానం ద్వారా మే 2021లో  జేపీ పవర్‌ వెంచర్స్‌ ప్రైవేటు సంస్థకు ఇసుక రీచ్‌ల నిర్వహణను అప్పగించింది. ఈ సంస్థకు ఇసుక తవ్వకాలు, రీచ్‌ల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మే 2023తో ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియలోనూ, ఆ తరవాత రాష్ట్రంలో చేపట్టిన ఇసుక తవ్వకాల్లో అనేకచోట్ల పర్యావరణ నిబంధనలు, మార్గదర్శకాల ఉల్లంఘనలు జరిగాయి. ఈ దుర్విధానాలపై స్పందించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదుల్లో తవ్వకాలు తక్షణం ఆపివేయాలని, కొత్తగా పర్యావరణ అనుమతులు పొందిన తరవాతే తవ్వకాలు చేపట్టాలని నిరుడు మార్చిలో ఆదేశాలిచ్చింది. ఏపీలో 18 రీచ్‌లలో జేపీ పవర్‌సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందంటూ రూ.18 కోట్ల జరిమానా సైతం విధించింది. దీనిపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జరిమానాపై స్టే విధించి, ఎన్జీటీ ఆదేశించినట్లు పర్యావరణ అనుమతులు తీసుకొన్నాకే తవ్వకాలు జరపాలని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని మళ్ళీ హరిత ట్రైబ్యునల్‌ దృష్టికి వెళ్ళడంతో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన కమిటీ, అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ఇసుక రీచ్‌ల నుంచి పరిశీలనా నివేదికలు కోరింది. నిబంధనలను అతిక్రమించి నదుల గర్భాల్లో లోతుగా తవ్వేస్తున్నారని, లీజుల సరిహద్దులు మీరి తవ్వకాలకు పాల్పడుతున్నారని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన ఈ కమిటీ- భారీ యంత్రాలతో సాగుతున్న తవ్వకాల్లో రోజువారీ వెయ్యి నుంచి రెండు వేల టన్నుల వరకు ఇసుక తరలిపోతోందని, కంప్యూటరైజ్డ్‌ బిల్లులు, సీసీ కెమెరాలు లేవని, వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ వినియోగించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తేల్చింది. ఇసుక తవ్వకాల్లో పెద్దయెత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని, గతేడాది ఏప్రిల్‌నుంచి కొత్తగా పర్యావరణ అనుమతులు జారీచేయలేదని పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ సైతం పేర్కొంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు లేవని కలెక్టర్లు ఇచ్చిన నివేదికలపై ట్రైబ్యునల్‌ విస్మయం వ్యక్తం చేసింది. అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడింది. అక్రమ తవ్వకందారులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని, మే 10 లోపు అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. ఎలెక్షన్ల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

విచారణ జరపాలి

గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, తాండవ, శారద, గోస్తనీ వంటి ఏపీలోని అనేక చిన్న, పెద్ద నదుల పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అడ్డగోలు తవ్వకాల వల్ల వాటి ప్రవాహ స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. నదుల్లో గోతులు పడి అనూహ్య ప్రమాదాల్లో అమాయకులు బలవుతున్నారు. వంతెనలు, ఇతర నిర్మాణాల సమీపంలో ఇసుకను ఇష్టారీతిగా తవ్వితే వాటి పటిష్ఠత దెబ్బతింటుందని తెలిసినా, ఇసుకాసురులు తమ దోపిడిని ఆపడం లేదు. అధికారగణమూ దీనిపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో ఇన్నేళ్ల ఇసుక దోపిడిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి. అక్రమార్కులకు అరదండాలు వేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.