అఖిల భారత అక్రమార్కులు

‘ఐఏఎస్‌లలో పాతికశాతం అవినీతిపరులు, అసమర్థులు, మొద్దుబారిన మనుషులు... మరో యాభై శాతమేమో పని చేయకుండానే జీతం తీసుకోవడానికి బాగా అలవాటుపడిన వాళ్లు... మిగిలిన పాతికశాతంతోనే పాలనా వ్యవహారాలను చక్కబెట్టాల్సి వస్తోంది’- గతంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళబోసుకున్న గోడు ఇది!

Updated : 04 Dec 2022 04:24 IST

‘ఐఏఎస్‌లలో పాతికశాతం అవినీతిపరులు, అసమర్థులు, మొద్దుబారిన మనుషులు... మరో యాభై శాతమేమో పని చేయకుండానే జీతం తీసుకోవడానికి బాగా అలవాటుపడిన వాళ్లు... మిగిలిన పాతికశాతంతోనే పాలనా వ్యవహారాలను చక్కబెట్టాల్సి వస్తోంది’- గతంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళబోసుకున్న గోడు ఇది! అదే ఇప్పటి పరిస్థితి గురించి చెప్పుకోవాలంటే- మంచి ఐఏఎస్‌ల సంఖ్య ఆనాటి పాతికశాతం నుంచి ఎంత పాతాళానికి పడిపోయిందో ఎవరికీ తెలియదు. ఘనత వహించిన అఖిల భారత సర్వీసు అధికారుల్లో అనేకమంది నేడు సర్కారీ కార్యాలయాలను అత్తారిళ్లలా మార్చుకొని రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఏ ఈకల పక్షి ఆ గుంపులో కలుస్తుందన్నట్లు- సమాజాన్ని దోచుకుతినే బందిపోట్ల ముఠాల్లో వాళ్లూ ఎగబడి చేరిపోతున్నారు. నిజాయతీ, నిష్పాక్షికత, ప్రతిభలతో ప్రజలకు సేవచేయాల్సిన అధికారులు- పోనుపోను దేశానికి గుదిబండల్లా తయారవుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులు, వ్యాపారవేత్తలు, దళారులందరూ కలిసి ఓ గూడుపుఠాణీ చేశారు. రాష్ట్రంలో బొగ్గు తరలింపును అక్రమ ఆదాయ వనరుగా మార్చుకొని, రోజుకు రెండు మూడు కోట్ల రూపాయలు వసూలుచేశారు. ఆ క్రమంలో మూడు నెలల్లో సుమారు ముప్ఫై వేల నిరభ్యంతర పత్రాలను ఎడాపెడా మంజూరు చేశారు. ఈ భారీ బొగ్గు కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా సమీర్‌ విష్ణోయి అనే ఐఏఎస్‌ అధికారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇటీవల అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉప కార్యదర్శి సౌమ్యా చౌరాసియాకు తాజాగా అదే కేసులో ఈడీ సంకెళ్లు వేసింది. పూజా సింఘాల్‌ అని ఝార్ఖండ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి... పన్నెండేళ్ల క్రితం ఖూంటీ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. అప్పట్లో అక్కడ ఉపాధి హామీ నిధులను అవినీతి గద్దలు తన్నుకుపోయినట్లు గగ్గోలు రేగింది. దానిపై 2012లో ఈడీ కేసు నమోదు చేసింది. దశాబ్దం గడిచిపోయాక మొన్న మేలో ఆ కేసులో పూజా సింఘాల్‌ను ఆ సంస్థ అదుపులోకి తీసుకుంది. మూడు రోజుల క్రితం రూ.82.77 కోట్ల విలువైన ఆమె స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఒక జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న పూజ- అరెస్టు అయ్యేనాటికి ఆ రాష్ట్ర గనులు, పరిశ్రమల శాఖ కార్యదర్శి హోదాకు ఎదిగారు. విచారణ ఒక కొలిక్కి వచ్చేసరికి బహుశా పదవీ విరమణ కూడా చేసేస్తారేమో! ప్రభుత్వోద్యోగుల అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా పాల్పడే నేరంగా సుప్రీంకోర్టు గతంలో అభివర్ణించింది. అటువంటి దోపిడి పర్వాలకు ఎవరూ తెర తీయకూడదంటే- దేశాభివృద్ధిని దిగమింగేసే అవినీతి అనకొండలపై వేగంగా దర్యాప్తు చేయాలి. అక్రమార్కుల నేరాలను న్యాయస్థానాల్లో నిరూపించి, సాధ్యమైనంత త్వరగా వాళ్లతో ఊచలు లెక్కపెట్టించాలి. కానీ, దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగితే ఏమిటి ఉపయోగం? కాజేసిన సొత్తును సుబ్బరంగా అరాయించుకుని, బ్రేవ్‌మని తేన్చాక ఏనాటికో వాళ్ల పేగులు లెక్కపెడతామంటే ఎవరికి ప్రయోజనం?

