ప్రమాదంలో చిత్తడి నేలలు

ఆవరణ వ్యవస్థకు మూత్రపిండాలుగా చిత్తడినేలలను వ్యవహరిస్తారు. ఇటీవల భారత్‌లో మరో అయిదు చిత్తడినేలలు రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలో చేరాయి. దాంతో వాటి సంఖ్య ఎనభైకి చేరింది. 

Published : 26 Apr 2024 00:10 IST

ఆవరణ వ్యవస్థకు మూత్రపిండాలుగా చిత్తడినేలలను వ్యవహరిస్తారు. ఇటీవల భారత్‌లో మరో అయిదు చిత్తడినేలలు రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలో చేరాయి. దాంతో వాటి సంఖ్య ఎనభైకి చేరింది.  కానీ, దేశంలోని చిత్తడినేలలు వేగంగా అంతరించిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

భూగర్భ జలాలను పునరుద్ధరించడం, కర్బన స్థాపన, సముద్రతీర స్థిరీకరణ, వరదల నియంత్రణ తదితర ఎన్నో అమూల్యమైన ప్రకృతి సేవలకు చిత్తడినేలలు ఆధారం. ఇవి ప్రపంచవ్యాప్తంగా వాటి చుట్టూ నివసించే కోట్ల మందికి మత్స్య సంపద ద్వారా ఆహార భద్రతను, జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించి ఇరాన్‌లోని రామ్‌సర్‌లో చరిత్రాత్మక సదస్సు జరిగింది. ఈ ఒప్పందంలో భాగస్వామ్యం కలిగిన ఇండియా- దేశీయంగా చిత్తడి నేలలను రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలో చేరుస్తూ వాటి సంరక్షణకు కృషి చేస్తోంది. ఇటీవల తమిళనాడు నుంచి రెండు, కర్ణాటక నుంచి మూడు చొప్పున చిత్తడినేలల ప్రాంతాలు రామ్‌సర్‌ క్షేత్రాల సరసన చేరాయి. దాంతో దేశీయంగా మొత్తం రామ్‌సర్‌ క్షేత్రాలు 80కి చేరాయి. యూకే(175), మెక్సికో(144), చైనా(82) తరవాత అత్యధిక రామ్‌సర్‌ క్షేత్రాలున్న నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. అయితే, దేశీయంగా చిత్తడినేలలు ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అడవుల కంటే మూడు రెట్ల వేగంతో అవి అదృశ్యమవుతున్నాయి.

జలవ్యవస్థలో వచ్చే మార్పులు, కాలుష్యం, కట్టుతప్పిన పర్యటక కార్యకలాపాలు, శీతోష్ణస్థితి మార్పుల వల్ల చిత్తడి నేలల ఉనికి ప్రమాదంలో పడింది. పంట పొలాల నుంచి వెల్లువెత్తే ఎరువులు కలిగిన నీరు వల్ల చిత్తడినేలల్లో నీటి పాచి పెరిగిపోతోంది. దాంతో, తగినంత ఆమ్లజని అందక వాటిలోని జలచరాలు క్షీణిస్తున్నాయి. సరైన ప్రణాళిక లేకుండా దేశీయంగా పట్టణాలు విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయి. వాటి నుంచి పోటెత్తుతున్న వ్యర్థాలు చిత్తడి నేలల సహజ స్వభావాన్ని దెబ్బతీస్తున్నాయి. గంగానదీ వరద మైదానాలలో ఉన్న చాలా చిత్తడి నేలలు శుద్ధి చేయని మురుగు నీరు, పొంట పొలాల నుంచి వచ్చే రసాయన జలాల వల్ల క్షీణ దశకు చేరుకుంటున్నాయి. అన్యప్రాంతాల మొక్కలు, జీవులు దేశంలో అంతర్గతంగా ఉన్న ఎన్నో చిత్తడి నేలలను ఆక్రమించాయి. ఇవి స్థానిక జీవవైవిధ్యాన్ని, ఆవాసాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కటక్‌లోని అంశుపా సరస్సు, అస్సామ్‌లోని దీపోర్‌ బీల్‌, జమ్మూ కశ్మీర్‌లోని సురిన్సర్‌-మాన్సర్‌ వంటి సరస్సులు గుర్రపు డెక్క తదితరాలతో నిండిపోయాయి. విచ్చలవిడిగా పశువులను మేపడం, గనుల తవ్వకాలు, ఉపాధి కోసం అతిగా ఆధారపడటం వల్ల చిత్తడి నేలల జీవ వైవిధ్యంపై ప్రభావితమవుతోంది. మరోవైపు నానాటికీ పెరుగుతున్న పర్యటకం వల్లా చిత్తడి నేలలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. పది లక్షలకు పైగా యాత్రికులు ఏటా కేరళ బ్యాక్‌ వాటర్స్‌ను సందర్శిస్తారు. ఒడిశాలోని చిలికా, మహారాష్ట్రలోని లోనార్‌ తదితర ఎన్నో చిత్తడి నేలలు పర్యటకం వల్ల ప్రభావితమవుతున్నాయి. చిత్తడి నేలల ప్రాంతాల్లో పర్యటకాన్ని అభివృద్ధి చేసే సమయంలో ఆయా ఆవాసాల లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగా సరైన ప్రణాళికలతో ముందుకు సాగితేనే చిత్తడి నేలలను కాపాడుకోగలం. 

చిత్తడి నేలలు క్షీణించడానికి మరో ముఖ్యమైన కారణం- వాతావరణ మార్పులు. కాలుష్య ఉద్గారాలు అంతకంతకు పెరుగుతుండటం వాతావరణ మార్పులకు దారితీస్తోంది. ఎక్కువ ఎత్తులో ఉన్న, తీరప్రాంత చిత్తడి నేలలపై శీతోష్ణ స్థితి మార్పులు అధికంగా ఉంటాయి. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే, 84శాతం దాకా తీర ప్రాంత చిత్తడి నేలల మనుగడ ప్రమాదంలో పడుతుందని ఒక అంచనా! శీతోష్ణస్థితి మార్పుల వల్ల సముద్ర తీరానికి దూరంగా ఉండే చిత్తడినేలల్లోనూ నీటి పాచి విచ్చలవిడిగా పెరుగుతోంది. పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పంట పొలాలకు మళ్ళించడం వల్లా చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయి. ఆవరణ వ్యవస్థలో చిత్తడి నేలలు అత్యంత కీలకం కాబట్టి, వాటి సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చిత్తడి నేలల్లో వస్తున్న పరిణామాలను గుర్తించాలి. తదనుగుణంగా వాటి నియంత్రణపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వ్యర్థ జలాలు, రసాయనాలు కలవకుండా సమర్థంగా నిరోధించాలి. పర్యటకం పరంగానూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అటవీ, అటవీయేతర ప్రాంతాల్లో జీవవైవిధ్యం పరంగా ప్రాధాన్యం కలిగిన చిత్తడి నేలలను రక్షిత ప్రాంతాలుగా, రామ్‌సర్‌ క్షేత్రాలుగా ప్రకటించాలి. 

 ఎం.ఆర్‌.మోహన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.