Hina Khan: భయపడకుండా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నా..!

క్యాన్సర్‌.. ఈ మాట వినగానే వణికిపోతాం. కానీ ఓవైపు ఈ మహమ్మారితో యుద్ధం చేస్తూనే.. మరోవైపు తమకెదురైన అనుభవాల్ని పంచుకుంటూ బాధితుల్లో స్ఫూర్తి నింపుతుంటారు కొందరు. అలాంటి క్యాన్సర్‌ వారియర్స్‌లో నటి హీనా ఖాన్‌ ఒకరు.

Eenadu icon
By Vasundhara Team Published : 31 Oct 2025 19:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

(Photos: Instagram)

క్యాన్సర్‌.. ఈ మాట వినగానే వణికిపోతాం. కానీ ఓవైపు ఈ మహమ్మారితో యుద్ధం చేస్తూనే.. మరోవైపు తమకెదురైన అనుభవాల్ని పంచుకుంటూ బాధితుల్లో స్ఫూర్తి నింపుతుంటారు కొందరు. అలాంటి క్యాన్సర్‌ వారియర్స్‌లో నటి హీనా ఖాన్‌ ఒకరు. ఏడాదిన్నర క్రితం మూడో దశ రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన ఆమె.. అప్పట్నుంచి ఈ వ్యాధితో అలుపెరుగని పోరాటం చేస్తోంది. అయినా నిరాశ చెందక దీన్ని జయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ఆమె.. తన క్యాన్సర్‌ అనుభవాల్ని, తీసుకొనే చికిత్సల్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది. మరోవైపు ఆయా వేదికలపై ప్రసంగిస్తూ క్యాన్సర్‌ వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాలు, అపోహలు తొలగించి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. అలా ఇటీవలే ఓ కార్యక్రమంలో భాగంగా హీనా పంచుకున్న తన క్యాన్సర్‌ అనుభవాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

బుల్లితెర నటిగా, వెండితెరపై పలు పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించింది హీనా ఖాన్‌. పలు రియాల్టీ షోలతోనూ మెప్పించింది. కెరీర్‌ పరంగా తానెంత బిజీగా ఉన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు, షూటింగ్‌ సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. అయితే తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గతేడాది జూన్‌లో వెల్లడించింది హీనా. ఈ వార్త విని ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిజానికి ఈ క్యాన్సర్‌కు సంబంధించి తనకు ఎలాంటి ముందస్తు సంకేతాలు కనిపించలేదని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా ఈ మహమ్మారి తనకు సోకిందని ఆ సమయంలో చెప్పుకొచ్చిందీ అందాల తార. ఇక అప్పట్నుంచి తన క్యాన్సర్‌ అనుభవాల్ని, ఈ వ్యాధిని జయించేందుకు తాను తీసుకుంటోన్న చికిత్సల గురించి సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో చెబుతూనే.. రొమ్ము క్యాన్సర్‌పై అందరిలో అవగాహన పెంచుతోంది.

అవి గుర్తించాలి!

అంతేకాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయా వేదికలపై ఈ వ్యాధికి సంబంధించి మాట్లాడుతూ బాధితుల్లో స్ఫూర్తి నింపుతుంటుంది హీనా. అలా ఇటీవలే ఓ సందర్భంలో తన క్యాన్సర్‌ అనుభవాల్ని మరోసారి నెమరువేసుకుందీ బ్యూటీ.

‘గతేడాది జూన్‌లో నాకు క్యాన్సర్‌ సోకిందని నిర్ధరణ అయింది. అయితే ఈ విషయం తెలియగానే నేను భయపడిపోలేదు. ఎలాగైనా ఈ వ్యాధిని జయించాలని గట్టిగా అనుకున్నా. అందుకు తగిన ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడగట్టుకున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో ఇది మరింత సులభమైంది. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా మన శరీరం మనకు కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. కానీ కొన్నిసార్లు ముందస్తు సంకేతాలేవీ లేకుండానే క్యాన్సర్‌ బయటపడచ్చు. నా విషయంలోనూ ఇదే జరిగింది. స్వీయ పరీక్షల ద్వారా నేను కణితిని గుర్తించలేకపోయా. కానీ రెగ్యులర్‌ చెకప్స్‌ ద్వారా అది బయటపడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిర్ణీత వ్యవధుల్లో ఆయా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే శరీరం మాట వింటూనే.. అది పంపే సంకేతాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే.. సంబంధిత వైద్యుల్ని సంప్రదించాలి. అప్పుడే పరిస్థితి ప్రాణాల మీదకు రాకుండా జాగ్రత్తపడచ్చు..’ అంటోంది హీనా.

భయం వద్దు.. బలం కావాలి!

అది క్యాన్సర్‌ అయినా, ఏ ఇతర ఆరోగ్య సమస్య అయినా.. ధైర్యంగా, పాజిటివిటీతో ఉన్నప్పుడే జయించగలమంటోంది హీనా.

‘క్యాన్సర్‌ అనగానే చాలామంది ఇక తమ జీవితం ముగిసిపోయిందని భయపడుతుంటారు. కానీ ఈ భయమే మనల్ని సగం చంపేస్తుంది. కాబట్టి ముందు భయాన్ని పక్కన పెట్టాలి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పోరాడాలి. ఇది సాధ్యం కావాలంటే.. చుట్టూ ఉన్న వాళ్లు బాధితులకు అండగా నిలవాలి. తద్వారా ఈ వ్యాధిని వారు సర్వసాధారణంగా పరిగణిస్తారు. ఇప్పటికీ నేను ఈ వ్యాధితో పోరాడుతున్నా.. పలు చికిత్సలు తీసుకుంటున్నా. వ్యాధి బయటపడిన మొదట్లో కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలు నా మనసును వేధించేవి. అయినా నన్ను నేను సముదాయించుకుంటూ ముందుకు సాగా. ఇప్పుడైతే నాకు పూర్తి ధైర్యం వచ్చింది. ఓవైపు క్యాన్సర్‌తో పోరాటం చేస్తూనే.. మరోవైపు షూటింగ్స్‌కీ హాజరవుతున్నా. ఒక్కోసారి ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి 2 దాటుతుంటుంది. మళ్లీ ఉదయాన్నే 6 గంటలకు సెట్‌కు వెళ్లాల్సిందే! కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఈ బిజీ లైఫ్‌స్టైల్‌ నాకు నచ్చింది. ఓ రకంగా క్యాన్సర్ గురించిన  ఆలోచనలు నా మనసులోకి రావట్లేదు. అందుకే పదే పదే ఈ మహమ్మారి గురించి ఆలోచించకుండా.. వ్యక్తిగత, వృత్తిపరమైన పనుల్లో బిజీ అవ్వాలి. అప్పుడే మానసికంగా దృఢంగా ఉండచ్చు.. పరోక్షంగా ఈ వ్యాధినీ జయించచ్చు..’ అంటూ క్యాన్సర్‌ బాధితుల్లో ధైర్యం నింపుతోందీ బాలీవుడ్ తార. ఇలా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న విశేషాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో చాలామంది నెటిజన్లు ఆమెకు ‘ది రియల్‌ వారియర్‌’ అంటూ కితాబిస్తున్నారు.

ప్రస్తుతం తన భర్త రాకీ జైస్వాల్‌తో కలిసి ఓ రియాల్టీ షోలో నటిస్తోన్న హీనా.. మరోవైపు ‘గృహ లక్ష్మి’ అనే సీరియల్‌ కూడా చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్