వారి వ్యాపారాభివృద్ధి కోసం యాప్ రూపొందించి..!

వ్యాపారానికి వినియోగదారులే పట్టుగొమ్మలు. అలాంటి వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి కొనుగోళ్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్.. వంటి తాయిలాలు అందిస్తుంటాయి వివిధ సంస్థలు. అయితే ఇలా డిస్కౌంట్లు ఇవ్వడం, కస్టమర్లను....

Updated : 12 Jun 2023 18:42 IST

వ్యాపారానికి వినియోగదారులే పట్టుగొమ్మలు. అలాంటి వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి కొనుగోళ్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్.. వంటి తాయిలాలు అందిస్తుంటాయి వివిధ సంస్థలు. అయితే ఇలా డిస్కౌంట్లు ఇవ్వడం, కస్టమర్లను పెంచుకోవడం.. పేరుమోసిన వ్యాపార సంస్థలకు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ మధ్యస్థ, చిన్న తరహా వ్యాపారులకు తమ వ్యాపారాభివృద్ధికి తగిన సదుపాయాలు, మార్కెటింగ్‌ టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉండకపోవచ్చు.

క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సమస్యల్ని అర్థం చేసుకున్నారు హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి రెడ్డి. వీటికి పరిష్కారంగా తన బృందంతో కలిసి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారామె. దీని సహాయంతో మర్చంట్‌-కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ను పెంచుతూనే.. మధ్య-చిన్న తరహా వ్యాపారులు తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకోవడంలో పరోక్షంగా సహాయపడుతున్నారామె. ఈ క్రమంలో తన బిజినెస్‌ జర్నీ గురించి ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! యూఎస్‌లో ఎంబీఏ చదివాను. ఆపై మాస్టర్స్‌ చేసి.. 13 ఏళ్ల పాటు ఐటీ రంగంలో వివిధ హోదాల్లో పనిచేశాను. వ్యాపారం చేయాలన్నది నా చిన్ననాటి కల! ఈ మక్కువే నన్ను యూఎస్‌ నుంచి తిరిగి ఇండియాకు రప్పించింది.

వాళ్ల ఇబ్బందులు చూశాక..!

యూఎస్‌ నుంచి తిరిగొచ్చాక రిటైల్‌ బిజినెస్‌ చేశాను. ఈ క్రమంలో చాలామంది మధ్య స్థాయి రిటైల్‌ వ్యాపారులు మార్కెటింగ్‌ చేసే క్రమంలో, కస్టమర్లను చేరుకునే విషయంలో పలు సవాళ్లు ఎదుర్కోవడం నేను గుర్తించాను. వాళ్ల ఇబ్బందులు చూశాక మార్కెటింగ్‌ టెక్నాలజీని సులభతరం చేయాలనిపించింది. ఇదే ‘జితారా యాప్‌’కు తెరతీసేలా చేసింది. 2021లో ఈ యాప్‌ను ప్రారంభించా. ఇదొక లాయల్టీ స్టార్టప్. కస్టమర్లకు రివార్డులు అందించే ప్రక్రియ ద్వారా మధ్యస్థ-చిన్న తరహా వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మా యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో మా యాప్‌లో సభ్యులైన మర్చంట్స్‌ వద్ద ఓ క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులో ఉంటుంది. అదే మర్చంట్స్‌తో వారి కస్టమర్స్‌ని కలిపి ఉంచుతుంది.

ఆ లక్ష్యంతోనే..

కస్టమర్‌ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఏదైనా కొన్నప్పుడు వారికి కొన్ని రివార్డ్‌ పాయింట్లు అందేలా చూస్తాం. దీంతో పాటే మళ్లీ అదే షాప్‌లో షాపింగ్‌ చేసి మరో వోచర్‌ కొనుక్కోవచ్చన్న సందేశమూ వారికి వెళ్తుంది. అలాగే ఆయా సంస్థలు అందించే ఆఫర్ల గురించి కూడా తెలియజేస్తాం. తద్వారా కస్టమర్‌ని ఎంగేజ్‌ చేయగలుగుతున్నాం. ఫలితంగా అటు వ్యాపారులకు లబ్ది చేకూర్చడంతో పాటు ఇటు కస్టమర్లూ సంతృప్తి పడేలా చేయాలన్నదే మా ప్రయత్నం.

స్కాన్‌ చేయడమే తరువాయి..!

ప్రస్తుతం మా యాప్‌లో సుమారు 250కి పైగా మర్చంట్స్‌ సభ్యులుగా ఉన్నారు. జితారా క్యూఆర్‌ కోడ్‌తో కస్టమర్‌ పేమెంట్‌ చేయగానే వారికి రివార్డ్‌ పాయింట్లు వెళ్లేలా ప్రోగ్రామ్‌ సెట్‌ చేశాం. వాటిని తిరిగి ఉపయోగించుకోవాలంటే కస్టమర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అయితే ఇలా పొందిన పాయింట్లను అదే షాపులో అయితే నేరుగా వాడుకోవచ్చు.. ఇతర షాపుల్లో వాడుకోవాలంటే.. మా యాప్‌లోకి వెళ్లి.. ఆ పాయింట్లను వోచర్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది.

‘డ్యాష్‌బోర్డ్‌’తో..

ఏ రంగమైనా.. అది ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్ (వెబ్‌సైట్‌/యాప్‌) వ్యాపారమైనా.. ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీలున్న వ్యాపార సంస్థలను మేం టార్గెట్‌ చేస్తాం. బిజినెస్‌ సైజ్‌ను బట్టి మా క్యూఆర్‌ కోడ్‌ పొందిన మర్చంట్స్‌ నెలనెలా సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు యాడ్స్, వోచర్‌ లిస్టింగ్‌ ద్వారా మాకు ఆదాయం వస్తుంది. అలాగే కొనుగోళ్లు, కస్టమర్‌ రిటెన్షన్‌ని పెంచడంలో మర్చంట్‌కి మేమిచ్చే డ్యాష్‌బోర్డ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. దీని సహాయంతోనే మా వద్ద వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరుస్తాం. అలాగే ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ చేసుకోవడానికీ ఇది ఉపయోగపడుతుంది. ఇక సంబంధిత మర్చంట్ తరఫున కస్టమర్లకు వివిధ సందేశాలన్నీ వాట్సాప్‌లోనే పంపిస్తాం. అలాగే వాట్సాప్ ద్వారా ఉత్పత్తుల విక్రయానికి అవసరమయ్యే క్యాటలాగ్‌ను కూడా రూపొందించి ఇస్తాం. వాట్సాప్‌లో వచ్చిన ఆర్డర్స్‌నీ ట్రాక్‌ చేసి చూపిస్తాం.

అదే నా టార్గెట్!

వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే మన తపనకు తోడు ప్రోత్సాహం కూడా ముఖ్యమే! వీహబ్‌ నుంచి మాకు ఈ మద్దతు అందింది. గతేడాది అక్టోబర్‌లో వీహబ్‌లో ఇంక్యుబేట్‌ అయ్యాం. నెట్‌వర్కింగ్‌ పరంగాను, నిధుల సమీకరణలోను వీరి సహకారం ఎంతో! ఇక ఇటీవలే CII నుంచి దేశంలోనే ‘వందమంది ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తల జాబితా’లో నాకు చోటు దక్కింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మధ్య-చిన్న స్థాయి వ్యాపారుల వ్యాపారాభివృద్ధిపై దృష్టి సారించాం. అయితే భవిష్యత్తులో శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, దుబాయి, ఆగ్నేయాసియా దేశాలకూ మా వ్యాపారం విస్తరించాలన్న ఆలోచన చేస్తున్నాం. అలాగే మా యాప్‌ సేవల్ని 10 వేల మంది మర్చంట్స్‌కి అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నా. కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్‌ అవసరమున్న ప్రతి మర్చంట్‌కి అందుబాటులో ఉండాలన్నదే నా లక్ష్యం!

కష్టమనుకోవద్దు!

ఏ వ్యాపారంలోనైనా తొందర పనికి రాదు. చిన్న లక్ష్యాలు నిర్దేశించుకొని ఓపిగ్గా వాటిని చేరుకున్నప్పుడే సక్సెస్‌ సాధించగలం. అలాగే ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లే ధైర్యం ఉన్నప్పుడే ఈ రంగంలో రాణించగలం. కష్టమనుకుంటే ఏదైనా కష్టమే.. సానుకూల దృక్పథంతో ప్రారంభిస్తే ఎంత కష్టమైన పనైనా సులభంగా పూర్తి చేయచ్చు. ఎవరో రావాలి, ప్రోత్సహించాలి.. అని కాకుండా మనమే ధైర్యంగా ముందడుగు వేయగలిగినప్పుడు తప్పకుండా విజయం సాధించగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్