అంతా నాదే!

‘హాయ్‌...’‘ఎవరు నువ్వు?’‘నీ బిడ్డను.’‘ఛీ... నాకింకా పెళ్ళేకాలేదు!’‘అయినా సరే, బిడ్డనే!’‘ఏడ్చినట్టుంది... ఇంతకీ ఎందుకొచ్చావ్‌?’‘నీకు మంచి చేయడానికి!’‘ఏం మంచి?’‘నీ పేరు మీద అరెకరం భూమి ఉంది కదా!’‘ఆఁ... ఉంటే?’‘పాపం నువ్వు చూసుకోలేవు... నాకిచ్చెయ్‌!’

Published : 08 May 2024 00:39 IST

‘హాయ్‌...’

‘ఎవరు నువ్వు?’

‘నీ బిడ్డను.’

‘ఛీ... నాకింకా పెళ్ళేకాలేదు!’
‘అయినా సరే, బిడ్డనే!’
‘ఏడ్చినట్టుంది... ఇంతకీ ఎందుకొచ్చావ్‌?’
‘నీకు మంచి చేయడానికి!’
‘ఏం మంచి?’
‘నీ పేరు మీద అరెకరం భూమి ఉంది కదా!’
‘ఆఁ... ఉంటే?’
‘పాపం నువ్వు చూసుకోలేవు... నాకిచ్చెయ్‌!’
‘ఇదేం విడ్డూరం... నా భూమి నీకెందుకు ఇస్తాను?’
‘నువ్వు ఇవ్వొద్దు... నేను తీసుకుంటా, యాక్టు కూడా తెచ్చా’
‘తమాషాలా? పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తాను’
‘తీసుకోరు’
‘కోర్టులో పిటిషన్‌ వేస్తాను’
‘రాసుకోరు’
‘మీడియాలో గోల చేస్తాను’
‘ప్రసారం అవ్వదు’
‘అసలు ఏం కావాలి నీకు?’
‘నిన్ను నా గుండెల్లో ఉంచా కదా... ఇక ఇల్లెందుకు? నాకిచ్చెయ్‌’
‘నీకిస్తే నేనెక్కడ ఉండాలి?’
‘చెప్పాగా, నా గుండెల్లో!’
‘సరిపోతుందా?’
‘నాలుగు గదులున్నాయి... విత్‌ అటాచ్డ్‌ బాత్రూమ్‌’
‘అయినా నేనివ్వను’
‘ఇవ్వకపోయినా తీసుకుంటా’
‘ఇదేం రౌడీయిజం?’
‘అదే నా పాలన తీరు’
‘నన్ను వదిలేయ్‌ ప్లీజ్‌’
‘నావాడివి.. నిన్ను ఎలా వదులుతాను?’
‘పోనీ ఇల్లు తీసుకుని వదిలేయ్‌’
‘పశువులంటే నాకు ప్రాణం’
‘అయితే?’
‘రెండు ఆవులున్నాయిగా... అవి నాకే!’
‘ప్లీజ్‌.. బెంగ పెట్టుకుంటాయి, వద్దు’
‘ఇవ్వకపోతే నేనూ బెంగతో బుంగమూతి పెడతా’
‘నోరులేని వాటి మీదనా నీ కన్ను?’
‘కాదేదీ కబ్జాకు అనర్హం’
‘అవి తీసుకునైనా వదిలేస్తావా...?’
‘నువ్వు కష్టపడితే నేను చూడలేను’
‘అయితే?’
‘అందుకే ఉద్యోగం ఇప్పించలేదు’
‘అందుకేగా కూలి చేసుకుంటున్నా’
‘నువ్వు కూలికెళ్తే నాకు ఎంత నామోషీ!’
‘అయితే?’
‘అందుకే కంపెనీని మూయించా’
‘అయ్యాయ్యో!’
‘కమిషన్లు ఇవ్వలేకపోయాం అని చెబుతారు, నమ్మకు’
‘ఓరి దుర్మార్గుడా’
‘ఇక హాయిగా ఇంట్లో కూర్చో’
‘అప్పుడు ఏం తిని బతకాలి?’
‘నా ప్రేమ తిను’
‘నువ్వెక్కడ దొరికావయ్యా, సైకోలా ఉన్నావే..’
‘నువ్వేగా ఒక్క ఛాన్స్‌ అంటే ఇచ్చావ్‌’
‘నీబుద్ధి తెలియక ఇచ్చా... ఇక పో చాలు’
‘మీ అమ్మ మా అమ్మలాంటిది’
‘ఇందాక నా బిడ్డను అన్నావ్‌?’
‘ఆమె నగల్లో నాకు వాటా ఉంది’
‘ఇదేం గోలరా నాయనా!’
‘అందుకే మొత్తం నాకు, మిగతా సగం నీకు!’
‘ఆఁ... అదేం పంపకం?’
‘అంతే... మొత్తం నాకు, మిగిలిన సగం నీకు’
‘అంతా నువ్వు తీసుకుంటే నాకేంటి మిగిలేది చిప్ప’
‘ఆ చిప్ప కూడా నాదే, ఫ్యూచర్లో అవసరం ఉంది’
‘పోవయ్యా ఇక...’
‘పోలేను, నువ్వంటే నాకిష్టం’
‘నీ ఇష్టం మన్నుబెట్ట’
‘బ్యాంకు ఖాతా వివరాలు చెప్పు’
‘నీకెందుకు చెప్పాలి?’
‘నిధుల మళ్ళింపు’
‘అది పెద్ద పెద్ద పథకాలకు చేస్తారు’
‘ఇదీ పథకమే... ఖాతా కొట్టు, డబ్బు పట్టు అని...’
‘అంటే నా డబ్బులు తీసేసుకుంటావా?’
‘ఛ... నీది, నాది అనే భేదాలెందుకు?’
‘నీకంటే గెద్ద నయం’
‘పొగడకు... నాకు నచ్చదు’
‘నా దగ్గర ఇక ఏం మిగల్లేదు, వెళ్ళిపో’
‘నువ్వు నావాడివి’
‘ఆపు, వినడానికే చిరాగ్గా ఉంది’
‘నాకోసం ఏమైనా చేస్తావు కదూ’
‘నేను చేయను, నువ్వే చేయిస్తున్నావ్‌’
‘నీ మీద సర్వహక్కులూ నావే’
‘అంటే ఏం చేస్తావయ్యా బాబు!!’
‘కిడ్నీలు కెనడాకు...’
‘అయ్యబాబోయ్‌...’
‘కళ్లు ఖతార్‌కి...’
‘నన్ను వదిలేయ్‌’
‘కాలేయం కాలిఫోర్నియాకి...’
‘వద్దు, వద్దు’
‘గుండె గినియాకి...’
‘నీకు దండం పెడతాను’
‘వద్దు, నేనే నీకు దండ వేస్తాను’
‘నిన్ను నమ్మినందుకు బుద్ధి చెప్పావ్‌’
‘అందుకే ఓటేసే ముందే చూసుకోవాలి’
‘ఈసారి చూస్తాలే, వెళ్లు...’
‘ఓయ్‌...’
‘ఏంటి...’
‘హలో...’
‘అబ్బా ఏంటి చెప్పు?’
‘ఒంటి మీద ఆ చెడ్డీ మాత్రం ఎందుకు... ఇచ్చేయ్‌’
‘కెవ్వ్‌.................’

   *        *       *

‘ఒరేయ్‌ రాజు, రాజు... ఏమైందిరా, ఎందుకలా అరిచావ్‌?’
‘అమ్మా, ఏదో పీడకల వచ్చిందమ్మా... చాలా భయమేసింది’
‘అయ్యయ్యో... భయపడకురా ఏం కాదు’
‘అమ్మా ఈసారి ఓటేసే ముందు చూసుకోవాలి, లేదంటే ఆ సినిమాలో చెప్పినట్లు బనియన్‌కి తెలీకుండా చెడ్డీ లాగేసేలా ఉన్నారు’
‘మరేం అనుకున్నావ్‌రా, ఓటంటే అయిదు వందల రేటు కాదు, అయిదేళ్ల ఫేటు... జాగ్రత్తపడకపోతే ఇక అన్నింటా అంతటా వెనకబడుతూనే ఉంటాం, ఇంతకీ కలలోకి ఎవరు వచ్చార్రా?’
‘వద్దులేమ్మా... ఆయన గురించి అనుకుంటే అప్పులు, తలచుకుంటే తిప్పలు... ఎందుకొచ్చింది! తెల్లారిపోయింది... పాలప్యాకెట్‌ తెస్తా పద!’
‘సర్లే పద!!’

 చంద్రమౌళిక సాపిరెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు