ప్రోత్సహిస్తే పెట్టుబడుల వెల్లువ
ఒక దేశ ఆర్థిక పురోగతికి పెట్టుబడులే కీలకం. ఉత్పత్తి, ఉపాధి, వినియోగం, ఎగుమతులు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు పెట్టుబడులు తోడ్పతాయి. అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వ పెట్టుబడులతోపాటు ప్రైవేటు పెట్టుబడులూ అవసరమే.
ఒక దేశ ఆర్థిక పురోగతికి పెట్టుబడులే కీలకం. ఉత్పత్తి, ఉపాధి, వినియోగం, ఎగుమతులు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు పెట్టుబడులు తోడ్పతాయి. అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వ పెట్టుబడులతోపాటు ప్రైవేటు పెట్టుబడులూ అవసరమే. అన్నింటికన్నా ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు సానుకూల, ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!
కొవిడ్ మూలంగా దెబ్బతిన్న దేశాల్లో అతివేగంగా కోలుకున్నది మన దేశమే. క్రమంగా దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. కొవిడ్ ఉత్పాతం తరవాత ప్రజల్లో పెరిగిన వినియోగం, తద్వారా ఇనుమడించిన ఉత్పత్తి సామర్థ్యం ఇందుకు ముఖ్యకారణాలుగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారీ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు ప్రకటించడం మొదలు, వివిధ చర్యల ద్వారా ప్రోత్సాహకర వాతావరణం నెలకొనేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి పారిశ్రామిక వేత్తలను హనుమంతుడితో పోలుస్తూ ఉత్తేజపరచే వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రకరకాల యత్నాలు కొంతమేర ఫలితాలను ఇస్తున్నాయి.
కొన్ని సూచీల్లో మెరుగైన స్థానాల్లో నిలుస్తున్న భారత్- ఇటీవలి కాలంలో పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. రాబోయే అయిదేళ్ల కాలంలో భారత్ మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇందులో కొన్నేళ్లుగా అమెరికా, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం విదేశాల నుంచి సంస్థాగత పెట్టుబడుల రూపంలో భారీగా నిధులు స్టాక్ మార్కెట్లలోకి వస్తున్నాయి. అయితే, ఇవి ఎన్నాళ్లు ఉంటాయో తెలియదు. వాటికి ఎప్పుడు రెక్కలు వస్తాయో నిర్దిష్టంగా చెప్పలేం. గత ఏడాది మార్కెట్ల నుంచి ఇలా పెద్దమొత్తంలో వెనక్కి మరలిపోవడం రూపాయి పతనానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. వీటికన్నా భారత్‌లోనే పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి, వినియోగం, ఎగుమతులను వృద్ధి చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే విధానాలను అమలు చేయడం మేలు. 2000-01 నుంచి 2021-22 మధ్య కాలంలో భారత్‌లో ఎఫ్‌డీఐలు 20 రెట్లు పెరిగాయి. ప్రభుత్వ సులభతర వాణిజ్య విధానాల ఫలితంగా పెరుగుదల నమోదైనట్లు భావిస్తున్నారు.
ఏ దేశంలోనైనా కేవలం ప్రభుత్వం మాత్రమే దేశ ఆర్థికాభివృద్ధిని పూర్తిస్థాయిలో తన భుజాలపై మోయలేదు. ప్రభుత్వ పరంగా చేపట్టే పెట్టుబడులకు ప్రైవేట్ పెట్టుబడులు జతకూడినప్పుడే వృద్ధిరేటు ముందుకు సాగుతుంది. దేశంలో వివిధ రంగాల్లోకి పెట్టుబడులను ఆకర్షించేలా సానుకూల వాతావరణాన్ని కల్పించగలిగినప్పుడే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి ప్రణాళికలతో ముందుకు వస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ముందుగా తనవంతుగా భారీ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టాలి. మౌలిక సదుపాయాలను నెలకొల్పాలి. ఇతరత్రా సానుకూల పరిస్థితుల్ని కల్పించాలి. రుణలభ్యత సౌలభ్యం, ప్రాజెక్టు భవిష్యత్తుకు ముప్పు లేకపోవడం, ప్రభుత్వ పరమైన ప్రోత్సాహకాల వంటి అంశాలపై ప్రైవేట్ పెట్టుబడులు ఆధారపడతాయి. పెట్టుబడిదారులను రాజకీయ నాయకులు వేధించే పరిస్థితులు ఉంటే వచ్చే కొత్త పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు మరలిపోతాయి. పెట్టుబడుల విషయంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ తదితర దేశాలు పలు రకాల ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం సానుకూలంగా లేకపోయినా, భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యం సృష్టికి ప్రైవేట్ రంగం ముందుకు రావడం స్వాగతించవలసిన అంశమే. పెట్టుబడులను నిరాశపరచే అంశాల్లో కీలకమైన న్యాయ వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించే పరిస్థితులు కల్పించాలి. న్యాయవివాదాలు, కేసుల పరిష్కారంలో ఆలస్యానికి కారణాలను గుర్తించాలి. ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దాలి. కీలక రంగాల్లో వాణిజ్యపరమైన నియంత్రణలను సడలించడం, అనుమతులు వేగంగా జారీచేయడం, రాయితీలు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహకరమైన, సులభతర వాణిజ్య వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ప్రైవేట్ రంగం నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించడం తేలికవుతుంది. ఫలితంగా దేశంలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఉత్పత్తి, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయి. దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా పరుగులు తీస్తుంది. మొత్తంగా దేశం పురోగామి పథాన ముందుకు సాగుతుంది.
ఆచార్య బి.ఆర్.కె.రావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Sports News
పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య