ఉద్యోగం రాగానే.. ఆర్థిక ప్రణాళిక..!

మన జీవితంలో చాలా అంశాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకుంటే చాలా సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 20ల్లోనే కెరీర్‌ ప్రారంభించే వారు ముందు నుంచే ఆర్థిక విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

Eenadu icon
By Vasundhara Team Published : 06 Jul 2025 18:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

మన జీవితంలో చాలా అంశాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకుంటే చాలా సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 20ల్లోనే కెరీర్‌ ప్రారంభించే వారు ముందు నుంచే ఆర్థిక విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

బడ్జెట్

ఆర్థిక క్రమశిక్షణలో మొదటి, ముఖ్యమైన అంశం బడ్జెట్‌ ప్రణాళిక వేసుకోవడం! ఈ క్రమంలో మీ ఆదాయ వ్యయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ఖర్చులకు కళ్లెం వేసుకోవాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత డబ్బును పొదుపు చేసుకోవడం, లాభాలొచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టడం.. వంటివీ ముఖ్యమే! ఇలా మీరు వేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండడం తప్పనిసరి! ఇక ఈ విషయాల్లో అవగాహన కోసం, సందేహాల నివృత్తి కోసం నిపుణుల్ని సంప్రదించచ్చు.. లేదంటే విశ్వసనీయమైన మొబైల్స్‌ యాప్స్‌నీ ఆశ్రయించచ్చు.

సిబిల్ స్కోర్ బాగుంటేనే..

కొన్ని లక్ష్యాలను సాధించడానికి అధిక మొత్తంలో డబ్బు అవసరమవుతుంటుంది. అలాంటి సందర్భాల్లో లోన్‌ కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సిన అవసరం రావచ్చు. అలాంటప్పుడు బ్యాంకులు సిబిల్ స్కోర్‌ను చెక్‌ చేస్తుంటాయి. ఈ స్కోరే మీ ఆర్థిక క్రమశిక్షణను నిర్ణయిస్తుంది. కాబట్టి ఇరవైల్లో ఉన్నప్పటి నుంచే మీ సిబిల్ స్కోర్‌ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్‌ కార్డుకి సంబంధించిన లావాదేవీలను సాధ్యమైనంత మేరకు అదుపులో పెట్టుకోవాలి. ఆ బిల్లులను కూడా గడువు లోపు చెల్లించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇల్లు కొనుక్కోవడం, సొంతంగా బిజినెస్‌ పెట్టుకోవడం వంటి లక్ష్యాల కోసం కావాల్సిన డబ్బును బ్యాంక్‌ లోన్ల ద్వారా సులభంగా పొందచ్చు.

రెండో ఆదాయం కూడా!

‘ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడద్దు. పెట్టుబడులతో ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలి’ - ప్రముఖ వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ చెప్పిన మాట ఇది! ఈ పద్ధతిని ఇరవైల్లో ఉన్నప్పట్నుంచే పాటిస్తే భవిష్యత్తులో ఆర్థికంగా దృఢంగా మారచ్చు. చాలామంది కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కేవలం ఆ సంపాదన పైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో మిగతా సమయాన్ని వృథా చేస్తుంటారు. అయితే దీనికి బదులుగా నిపుణుల సలహాతో సరైన పెట్టుబడుల ద్వారా రెండో ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవచ్చు.

అత్యవసర నిధి!

అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేయకుండా అత్యవసర నిధి కాపాడుతుంది. ఇందుకోసం ప్రతి నెలా మీ వేతనంలో కొంత మొత్తాన్ని కేటాయించాలి. ఆ డబ్బుని ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి వీలు లేకుండా ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చిన్న వయసులోనే ఇలాంటి పద్ధతిని పాటించడం వల్ల.. భవిష్యత్తులో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సులభంగా బయటపడగలుగుతారు.

లాభాలొచ్చేలా..

వృథా ఖర్చులు చేయద్దన్నారుగా అని కొంతమంది డబ్బులన్నీ సేవింగ్‌ ఖాతాలో జమ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. నెలవారీ ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఆర్థిక నిపుణుల సలహాతో మ్యూచువల్‌ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాల్ని ఆర్జించచ్చంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్