విత్తన నాణ్యతపై నిఘా

వ్యవసాయాభివృద్ధిలో విత్తన రంగ పాత్ర చాలా కీలకం. ఈ విషయంలో భారత్‌ సైతం ముందడుగు వేస్తోంది. ఏటికేడు విత్తన మార్కెట్‌ విస్తృతమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహిస్తే మనదేశం విత్తన భాండాగారంగా మారే అవకాశముంది. మనదేశ జనాభాలో సగానికిపైగా వ్యవసాయమే జీవనాధారం.

Published : 01 May 2024 01:10 IST

వ్యవసాయాభివృద్ధిలో విత్తన రంగ పాత్ర చాలా కీలకం. ఈ విషయంలో భారత్‌ సైతం ముందడుగు వేస్తోంది. ఏటికేడు విత్తన మార్కెట్‌ విస్తృతమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహిస్తే మనదేశం విత్తన భాండాగారంగా మారే అవకాశముంది.

మనదేశ జనాభాలో సగానికిపైగా వ్యవసాయమే జీవనాధారం. 58 శాతం కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలు దీనిపై ఆధారపడుతున్నాయి. దేశాభివృద్ధి ఈ రంగం పురోగతిపైనే ఆధారపడి ఉంది. 1960ల నాటి హరిత విప్లవం అనంతరం ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఇతర పంటల ఉత్పత్తి సైతం ఎగబాకింది. కొన్నేళ్లుగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దిగుబడులు తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాల రూపకల్పన అనివార్యంగా మారింది.

ప్రోత్సాహమే కీలకం

వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత నాణ్యమైన విత్తనాలపై ఆధారపడి ఉంటాయి. 1963లో జాతీయ విత్తన సంస్థ ఏర్పాటుతో దేశంలో విత్తనోత్పత్తికి పునాది పడింది. గత పదేళ్లలో భారత్‌లో విత్తన పరిశ్రమ బాగా విస్తరించింది. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగం ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. ఆధునిక వంగడాలు చీడపీడలను తట్టుకునేలా, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేలా, పోషక విలువలను కలిగి ఉండేలా విత్తన పరిశ్రమలో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రపంచంలో విత్తనాల ఎగుమతికి భారీ అవకాశాలున్నాయి. ఇందులో భారత్‌ వాటా చాలా తక్కువ. దేశంలో విస్తారమైన భూములు, వివిధ పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నందువల్ల విత్తన ఎగుమతులను గణనీయంగా పెంచుకోవచ్చు. ఇదే లక్ష్యంతో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం భారత విత్తన సహకార సంఘాన్ని  ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్‌లను) అనుసంధానం చేస్తుంది. పీఎసీఎస్‌ల ద్వారా రైతులు తమ పొలంలో విత్తనోత్పత్తి చేపట్టడానికి అవకాశం కల్పిస్తుంది. దేశంలో ప్రస్తుతం 465 లక్షల క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉండగా- 165 లక్షల క్వింటాళ్లే ప్రభుత్వ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి.

అధిక నాణ్యత ఉన్న విత్తనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. కాబట్టి ఈ రంగానికి ప్రభుత్వం నుంచి మద్దతు చాలా అవసరం. విత్తన సాంకేతికత అభివృద్ధికి, ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. విత్తన పరిశోధనలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ఇతోధికంగా ప్రోత్సహించాలి. భారత్‌ ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ పప్పులు, నూనె గింజలు, కూరగాయల డిమాండ్‌ను తీర్చడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇక్రిశాట్‌ వంటి సంస్థలు ఈ పంటలపై పరిశోధనలు జరుపుతున్నాయి. కొన్ని నూతన రకాలను అందుబాటులోకి తెచ్చాయి. అనేక ప్రైవేటు కంపెనీలు హైబ్రిడ్‌ వంగడాలను రూపొందిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలను రూపొందించడంవల్ల అమెరికా, ఐరోపాలో తృణధాన్యాలు (112శాతం), బంగాళాదుంప (24శాతం) దిగుబడులు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేయడం వల్ల 40 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగింది. అయితే సంప్రదాయ రకాలతో పోలిస్తే హైబ్రిడ్‌ వంగడాల్లో పోషక విలువలు తగ్గుతున్నట్లు ఇటీవల ఓ అధ్యయనం గుర్తించింది. దీనిపై విత్తనోత్పత్తి సంస్థలు దృష్టి   సారించాలి. సంప్రదాయ వంగడాల పరిరక్షణకు కృషి చేయాలి. విత్తన రంగంలో మనదేశ సామర్థ్యాన్ని ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్‌ఏఓ) గుర్తించింది. పలు దేశాలకు విత్తనాలను అందించే సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొంది. ఈ అవకాశాన్ని ఇండియా సమర్థంగా వినియోగించుకోవాలి.

ధరలు తగ్గేలా చర్యలు

ప్రస్తుతం అనేక ప్రైవేటు కంపెనీలు అన్నదాతలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని విత్తన పంటలను సాగు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో రైతుల ప్రయోజనాలకు రక్షణ ఉండాలి. పలుచోట్ల కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు మార్కెట్లో నకిలీ విత్తనాల బెడదను అరికట్టడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది. రైతులకు అవసరమయ్యే అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వాలు అందించలేకపోవడం కూడా సమస్యగా మారుతోంది. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలను ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సరఫరా చేస్తే నకిలీల సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. అధిక ఖర్చు కారణంగా చిన్న సన్నకారు రైతులు మెరుగైన విత్తనాలను ఉపయోగించలేకపోతున్నారు. వాటి ధరలు తక్కువగా ఉండేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. విత్తన రంగం అభివృద్ధి చెందితే అటు రైతులకు, ఇటు ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

డి.ఎస్‌.బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.