Published : 19/02/2022 19:08 IST

గులాబీలతో గులాబీ లాంటి అందం!

రంగురంగుల గులాబీలను చూస్తుంటే మనసు పులకించిపోతుంది కదూ! అంతేకాదు.. సౌందర్య పరిరక్షణలో గులాబీల పాత్ర ఎంతో ఉందంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ అసలు గులాబీల వల్ల మన చర్మానికి, శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

నల్లటి వలయాలు దూరం..!

కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడకుండా ఉండటానికి, ఒకవేళ ఇప్పటికే ఏర్పడితే వాటిని నివారించడానికీ గులాబీలను ఉపయోగించవచ్చు. కొద్దిగా రోజ్‌వాటర్‌ని తీసుకొని అందులో కాటన్‌ను ముంచి కళ్ల కింద రాయాలి. ఇలా కనీసం రెండురోజులకోసారి చేస్తే ఫలితం కనబడుతుంది. గులాబీలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన చర్మంపై వచ్చే దురద, మంట, లాంటి వాటినీ నివారిస్తాయి.

క్లెన్సర్ లాగానూ..!

గులాబీ మంచి క్లెన్సర్‌గా కూడా పని చేస్తుంది. రోజ్‌వాటర్ మన ముఖంపై ఉన్న జిడ్డుని, పేరుకుపోయిన మురికిని తీసేసి చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇదే విధంగా గులాబీ ఫేస్‌ప్యాక్‌తో కూడా ఇదే ప్రయోజనాలను పొందచ్చు. అంతేనా.. ఇందులో ఉన్న సహజసిద్ధమైన నూనెలు మన చర్మంలో ఉన్న తేమను పోనీయకుండా కాపాడతాయి. అందుకే స్నానం చేసే నీటిలో కాస్తంత రోజ్‌వాటర్‌ను కానీ, కొన్ని గులాబీ రేకులను కానీ వేస్తే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

విటమిన్ సి..!

గులాబీలలో విటమిన్ 'సి' శాతం చాలా ఎక్కువ. ఇవి అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే ఎండలోకి వెళ్లేముందు రోజ్‌వాటర్ అప్త్లె చేసుకొని వెళ్లడం మంచి పద్ధతి. అంతేకాదు.. గులాబీ ట్యాన్‌ని కూడా తొలగిస్తుంది. దీనికోసం కీరా దోస, గులాబీ, గ్లిజరిన్‌లు కలిపిన ప్యాక్‌ని వేసుకుంటే సరి. అంతేకాక ఇందులోని సహజసిద్ధమైన కండిషనింగ్ గుణాలు జుట్టును మెరిసేలా చేస్తాయి. దీనికోసం మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు వాడే షాంపూ లేదా కండిషనర్‌లో కొన్ని రోజ్ వాటర్ చుక్కలు వేస్తే సరి. లేదా గులాబీ రేకుల గుజ్జును జుట్టుకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే సరి. ఇలా చేస్తే జుట్టు మెత్తగా అవడమే కాక ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది.

ఫేస్ ప్యాక్స్‌లా కూడా..!

గులాబీని ఎన్నో రకాల ఫేస్‌ప్యాక్స్‌లో ఉపయోగించుకోవచ్చు. దీంతో సహజసిద్ధమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే వస్తువులతో గులాబీ రేకుల్ని కలిపి మంచి కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కొద్దిగా సెనగపిండి లేదా పెసరపిండి, కొంచెం నిమ్మరసం, గులాబీ రెక్కల పొడి, పాలమీగడ లేదా పెరుగు ఇవన్నీ కలిపి ఫేస్‌ప్యాక్ వేసుకుని ఒక ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంలో మునుపెన్నడూ లేని కాంతిని సంపాదించుకోవచ్చు.. అదేవిధంగా గులాబీ రేకులు, ఓట్స్, తేనె కలిపి గ్రైండ్ చేసుకొని ప్యాక్‌లా వేసుకోవచ్చు. గులాబీ రేకులను.. పాలు, పెరుగులతో కూడా కలుపుకొని ముఖానికి ప్యాక్‌లా పెట్టుకోవచ్చు. వీటివల్ల మెరిసిపోయే అందం మీ సొంతమవుతుంది.

ఆరోగ్యానికీ అవసరం..!

అందానికే కాదు.. ఆరోగ్యానికీ గులాబీలు ఎంతగానో ఉపయోగపడతాయి. గులాబీ రేకులతో టీ కాచుకుని తాగితే అజీర్తి తగ్గిపోతుంది. అంతేకాదు.. కడుపులో గడబిడ, నొప్పి, వాంతులు లాంటివి ఉన్నా.. గులాబీ రేకులతో చేసిన టీ తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. అలాగే ఒక్కోసారి ఒంటిపై పూర్తిగా దద్దుర్లు రావడం చూస్తుంటాం. చర్మం అంతా ఎర్రగా మారిపోయి ఒకటే దురదగా ఉంటుంది. ఇలాంటి సమయంలో గులాబీ రేకుల టీ తాగితే దద్దుర్లు త్వరగా తగ్గుతాయి. గులాబీ రేకులే కాదు.. గులాబీ ఆకులతో కూడా నీళ్లు కాచుకుని తాగితే అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోతాయి.

తలనొప్పా..?

ఒక్కోసారి తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గదు సరికదా.. చిరాగ్గా అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో గులాబీపువ్వు వాసన చూస్తే తలనొప్పి తొందరగా తగ్గుతుంది. లేదా గులాబీ రేకులతో చేసిన టీ తాగినా తలనొప్పి మాయమైపోతుంది.

చూశారుగా.. గులాబీలతో మీ అందాన్ని ఎలా ద్విగుణీకృతం చేసుకోవచ్చో.. ఆరోగ్యాన్నీ ఎలా కాపాడుకోవచ్చో.. మీరూ గులాబీలను వాడి గులాబీ లాంటి ముఖవర్ఛస్సుతో పాటు, మంచి ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోండి మరి..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని