అలసిన మనసుకు నిద్రే ఔషధం

నిద్ర ఒక వరం. జీవనశైలి మార్పులు, ఒత్తిళ్ల కారణంగా ప్రపంచంలో మూడోవంతు జనాభా నిద్రకు దూరమవుతోంది. దాంతో వారు పలురకాల రుగ్మతలకు గురవుతున్నారు. నిద్ర సంబంధ సమస్యల పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు.

Updated : 17 Mar 2023 09:36 IST

నిద్ర ఒక వరం. జీవనశైలి మార్పులు, ఒత్తిళ్ల కారణంగా ప్రపంచంలో మూడోవంతు జనాభా నిద్రకు దూరమవుతోంది. దాంతో వారు పలురకాల రుగ్మతలకు గురవుతున్నారు. నిద్ర సంబంధ సమస్యల పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. ‘మంచి నిద్రతో మంచి జీవితం... మంచి ప్రపంచం’ అన్నది ఈసారి నినాదం.

మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర ఎంతో కీలకం. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, అవయవాలకు తగిన విశ్రాంతి అందించడం ద్వారా శరీరాన్ని ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచడానికి రాత్రిపూట గాఢంగా నిద్రపోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా 30శాతం పైగా  జనాభా నిద్రలేమి (ఇన్‌సోమ్నియా), కలతనిద్ర వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటివరకు 84రకాల నిద్ర సంబంధ వ్యాధులు, సమస్యలను గుర్తించిన వైద్య నిపుణులు- వాటిని మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి: నిద్రలేమి లేదా కలత నిద్ర; అతినిద్ర లేదా పగటిపూట ఎక్కువసేపు పడుకోవడం; ఇతరులకు ఇబ్బంది కలిగించేలా కునుకుతీయడం. సరిగ్గా నిద్రపట్టడం లేదంటూ వైద్యులను సంప్రదిస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

కొవిడ్‌ తరవాత...

భారత్‌లో కొవిడ్‌ ఉద్ధృతి తరవాత నిద్ర సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య 15-20శాతం పెరిగినట్లు ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఫర్‌ స్లీప్‌ ఆప్నియా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు ఊపిరి ఆగిపోయినట్లు అనిపించడంతో చటుక్కున లేవాల్సి రావడం చాలామందిలో కనిపిస్తున్నట్లు పేర్కొంది. రాత్రివేళ గాఢంగా నిద్ర పట్టకపోవడంతో 58శాతం ఇబ్బందులు పడుతున్నారు. 11 శాతం ఉద్యోగులకు కునికిపాట్లు తప్పడంలేదు. పెద్దల్లో 33శాతం గురక ఇబ్బంది పెడుతుండగా, వారిలో 14శాతం పెద్దగా శబ్దం చేస్తున్నారు. నిద్రలేమి బాధితుల విపరీత ప్రవర్తన కారణంగా 19శాతం కుటుంబాల్లో సంబంధాలు దెబ్బతింటున్నాయని లోగడ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. రాత్రి వేళ నిద్ర సరిగ్గా పట్టకపోతే- మరుసటిరోజు తీవ్ర అలసటగా ఉండటం, వికారం, తలనొప్పి, దేనిపైనా ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వారాల తరబడి కలత నిద్ర కొనసాగితే- ప్రవర్తన సంబంధ సమస్యలు దరిచేరడంతోపాటు శరీరంలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇలాంటి వారికి ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, హృద్రోగాలు, కుంగుబాటు ముప్పు ఎక్కువగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు హెచ్చరించాయి. దేశంలో ఇన్‌సోమ్నియా బాధితులు అంతకంతకు పెరుగుతున్నా- వారిలో కేవలం రెండు శాతమే వైద్యులను సంప్రదిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలున్నాయి. భారతీయుల్లో ఏకంగా 59శాతం చాలా పొద్దుపోయిన తరవాతగాని నిద్రకు ఉపక్రమించడంలేదని గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌కార్డ్‌ (జీఐఎస్‌ఎస్‌)-2022 సర్వే తేల్చింది! వారంతా రాత్రి 11 గంటల తరవాతగాని సెల్‌ఫోన్లను కట్టిపెట్టి కునుకు తీయడానికి సిద్ధపడటం లేదట. వీరిలో ఎక్కువమంది హైదరాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు చెందినవారే! 38శాతం మహిళలు, 31శాతం పురుషులు అర్ధరాత్రి వరకు సామాజిక మాధ్యమాల్లోనే నిమగ్నమవుతూ కళ్లలో మంట పుట్టేంతవరకు వాటిని చూస్తూనే ఉంటున్నారన్నది వైద్య నిపుణుల ఫిర్యాదు. ఈ కారణంగానే చాలామంది మెడ, భుజాలు, ముంజేతి నొప్పులతో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మానసిక రోగులకు నిద్ర ఔషధంలా పనిచేస్తుందని అంటున్నారు. గదుల్లో ఎలెక్ట్రానిక్‌ పరికరాలు ఎక్కువగా ఉండటం, శబ్ద కాలుష్యం, పడుకోవడానికి తగినంత చోటు లేకపోవడం వల్లే ఎక్కువసేపు నిద్రపోలేకపోతున్నామని 18-24 ఏళ్ల యువతీయువకులు సర్వేలో చెప్పారు. ఇవే కాదు- ఊపిరి సరిగ్గా అందకపోవడం, అధిక రక్తపోటు, నొప్పులు, వృద్ధాప్యం, తీవ్ర ఆలోచనల కారణంగానూ ఎంతోమంది నిద్రకు దూరమవుతున్నారు. బహుళజాతి సంస్థల ఉద్యోగులు పలు దేశ కాలాలకు అనుగుణంగా వివిధ షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. దాంతో వారు విశ్రాంతి తీసుకోవడానికి నిర్దిష్ట సమయమంటూ ఉండటంలేదు.

అదీ ఒక కళే!

ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా నిద్ర సంబంధ సమస్యలను చాలామటుకు అధిగమించవచ్చన్నది వైద్య నిపుణుల సలహా. తగినంత వ్యాయామం, యోగా లేదా శారీరక శ్రమ చేయడం, రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం సహజంగానే నిద్రకు సిద్ధపడుతుంది. అవసరమైతే తప్ప సెల్‌ఫోన్లను, ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలను అర్ధరాత్రి వరకు వాడకూడదు. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం... వేపుళ్లు, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను కడుపునిండా తినడం- నిద్రను అడ్డుకొంటాయి. దీర్ఘకాలంగా నిద్ర సమస్య వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాల్సిందే. ఇబ్బందులెన్ని ఉన్నా, వేళకు ఆదమరచి నిద్రపోగలిగితే- అదీ ఒక కళే!

రఘు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.