తాగునీరే మహాగరళం

మానవుడి నిత్య జీవితంలో నీటిదే ప్రధాన పాత్ర. శుద్ధజలం కోసం ప్రభుత్వాలు బడ్జెట్లలో భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి.

Published : 25 Jan 2023 00:04 IST

మానవుడి నిత్య జీవితంలో నీటిదే ప్రధాన పాత్ర. శుద్ధజలం కోసం ప్రభుత్వాలు బడ్జెట్లలో భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. దీనికి తోడు ప్రజలు సైతం పరిశుభ్రమైన తాగునీటి కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. తాగునీరు కలుషిత వనరుల బారిన పడకుండా కాపాడుకుంటే ఇంతగా ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. 

మానవజాతి మనుగడ తాగునీటి నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో నీటి వనరులు భూఉపరితలం, భూగర్భ జలాల రూపంలో లభిస్తాయి. వర్షాలు కురిసినప్పుడు నీరు భూమి వాలును బట్టి వంకలు, వాగులు, కాలువలుగా ప్రవహించి నదుల రూపాల్లోకి మారి చివరకు సముద్రాల్లో కలుస్తుంది. మార్గమధ్యంలో ఎక్కడైనా లోతట్టు ప్రదేశాలు ఉంటే అక్కడ చెరువులు, సరస్సులుగా భూఉపరితల జలం రూపంలో నిల్వ ఉంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వివిధ రకాల కలుషితాలు కలిసిపోతాయి. అయితే, నిరంతర ప్రవాహాల కారణంగా కలుషితాలు పలుచబారి నీటి నాణ్యత తాగడానికి అనుకూలంగానే ఉంటుంది. భూఉపరితల జలం భూమి పగుళ్ల ద్వారా లోపలికి చొచ్చుకొని పోయి భూగర్భ జలవనరుగా మారుతుంది. భూగర్భ జలం కలుషితాలకు దూరంగా ఉండటం వల్ల భూఉపరితల జలంకన్నా తాగడానికి మరింత అనుకూలమైంది.

పారిశ్రామికీకరణ, హరిత విప్లవం, పట్టణీకరణ ధాటికి జలవనరులకు కలుషితాల తాకిడి పెరిగింది. పర్యావరణానికి హాని తలపెట్టడమూ అధికమైంది. నీటి వనరులు కాలుష్యం బారినపడ్డాయి. చాలాచోట్ల తాగడానికి వీలులేని స్థితిలోకి నీటి నాణ్యత క్షీణించింది. కలుషిత నీరు రకరకాల వ్యాధులకు, మరణాలకు కారణమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా మానవుడి అనాలోచిత కార్యకలాపాలతో పరిశ్రమలు, గృహ కార్యకలాపాల నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థ జలాలు శుద్ధి జరగకుండానే విచ్చలవిడిగా ఖాళీ స్థలాలు, కాలువలు, నదులు, సముద్రాల్లో కలిసిపోతున్నాయి. వ్యవసాయానికి వాడే రసాయనిక ఎరువులు, భూగర్భంలోని  విషతుల్య ఖనిజాలతోనూ నీరు కలుషితమవుతోంది. చాలా ప్రాంతాల్లో తాగునీరు కుళాయిల ద్వారానే సరఫరా జరుగుతుంది. కొన్నిసార్లు, ఆ నీరు తాగడానికి పనికిరాని విధంగా ఉంటోంది. కుళాయి నీటి నాణ్యతను తెలుసుకోవడానికి జల పరీక్షలు చేపట్టడం సర్వసాధారణం. ఈ పరీక్షల వల్ల రసాయనిక పదార్థాలు, సూక్ష్మజీవుల గురించి తెలుస్తుంది. కానీ కలుషితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలియదు. కాలుష్యాన్ని నియంత్రించడమూ కుదరదు. నిత్యం నీటి సరఫరాకు ఉపయోగించే భూఉపరితల జలమైనా, భూగర్భ జలమైనా ఎలాంటి కాలువలు, నదులు, బావుల నుంచి వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. ఈ జలాలు నీటి సరఫరా వ్యవస్థలోకి చేరడానికి ముందు ఎలాంటి కలుషితాలు చేరుతున్నాయనే అంశాలను అధ్యయనం చేయాలి. నీటి సరఫరా వ్యవస్థలోకి చేరే ముందుగానే ఆ జలాలకు, కలుషితాలకు రసాయనిక పరీక్షలు నిర్వహిస్తే కారణాలు సమగ్రంగా తెలుస్తాయి.

పరిశ్రమల కారణంగా కలుషితమయ్యే జలాల్లో ఎక్కువగా మెగ్నీషియం, సోడియం, క్లోరైడ్‌, సల్ఫేట్‌ సూక్ష్మమూలకాలు ఉంటాయి. గృహసంబంధ వ్యర్థాల కారణంగా కలుషితమయ్యే జలాల్లో మెగ్నీషియం, సోడియం, క్లోరైడ్‌, సల్ఫేట్‌, నైట్రేట్‌, సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి. వ్యవసాయ కలుషిత జలాల్లో సోడియం, పొటాషియం, క్లోరైడ్‌, సల్ఫేట్‌, నైట్రేట్‌, ఫ్లోరైడ్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటిని కాలుష్య సూచీలుగా వ్యవహరిస్తారు. వీటిని ఆధారంగా తీసుకొని కలుషిత కారకాలను సులభంగా గుర్తించవచ్చు. కాలుష్య సూచీల ఆధారంగా ఎక్కడైనా జలాలు కలుషితమైనట్లు రసాయనిక పరీక్షల్లో తేలితే, ఆ జలాలను నీటి సరఫరా వ్యవస్థలోకి చేరకుండా మొదట్లోనే నిలువరించాలి. జలాలను కలుషితం చేస్తున్న వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక దశలో జలాల నాణ్యత బాగున్నా, కొన్నిసార్లు మధ్యలో కలుషితాలు చేరవచ్చు. అప్పుడు జలాల్ని సరఫరా చేసే గొట్టాల్లో మార్గమధ్యంలో కలుషితాలు చేరుతున్నట్లు అనుమానించాలి. ఇలాంటి పరిస్థితుల్లో సరఫరా అవుతున్న జలాలను ఏ ప్రధాన గొట్టాల ద్వారా పంపుతున్నారో అక్కడి నుంచి రసాయనిక పరీక్షల కోసం సేకరించాలి. తదుపరి దశలో సరఫరా జరిగే చిన్న గొట్టాల్లోని జలాలను కూడా పరీక్షల కోసం తీసుకోవాలి. ఇలాంటి శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా కాలుష్య కారకాలు ఎక్కడ ఉన్నాయనేది తెలుస్తుంది. అవసరమైన మరమ్మతుల ద్వారా కాలుష్యాన్ని అరికట్టడం సులభతరమవుతుంది. ఎక్కడపడితే అక్కడ జలాలను సేకరించి రసాయన పరీక్షలు చేపట్టడం వల్ల నీరు కలుషితమైనట్లు మాత్రమే తెలుస్తుంది తప్పించి, కలుషిత కారకాలను నియంత్రించడం సాధ్యంకాదు. నిత్యం తాగునీటి నాణ్యత సమస్యలు తారసపడతాయే తప్ప పరిష్కార మార్గాలు లభించవు. తరచూ శాస్త్రీయ పద్ధతిలో తాగునీటికి రసాయనిక పరీక్షలు నిర్వహిస్తూ, కలుషిత కారకాలను ఎక్కడికక్కడే అరికడితేనే ప్రజలను వ్యాధుల బారిన పడకుండా కాపాడటం సాధ్యమవుతుంది. ఈ బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాల పైనే ఉంటుంది.

 ఆచార్య నందిపాటి సుబ్బారావు
(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.