జనహృదయంలో నిరంతర వైణికుడు

వీణావాద్యంలో లాలిత్యానికి, శాస్త్రీయతకు, కొత్తదనానికి ఈమని శంకరశాస్త్రి పెట్టింది పేరు. నేర్చుకున్న విద్యపై అధికారం, దాన్ని సవ్యంగా నిర్వహించగల విచక్షణ, చక్కగా వినియోగించగలిగే భావుకత ఆయన సొంతం. ప్రయోగశీలత, దానికి కావాల్సిన...

Published : 23 Sep 2022 01:24 IST

వీణావాద్యంలో లాలిత్యానికి, శాస్త్రీయతకు, కొత్తదనానికి ఈమని శంకరశాస్త్రి పెట్టింది పేరు. నేర్చుకున్న విద్యపై అధికారం, దాన్ని సవ్యంగా నిర్వహించగల విచక్షణ, చక్కగా వినియోగించగలిగే భావుకత ఆయన సొంతం. ప్రయోగశీలత, దానికి కావాల్సిన సాహసం, ఆత్మవిశ్వాసం ఆయన వ్యక్తిత్వానికి అలంకారాలు. ఈమని శంకరశాస్త్రి శత జయంతి నేడు.

వీణావాదనలో నవ్యతకు పెద్దపీట వేసిన ఈమని శంకరశాస్త్రి 1922 సెప్టెంబరు 23న ప్రస్తుత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో జన్మించారు. వారిది వైణికుల కుటుంబం. తండ్రి అచ్యుతరామశాస్త్రి, తాత సుబ్బరామశాస్త్రి వీణావాద్యంలో ఘనులు. నలుగురు ఆడపిల్లల తరవాత ఈమని వారింట్లో జన్మించిన శంకర సూర్య మాణిక్యాలరావు అనంతర కాలంలో శంకరశాస్త్రిగా ప్రసిద్ధులయ్యారు. శంకరశాస్త్రికి బాల్యం నుంచీ సంగీతంపైనే మక్కువ ఎక్కువగా ఉండేది. మూడో ఏటనే లయ జ్ఞానాన్ని సంపాదించారు. గాత్రం, వీణ అభ్యసించారు. వీణావాదనలో సిద్ధహస్తుడై కాకినాడలో సరస్వతీ సభవారు దసరా సందర్భంగా నిర్వహించిన సంగీత ఉత్సవాల్లో 16వ ఏట మొదటిసారి వీణ కచేరీ చేశారు. ఆ నైపుణ్యమే కాకినాడలో పిఠాపురం రాజా కళాశాలలో విద్యార్థిగా స్థానం సంపాదించి పెట్టింది. 1945లో బీఏ పట్టా పొందారు. ఈమని వారి కుటుంబం మద్రాసుకు తరలి వెళ్ళింది.

మద్రాసులో శంకరశాస్త్రి తన కచేరీల ద్వారా సంగీతంలో ప్రసిద్ధులయ్యారు. మొట్టమొదట తిరుచ్చి ఆకాశవాణి కేంద్రంలో ఒక గంట కచేరి చేశారు. జెమినీ అధినేత వాసన్‌ దృష్టిని ఆకర్షించారు. జెమినీ స్టూడియోలో వైణికులుగా నియమితులై అనతి కాలంలోనే సంగీత దర్శకుడిగా ఎదిగారు. అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి డాక్టర్‌ కేస్కర్‌, కార్యదర్శి ఆర్‌.కె.దయాని- శంకరశాస్త్రి ప్రతిభను గుర్తించి 1959లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా నియమించారు. 1961లో దిల్లీ కేంద్రంలో సంగీత ప్రయోక్తగా శంకరశాస్త్రికి పదవి లభించింది. అప్పటికే ఆయన అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు మధురమైన సంగీతం సమకూర్చారు. జనరంజకం కానిది సంగీతం కాదని ఆయన నమ్మకం.

శంకరశాస్త్రి సంగీతాన్ని కొత్త దారుల వెంట నడిపించారు. ఉత్తరాదిన సుప్రసిద్ధ సితార్‌ విద్వాంసుడు అబ్దుల్‌ హలీం జాఫర్‌ఖాన్‌తో జంటగా చేసిన గానసభ సంగీత ప్రియుల ప్రశంసలందుకొని, సమ్మేళన రాగానికి బలం చేకూర్చింది. ‘నూరేళ్ల నాడు శుద్ధ స్వరాలనే శాస్త్రీయమైనవని భావించేవారు. ఇప్పుడు ఎన్నో కొత్తవి వచ్చాయి. ఇంకెన్నో రావాలి’ అని వాదించేవారు. వీణావాద్య రీతిలో సాహసోపేతమైన మార్పులు చేసుకొని గమకాలపై విశ్లేషణాత్మక పరిశోధన, ప్రయోగ సాధన చేశారు. మహామహులతో ఆహా అనిపించుకొన్నారు. టెన్సింగ్‌ నార్కే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంలో ఈమని వారు ‘ఆదర్శ శిఖరారోహణం’ అనే కొత్త వాద్య సంగీత రూపకం సృష్టించి, ఆకాశవాణి ద్వారా ప్రసారం చేసి, దేశవిదేశాల్లో ఖ్యాతి గడించారు. మధురస్మృతి, స్వర తరంగిణి, వీణ ప్రణయం, ఉదయ వసంతం, భ్రమర గీతం వంటి సంగీత కళాఖండాలు బహుళ జనాదరణ పొందాయి. కర్ణాటక సంగీతంలో వాద్యబృంద సంగీతానికి ఒరవడి దిద్దారు. పాశ్చాత్య సంగీతానికి భారతీయతను అద్ది అద్భుతమైన ప్రయోగాలు చేశారు.

కర్ణాటక సంగీతంలో గమకాలను స్పష్టంగా నిర్వచించిన మహావిద్వాంసులు శంకరశాస్త్రి. గమకాలను, అనుస్వరాలను కూలంకషంగా అధ్యయనం చేసి, సోదాహరణ ప్రసంగాలు చేశారు. ఈమని ప్రసంగాలు, వీణావాదనలు తెలుగు ప్రజల్లో శాస్త్రీయ సంగీత ఆస్వాదన శక్తిని పెంపొందించాయి. వీణావాదనల్లో గాత్ర, వాద్య ధర్మాలనే రెండు విభిన్న శైలులు ఉన్నాయి. ఆయనది గాత్ర ధర్మం. స్త్రీ కంఠస్వరాన్ని ఆయన వీణ అద్భుతంగా పలికించేది. శంకరశాస్త్రి ఏ రాగం వాయించినా దానికి అనుగుణమైన గమకాలతో శాస్త్రీయతకు భంగం కలగకుండా రాగ హృదయాన్ని ఆవిష్కరించేవారు. వేదమంత్రాలనూ వీణపై పలికించారు. పండిట్‌ రవిశంకర్‌, అలీ అక్బర్‌ ఖాన్‌, లాల్గుడి జయరామన్‌, ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్‌ వంటి ప్రముఖ సంగీత కోవిదుల సరసన జుగల్‌బందీ నిర్వహించారు. ఈమని వారికి 1973లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1974లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ప్రదానం చేసింది. ఈమని వారి శిష్యుల్లో చిట్టిబాబు ప్రపంచ ఖ్యాతి పొందారు. 1987 డిసెంబరు ఎనిమిదిన శంకరశాస్త్రి వీణ మూగబోయింది. కానీ, సంగీత ప్రపంచంలో ఆయన విశిష్ట ముద్ర చిరకాలం నిలిచి ఉంటుంది.

- డి.భారతీదేవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.