కదం తొక్కిన విద్యార్థి లోకం

పాలస్తీనియన్లకు అనుకూలంగా, గాజాలో ఇజ్రాయెల్‌ దమనకాండ విషయంలో అగ్రరాజ్య విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత మూడు వారాలుగా అక్కడి యూనివర్సిటీలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. వందల మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

Updated : 03 May 2024 07:05 IST

పాలస్తీనియన్లకు అనుకూలంగా, గాజాలో ఇజ్రాయెల్‌ దమనకాండ విషయంలో అగ్రరాజ్య విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత మూడు వారాలుగా అక్కడి యూనివర్సిటీలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. వందల మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినా, ఈ ఆందోళనలు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.

గాజాలో విధ్వంసాన్ని ఆపాలని అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి నెలకొంది. అదే సమయంలో టెల్‌అవీవ్‌ను ఒప్పించి పాలస్తీనియన్లపై జరుగుతున్న నరమేధాన్ని అడ్డుకోవాలని అమెరికానూ పలు దేశాలు బలంగా కోరుతున్నాయి. అయినా, ఎలాంటి ఉపయోగం ఉండటంలేదు. ఇజ్రాయెల్‌ దమనకాండకు వ్యతిరేకంగా కొన్ని వారాలుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న నిరసనలు అటు వాషింగ్టన్‌ను, ఇటు టెల్‌అవీవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విద్యార్థులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అమెరికా అధికారులు బయటకు చెబుతున్నా, ఈ ఆందోళనలు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయం వారిని లోలోపల వెంటాడుతోంది.

ఈ తరహా ఆందోళనలు అమెరికాకు కొత్త కాదు. గతంలో పౌర హక్కుల ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక పోరాటంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఏడు నెలల ఇజ్రాయెల్‌ దమనకాండలో 34 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నరమేధంగా పేర్కొంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని దక్షిణాఫ్రికా ఆశ్రయించింది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం తాము అమాయక పౌరులను చంపడం లేదని, 13 వేలకుపైగా హమాస్‌ ఉగ్రవాదులను మాత్రమే హతమార్చామని చెబుతున్నారు. ఇందుకు ఆధారాలను ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ ఎక్కడా చూపలేదు. ఉత్తర, మధ్య గాజాలపై భూతల దాడులు నిర్వహించి అక్కడ ఉన్న పాలస్తీనియన్లను ఈజిప్టు సరిహద్దుల సమీపంలోని రఫా నగరానికి ఇజ్రాయెల్‌ తరిమివేసింది. ఇప్పుడు రఫాలో దాదాపు 13 లక్షల మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. రఫాపై దాడి చేస్తే హమాస్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా నాశనమవుతుందని టెల్‌అవీవ్‌ భావిస్తోంది. అదే జరిగితే వేల సంఖ్యలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతారని ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతున్నాయి. రఫాపై దాడి వద్దంటూనే ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం ముమ్మరంగా ఆయుధ సాయం అందిస్తోంది. ఈ క్రమంలో అమెరికా వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇజ్రాయెల్‌ జాతిహననానికి వ్యతిరేక ఆందోళనలకు న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం కేంద్ర బిందువైంది. పాలస్తీనీయులపై నరమేధాన్ని ఇజ్రాయెల్‌ ఆపాలని, తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ఈ వర్సిటీ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. గత నెల 18న కొలంబియాలో 108 మంది నిరసనకారులను అరెస్టు చేయడంతో అమెరికావ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమన్నారు. లాస్‌ ఏంజెలిస్‌ నుంచి న్యూయార్క్‌ వరకు కదం తొక్కారు. పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహించారు. తరగతి గదులను బహిష్కరించారు. వారికి మద్దతుగా ఆచార్యులూ గళం వినిపించారు. వర్సిటీ ప్రాంగణాల్లోనే గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసనకారులు ఆందోళనలను కొనసాగించారు. హార్వర్డ్‌, యేల్స్‌, ఎంఐటీ, ప్రిన్స్‌టన్‌... ఇలా దేశంలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలన్నీ ఇజ్రాయెల్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థుల గుడారాలను కూల్చివేశారు. వందల మందిని అరెస్టు చేశారు.

ఈ ఆందోళనలు ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా తదితర దేశాలకూ వేగంగా పాకాయి. పారిస్‌లోని ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ స్టడీస్‌ విద్యార్థులు క్యాంపస్‌లోని పరిపాలన భవనాలను దిగ్బంధించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌, సిడ్నీల్లోనూ గుడారాలు వేసుకొని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇవి బైడెన్‌ సర్కారును ఇరకాటంలోకి నెట్టాయనే చెప్పాలి. నవంబరులో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ముస్లిం వర్గాల ఆగ్రహం డెమొక్రాట్లకు చేటు చేసే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా కాల్పుల విరమణకు ఇటు హమాస్‌ను, అటు ఇజ్రాయెల్‌ను అగ్రరాజ్యం ఒప్పించాలి. అప్పుడే వర్సిటీల్లో వేడి చల్లారే అవకాశం ఉంది.

మొకర శ్రీనివాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.