Published : 06/08/2022 19:46 IST

మీ పిల్లల విషయంలో ఈ నాలుగు సూత్రాలు పాటిస్తున్నారా?

తమ రక్తం పంచుకుపుట్టిన బిడ్డలు ప్రయోజకులవ్వాలనే అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ, వారికి అవసరమైనవన్నీ అందిస్తుంటారు. తమ కంటిపాప వేసే ప్రతి అడుగుకి చేయూతనందిస్తుంటారు. తామెంత కష్టపడుతున్నా.. దాన్ని తమ పిల్లలకు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ క్రమంలో తెలిసీ తెలియక చిన్నారులు ఏవైనా పొరపాటు చేస్తే వారిని దండించైనా సరే.. సన్మార్గంలో నడిచేలా జాగ్రత్త పడుతుంటారు. అయితే ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే- కొన్ని సందర్భాల్లో పిల్లలు తప్పుదారి పట్టే అవకాశాలూ లేకపోలేవు. అలా జరగకుండా ఉండాలంటే నాలుగు సూత్రాలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వాటి ద్వారా పిల్లలను సరైన దారిలో నడిపించడంతో పాటు.. వారిని బాధ్యతాయుతంగా కూడా తీర్చిదిద్దచ్చట! దీనినే 'క్రియేటివ్ పేరెంటింగ్' అంటారు. మరి, ఇంతకీ ఏంటా నాలుగు సూత్రాలు? రండి.. తెలుసుకుందాం..!

పరిణామాలు తెలియజేస్తూ..

సాధారణంగా మంచి కంటే చెడు వైపే చాలా తొందరగా ఆకర్షితులవుతుంటారు. ఈ లక్షణం పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. పైగా వారికి ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించే పరిణతి కూడా ఉండదు. కాబట్టి చెడు విసిరే వలలో సులువుగా చిక్కుకుపోతుంటారు. అందుకే చిన్నారులను ఎప్పటికప్పుడు సునిశితంగా గమనించడం ద్వారా వారి ప్రవర్తన ఎలా ఉందో ