గూగుల్‌పై జరిమానా కొరడా

భారత్‌లో సెర్చి ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ ఆదాయం లక్షల కోట్ల రూపాయల్లో ఉంటోంది. పెద్ద సంఖ్యలో చరవాణి వినియోగదారులున్న మన దేశంలో భారీస్థాయిలో ఆదాయం సంపాదించడం విశేషమేమీ కాదు.

Updated : 29 Oct 2022 04:47 IST

భారత్‌లో సెర్చి ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ ఆదాయం లక్షల కోట్ల రూపాయల్లో ఉంటోంది. పెద్ద సంఖ్యలో చరవాణి వినియోగదారులున్న మన దేశంలో భారీస్థాయిలో ఆదాయం సంపాదించడం విశేషమేమీ కాదు. అయితే ఇందులో అనైతిక వ్యాపార కార్యకలాపాలు ఇమిడి ఉన్నాయన్నదే సమస్య. ఫలితంగా గూగుల్‌పై జరిమానాల వేటు పడుతోంది.

అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ గూగుల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కన్నెర్రజేసింది. వారం రోజుల వ్యవధిలోనే సుమారు రెండువేల కోట్ల రూపాయలకుపైగా జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గూగుల్‌ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందంటూ ఈ నెల 20న సుమారు రూ.1337.76 కోట్ల జరిమానా వేసింది. వారం కూడా తిరగకముందే, గూగుల్‌ ప్లే స్టోర్‌ విధానాల్లో పోటీతత్వానికి వ్యతిరేకమైన వాటిని అనుసరిస్తోందంటూ మరో రూ.936.44 కోట్ల అపరాధ రుసుము విధించింది. తక్షణం తీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ విపణిలో ఎన్నోసార్లు జరిమానాలకు గురైనా తీరు మార్చుకోని గూగుల్‌కు భారత్‌లో ఈ స్థాయిలో చర్యలు ఎదురవడం ఇదే తొలిసారి.

ఫిర్యాదులెన్నో...

మన దేశంలో వినియోగించే చరవాణి ఉపకరణాల్లో గరిష్ఠంగా ఆండ్రాయిడ్‌ వ్యవస్థే ఉంటోంది. దీంతోపాటు గూగుల్‌ ప్లేస్టోర్‌, గూగుల్‌ క్రోమ్‌ పేరుతో సెర్చిఇంజిన్‌, యూట్యూబ్‌ వంటి ప్రధాన అప్లికేషన్లన్నీ గూగుల్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌లు తయారీ స్థాయిలోనే ఇమిడి ఉంటున్నాయి. వినియోగదారులు వాటిని తొలగించి తమకు నచ్చిన సెర్చిఇంజిన్లు, ఇతర యాప్‌లు వేసుకోవాలనుకుంటే, ఆ అవకాశం లేకుండా గూగుల్‌ నిరోధిస్తోందని, ఇది అనైతికమని ఇతర కంపెనీలు సీసీఐకి ఫిర్యాదు చేశాయి. ఇది నిజమేనని సీసీఐ నిర్ధారించింది. ఎవరైనా తాము రూపొందించిన యాప్‌లను ప్లే స్టోర్‌లో ఉంచాలనుకుంటే గూగుల్‌ అనుమతి తప్పనిసరి. అయితే చెల్లింపు యాప్‌లు, యాప్‌ల్లో జరిగే కొనుగోళ్లకు గూగుల్‌ తనదైన సొంత చెల్లింపు వ్యవస్థనే అనుమతిస్తోంది. ఇది అనైతికమని, తమకు నచ్చిన చెల్లింపు వ్యవస్థను వినియోగించుకొనే అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. డిమాండ్‌ చేసిన వారి యాప్‌లకు అవకాశం తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదు మేరకు సీసీఐ చర్యలు తీసుకుంది. ఈ రెండు ఫిర్యాదుల్లోనూ గూగుల్‌ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసి అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతోందన్నదే ప్రధాన ఆరోపణ. దాని పోకడలు వాటిని నిజం చేస్తున్నాయని సీసీఐ నిర్ధారించి, జరిమానాల కొరడా ఝళిపించింది. 

ప్రపంచంలో అత్యధికులు వినియోగించే సెర్చ్‌ ఇంజిన్‌గా పేరున్న గూగుల్‌- దాదాపు 85 శాతం మార్కెట్‌ వాటాతో ఏటా వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రకటనల ద్వారా ఆర్జిస్తోంది. మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం గూగుల్‌ అడ్డదారులు తొక్కుతోందనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తమ సంస్థకు చెందిన ప్రముఖ కీవర్డ్స్‌ను ఉపయోగించుకుని ప్రత్యర్థి కంపెనీలు గూగుల్‌లో ప్రకటనలిచ్చి తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని, దీన్ని గూగుల్‌ ప్రోత్సహించిందంటూ భారత్‌ మ్యాట్రిమోనీ సంస్థ గతంలో సీసీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఐ గూగుల్‌ వ్యాపార సరళిపై దృష్టి సారించింది. గూగుల్‌లో శోధన పక్షపాత ధోరణితో ఉంటోందని, కావాలనే తమ కంపెనీలు, ఉత్పత్తుల గురించి కనిపించకుండా తొక్కిపడుతోందంటూ పలు సంస్థలు సీసీఐకి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఫ్లిప్‌కార్ట్‌, మేక్‌ మై ట్రిప్‌, మ్యాప్‌ మై ఇండియా, గ్రూప్‌ఎం తదితర 30 సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించిన సీసీఐ, ఫిర్యాదులపై స్పందించాలని గూగుల్‌ను ఆదేశించింది. తక్షణ స్పందన లేకపోవడంతో జరిమానా విధించింది. ఆ తరవాత భారత్‌ మ్యాట్రిమోనీ ఫిర్యాదు వాస్తవమేనని గుర్తించి అపరాధ రుసుము సైతం చెల్లించాలని ఆదేశించింది.

ప్రమాదకర గుత్తాధిపత్యం

ఐరోపా సమాఖ్య దేశాల్లోగాని, యూకే, అమెరికా లాంటి చోట్లగాని వ్యాపార వ్యవహారాల్లో అనైతికతకు తావిస్తే జరిమానాలు భారీగా ఉంటాయని, భారత్‌లో అలాంటి పరిస్థితి లేకపోవడంతో గూగుల్‌ పదేపదే కట్టుబాట్లు దాటుతోందనే అభిప్రాయాలున్నాయి.  వార్తాపత్రికల్లో సమాచారాన్ని వాడుకుని, వ్యాపారం పెంచుకుంటున్న గూగుల్‌ అందులో తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా ఇవ్వడం లేదంటూ గతంలో పలు వార్తాసంస్థలు గూగుల్‌పై ఫిర్యాదులు చేశాయి. మైక్రోసాఫ్ట్‌ బింగ్‌, యాహూ, బైడూ లాంటి సెర్చి ఇంజిన్లన్నీ కలిపినా ప్రపంచ మార్కెట్‌ వాటాలో 10 శాతం దాటడం లేదు. ఈ పరిస్థితి గూగుల్‌ గుత్తాధిపత్యానికి దారి తీసిందని, ఇది చాలా ప్రమాదకరమని జర్మనీ న్యాయశాఖ మంత్రి గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్‌ తన ఆధిపత్యస్థానాన్ని దుర్వినియోగపరిస్తే దాన్ని పూర్తిగా నిషేధించే అవకాశాల్నీ పరిశీలించాలని వ్యాఖ్యానించారు. ఆ స్థాయిలో కాకున్నా ఇతర సంస్థల వ్యాపారాన్ని దెబ్బతీసే అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా గూగుల్‌కు ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలు విధించాలి. తప్పు చేసినట్లు తేలితే భారీ జరిమానాలకు వెనకాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

- ముఖర్జీ కొండవీటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు