ప్రాణాలతో చెలగాటం

నీటి ప్రమాదాల రూపంలో మృత్యువు చిన్నారులు, యువకులను కబళిస్తోంది. వేసవి సెలవుల్లో చాలామంది చెరువులు, బావులు, సముద్ర తీరాల్లో ఈతకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతారు. ఆ సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తపడటం అవసరం.

Published : 08 May 2024 00:38 IST

నీటి ప్రమాదాల రూపంలో మృత్యువు చిన్నారులు, యువకులను కబళిస్తోంది. వేసవి సెలవుల్లో చాలామంది చెరువులు, బావులు, సముద్ర తీరాల్లో ఈతకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతారు. ఆ సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తపడటం అవసరం.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.36 లక్షల మంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతున్నారు. ఇటువంటి మరణాల్లో 90శాతం మధ్య ఆదాయ దేశాల్లోనే చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో 2022లో నీటిలో మునిగి సుమారు 38,000 మంది మృత్యువాతపడ్డారని జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదించింది. వాటిలో అత్యధిక మరణాలు మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి. తెలంగాణలో ఇటీవల శ్రీరాంసాగర్‌లో ఈతకు వెళ్ళి ముగ్గురు యువకులు మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వద్ద సంపులో పడి అయిదేళ్ల బాలుడు చనిపోయాడు. చిత్తూరుకు చెందిన నలుగురు విద్యార్థులు చెన్నై సముద్రతీరంలో ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ప్రమాదాలు ఇటీవల తరచూ నమోదవుతున్నాయి.

నీటి ప్రమాదాలకు గురవుతున్నవారిలో1-9 సంవత్సరాల మగపిల్లలే ఎక్కువగా ఉంటున్నట్లు పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటివద్దే విడిచిపెట్టి కూలి పనులకు వెళ్తున్నారు. తరవాత చిన్నారి బాలలు ఇంట్లో ఉండే నీటి తొట్టెలు, బకెట్లలో పడి మృత్యువాత పడుతున్నారు. అయిదేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న చిన్నారులు తోటివారి ప్రోద్బలంతో ఈత కోసమని చెరువులు, బావుల్లో దిగుతున్నారు. సరిగ్గా ఈత రాకపోవడం, పెద్దలెవరూ లేకపోవడంతో వారు నీటిలో మునిగిపోతున్నారు. కళాశాల విద్యార్థులు పర్యటన కోసంసముద్రతీరాలు, జలపాతాల వద్దకు వెళ్తుంటారు. అక్కడి బీచ్‌లు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలపై సరైన అవగాహన లేకపోవడం, ప్రమాదాలను అంచనా వేయలేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని రక్షించే ప్రయత్నంలో మరికొందరు కడలిపాలవుతున్నారు. నీటి ప్రమాద బాధితుల్లో కొందరికి తల భాగంలో గాయాలవుతున్నాయి. అలాంటివారు ప్రాణాలతో బయటపడినప్పటికీ, దీర్ఘకాలిక వైకల్యంతో బాధపడుతున్నారు. భారీ వానలకు ఇళ్లు నీట మునిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, జాతరల సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేటప్పుడు ఎంతోమంది మృత్యువుపాలవుతున్నారు. ఇటువంటి మరణాల్లో చాలామటుకు నమోదు కావడంలేదు. దాంతో నీటి ప్రమాదాలపై సరైన డేటా కొరవడుతోంది. చాలా దేశాల్లో ఈ సమస్యను నివారించే సమర్థ కార్యాచరణ కానరావడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగడ ఆందోళన వ్యక్తం చేసింది.

జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం, నీట మునిగి చనిపోతున్నవారిలో 21శాతం 18 ఏళ్లలోపు వయసున్నవారే! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను నివారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నీటి ప్రమాదాలపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అటువంటి ప్రమాదానికి గురైనప్పుడు ఎలా బయటపడాలి, బాధితులకు ప్రథమ చికిత్స ఎలా చేయాలన్నది వారికి వివరించాలి. బంగ్లాదేశ్‌లో పిల్లలు జల ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరకాలంలో అవి మంచి ఫలితాలు ఇచ్చినట్లు గుర్తించారు.  భారత్‌లో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే తల్లులకు తప్పనిసరిగా తమ పిల్లలు నీటి ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. ఆశా కార్యకర్తలు దోమల నిర్మూలనకు ఇంటింటా ‘డ్రై డే’ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడే... చిన్నపిల్లలు నీటి తొట్టెల్లో పడి ప్రమాదానికి గురికాకుండా కుటుంబ పెద్దలకు తగిన జాగ్రత్తలు సూచించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్టాల్లో పర్యటక శాఖ అధికారులు తమ పరిధిలోని జలపాతాల దగ్గర నీటి ప్రమాద హెచ్చరిక బోర్డులు, అవసరమైనచోట్ల ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేయాలి. అలాగే చెరువులు, నదుల్లో పడవ ప్రయాణికులందరికీ లైఫ్‌ జాకెట్లను సమకూర్చాలి. బడి ఈడు పిల్లలకు, యువతకు నీటి భద్రత, ఈత, సహాయక చర్యలపై నిపుణులతో శిక్షణ ఇప్పించాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల నీటి ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణను ఆవిష్కరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా కృషిచేస్తే నీటి ప్రమాదాల బారి నుంచి భావితరాన్ని రక్షించుకోవచ్చు.

 సిరిపురం శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.