సమీర్‌, సౌమ్య, పూజ... వీళ్లు ముగ్గురే కాదు! పరిపాలనా రథం సిగ్గుమాలిన నేరాల రొచ్చుగుంటలో కూరుకుపోయిందని చాటుతూ ఇటీవల నెల రోజుల్లోనే మరో నలుగురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కటకటాల పాలయ్యారు. ఆయుధ లైసెన్సుల మంజూరు, ప్రభుత్వ భూముల కేటాయింపు, ఆక్రమణల క్రమబద్ధీకరణల్లో లంచాల మేతకు పాల్పడిన అభియోగాలపై గుజరాత్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ కంకిపాటి రాజేశ్‌ దర్యాప్తు సంస్థల చేతికి చిక్కారు. లంచాల గడ్డికి ఆశపడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఐఏఎస్‌ అధికారి జె.మంజునాథ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. ఆ రాష్ట్రంలోనే పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ల నియామక కుంభకోణంలో ఐపీఎస్‌ అధికారి అమ్రిత్‌ పాల్‌ను సీఐడీ ఖైదు చేసింది. శిక్షణ కోసం వచ్చిన ఓ ఐఐటీ విద్యార్థిని లైంగికంగా వేధించిన కేసులో ఝార్ఖండ్‌ ఐఏఎస్‌ సయ్యద్‌ అహ్మద్‌ రియాజ్‌ కటకటాల పాలయ్యారు. మురుగునీటి పైప్‌లైన్ల టెండర్లలో ఒకశాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారనే అభియోగాలతో పంజాబ్‌లో సంజయ్‌ పోప్లి అనే ఐఏఎస్‌ బాబును విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఏ రాష్ట్రమేగినా ఎందుకాలిడినా ఇలా అవినీతి మురికి మడుగులో ఆనందంగా ఈదులాడే అధికారులెందరో కనిపిస్తారు. సివిల్‌ సర్వీసులు భారతావని సమైక్యతను సంరక్షించే ఉక్కుచట్రం కావాలని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశించారు. ఏడున్నర దశాబ్దాల తరవాత తిరిగి చూస్తే- ఆయా సర్వీసుల అధికారుల్లో అత్యధికులు ఏమయ్యారు? రాజ్యాంగానికి, చట్టాలకు తలవంచడం మానేసి- పొద్దస్తమానం తమ రాజకీయ బాసుల సేవలోనే తలమునకలవుతున్నారు. అత్యున్నత అధికార శ్రేణి దిగజారుడుతనాన్ని కళ్లకు కడుతూ కర్ణాటక క్యాడర్‌ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వి.బాలసుబ్రమణియన్‌ ‘ఫాల్‌ ఫ్రమ్‌ గ్రేస్‌’ పేరిట నాలుగు నెలల క్రితం ఒక పుస్తకం వెలువరించారు. ఎస్‌.బంగారప్ప ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన కాలాన్ని ‘కర్ణాటకలో అవినీతికి స్వర్ణయుగం’గా ఆయన అభివర్ణించారు. అవినీతిని వికేంద్రీకరించి ప్రతి సర్కారీ విభాగానికీ అప్పట్లో వసూళ్ల లక్ష్యాలను నిర్దేశించారట. సీఎంను సేవించుకునేందుకు తమకు దక్కిన గౌరవపూర్వక అవకాశంగా దాన్ని కొందరు ఐఏఎస్‌లు భావించారన్న బాలసుబ్రమణియన్‌- నేతల పాపాల్లో వాటాలు పంచుకునే ‘అయ్యా...ఎస్‌’ల ముసుగులు తొలగించేశారు!

రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరించినట్లు- ఎటువంటి రాజకీయ వ్యవస్థ అయినా అదెంతటి అవినీతికరమైనదైనా సరే, వృత్తిపరమైన ఉన్నత విలువలకు కట్టుబడి ఐక్యంగా ఉండే అధికార యంత్రాంగాన్ని భ్రష్టుపట్టించలేదు. రాజకీయ నాయకులు ప్రలోభాల ఎరలు వేస్తూనే ఉంటారు... వాటికి ఆశపడాల్సిన అగత్యం అధికారులకేమిటని దువ్వూరి ప్రశ్నించారు. కానీ, అటువంటి హితోక్తులను ఆలకించేవారెవరు? అవినీతి సామ్రాజ్యాధినేతలుగా జగత్‌ ప్రసిద్ధులైన నేతలకు ఊడిగం చేసేవాళ్లే పోనుపోను ఎక్కువైపోతున్నారు. 2009-2013 మధ్య నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది ఐఏఎస్‌లు కేసుల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ, ప్రకృతి వనరులను గుటకాయ స్వాహా చేసేందుకు తెగబడిన నేతలకు వంతపాడారన్నది వాళ్లపై ప్రధానారోపణ. 2003 నుంచి ఆ తరవాత పదేళ్ల కాలంలో మొత్తం 145 మంది ఐఏఎస్‌ అధికారులపై అవినీతి కేసులు నమోదయ్యాయి. 2015 నుంచి నిరుడు మార్చినాటికి దేశవ్యాప్తంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై సీబీఐ 56 కేసులు పెట్టింది. కానీ, ఏం లాభం? సకాలంలో సరైన శిక్షలే కొరవడుతున్న దురదృష్టకర వాతావరణంలో- అవినీతి తిమింగిలాలు సుష్ఠుగా ప్రజాధనాన్ని భోంచేస్తూనే ఉన్నాయి. వాగ్దానాలు చేసేవారు... వాటిని మరచిపోవడం ఎలాగో కూడా నేర్చుకుని ఉంటారన్నది పెద్దలమాట. అవినీతి తాచుపాముల కోరలు పీకేస్తామని పదేపదే ఊదరగొట్టే పాలకులు అందులో సిద్ధహస్తులంటే... కాదనగలరా?  

శైలేష్‌ నిమ్మగడ్డ

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు