మాయదారి నేతలు

‘భూమండలం మీద ఇప్పటికీ సత్యం బతికి బట్ట కడుతోందంటే రాజకీయ నాయకుల వల్లే...!’ ‘అదేంటి అంత మాట అనేశావు, అసలు నిజాన్ని నిలువునా పడుకోబెట్టి పాతరేసేదే రాజకీయ నాయకులంటూ అందరూ ఆడిపోసుకుంటుంటే, ఏకంగా అంతపెద్ద సర్టిఫికేట్టు ఇచ్చేశావు!’

Published : 30 Mar 2023 00:42 IST

‘భూమండలం మీద ఇప్పటికీ సత్యం బతికి బట్ట కడుతోందంటే రాజకీయ నాయకుల వల్లే...!’ 

‘అదేంటి అంత మాట అనేశావు, అసలు నిజాన్ని నిలువునా పడుకోబెట్టి పాతరేసేదే రాజకీయ నాయకులంటూ అందరూ ఆడిపోసుకుంటుంటే, ఏకంగా అంతపెద్ద సర్టిఫికేట్టు ఇచ్చేశావు!’

‘సమాజంలోని సర్వపాపాలకూ నేతలే కారణమనేది జగమెరిగిన సత్యమే కావచ్చు. నోరుజారిన నిజాల్ని అబద్ధాలుగా, అబద్ధాలన్నీ నిజాలే అన్నంతగా ఒప్పించే కళానైపుణ్యం ఎవరికి ఉంటుంది?’ 

‘అట్లాంటివయితే రాజకీయ నాయకుల డీఎన్‌ఏలు, ఫింగర్‌ప్రింట్లకే సొంతం!’

‘చేసింది చెప్పుకొని తిరిగేవాడే మొనగాడు అన్నట్లుగా, రాజకీయ నేతలు తాము తలుపు చాటున చేసేదీ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకసారి బయటికి చెప్పేస్తూనే ఉంటారు. అలాంటి నిజాయతీ వల్లే నేతల జాతి అంతర్ధానం కాకుండా మనుగడ సాగిస్తోంది. ఓట్ల పండగ వేళ నేతలు పోసిన సారా, పంచిన డబ్బుల గురించి జనం బయటికి చెప్పుకోలేరు. అదే నేతలు మాత్రం ఎక్కడ ఏ వాడలో ఎంత పంచిందీ లెక్కలతో రాసిపెట్టుకొని, అదే జనం సొమ్మును అక్రమ దందాల మాటున దండుకుంటూ అంతకంత వసూలు చేసుకోవడం లేదూ! అదే మరి నేతల నిజాయతీ. నాయకులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పెట్టుబడే! పెట్టిన ఖర్చుకు వందరెట్లు ప్రతిఫలం పిండేసుకుంటారు. జనం మాత్రం తీసుకున్న డబ్బుల్ని ఓటేసేలోపే దులిపేసుకుని, అయిదేళ్లూ నేతల కాళ్లచుట్టూ తిరుగుతుంటారు.’

‘డబ్బులిచ్చి ఓట్లు కొన్నామనే ధీమాతోనే కాబోలు నేతలు నోటికెంతతోస్తే అంత మాట్లాడేస్తుంటారు?’ 

‘అంతేమరి, డబ్బులిచ్చి ఓట్లు కొన్నామన్న ధైర్యమే సిగ్గూ మొహమాటాలకు చెల్లుచీటీ పాడేలా చేస్తుంది!’

‘అందుకేనా, ఘనత వహించిన నేత అనుయాయులతో ఆత్మీయంగా మనసు పంచుకొంటూ తాను ఏకంగా దొంగ ఓట్లతోనే గెలిచేశానంటూ ఘనంగా ప్రకటించారు?’ 

‘అంతేకదా, ఒకసారి ఓట్లు వేసి గెలిపించిన తరవాత, ఓటేసిన జనం కూడా ఏమీ చేయలేని ఘన జనస్వామ్యం మనది. ఓటు చేయి జారాక, ఓటర్లంతా బోడి మల్లయ్యలే! ఆ ధైర్యంతోనే నేతల నోటి వెంబడి ఎంతటి ఆణిముత్యాలైనా అలవోకగా జాలువారుతుంటాయి’

‘ఎంతైనా నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి, అది అందరివల్లా కాదు.’ 

‘అబద్ధానికి నిజం ముసుగేయడానికి, అన్యాయానికి న్యాయ తొడుగేయ డానికి, అక్రమాల్నీ సక్రమమేనని నమ్మించడానికి ధైర్యం మాత్రమే సరిపోదు... చావుతెలివితేటలు అవసరం. అవి నేతలకు పుట్టుకతోనే సంక్రమిస్తాయి.’

‘అయితే, నేతల కళలు అందరికీ అంత తేలికగా అబ్బేవి కాదన్నమాట...’

‘మన నేతలు కట్టించిన ఇళ్ల లెక్కల ప్రకారమైతే, ఇప్పటికే మన పొరుగు దేశం వాళ్లకీ ఇళ్లు దక్కి ఉండాలి. అన్నేసి ఇళ్లు కడితే మురికి వాడలు, మురుగుకాల్వల వెంబడి గుడిసెలు ఎందుకు ఉంటాయనేది మనలాంటి బడుగు బుర్రలకు అర్థం కాని అతిపెద్ద సందేహం. పేదరికాన్ని, పేదలను నిర్మూలించేశామంటూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వింటున్న మాటే, నేతలంతా పాడుతున్న పాచి పాటే. అయినా, డొక్కలెండిన అభాగ్యులు అడుగడుగునా దర్శనం ఇస్తూనే ఉంటారు. ఇంటింటికీ నీరిచ్చి, అందరి గొంతుల్లో అమృతం పోశామంటూ ఘంటాపథంగా చెబుతుంటారు. ప్రతి వీధిలో నీళ్ల బిందెల యుద్ధాలు ప్రత్యక్ష ప్రసారమవుతుంటాయి. నేతలు సృష్టించే కాల్పనిక వైరుధ్య ప్రపంచానికివే తార్కాణాలన్నమాట’

‘చెప్పేవేవీ చేయకుండా, చెయ్యనివాటినే చేసినట్లు చెబుతూ, మళ్ళీ ఓట్ల కోసం ప్రజల వద్దకు ఎలా వస్తారు?’

‘జనానికి జ్ఞాపక శక్తి తక్కువనేది నేతలందరూ విశ్వసించే ప్రాథమిక సిద్ధాంతం. అన్ని రాజకీయాల్నీ అదే నడిపించేస్తోంది!’

‘మరి, నిజంగానే జనం అన్నీ మరిచిపోతారా?’

‘జనానికి ఉన్న బలహీనతే నేతల్ని నమ్మే గుణం, ఇంకోసారి చూద్దాం, అవకాశం ఇద్దాం వంటి హృదయ వైశాల్యపు గుణాలే నేతలకు ప్రాణం పోస్తున్నాయి. అవీఇవీ అన్నీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చి, ఏదీ చెయ్యకపోయినా, ఎన్నికలవేళకు ఠంచనుగా జనం ముంగిట వాలిపోయి, అదే పాత పద్దు ఏకరువు పెడుతుంటారు. జనం కూడా పాతవి వదిలేసి, ఎప్పటికప్పుడు కొత్తవి నమ్మేస్తుంటారు. అదే నేతలకు అలుసవుతోంది. నిజంగానే పాతవన్నీ గుర్తుపెట్టుకొని, అడిగి కడిగేసేట్లయితే, నేతలు మొహం దాచుకోవడానికి చోటుదక్కదు. మొదటిసారి అమాయకంగా ఒకసారి అవకాశం ఇవ్వమంటారు, ఇంకోసారి ఇస్తే కదా అంతా తెలిసేది అంటూ రెండోసారి ఇవ్వమంటారు, ఇంకొక్కసారి ఇచ్చి చూడమని మరోసారి అర్థిస్తారు. అలా ఒక్కోసారి అంటూ వారు అడగడం, ఓటర్లు ఇస్తుండటం... పేరబెట్టిన సమస్యలు సైతం ఎక్కడివక్కడే తిష్ఠవేసుకుపోవడం... సాగిపోతోందలా! మారాల్సిందెవరో జనమే తేల్చుకోవాలి!’

 శ్రీనివాస్‌ దరెగోని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.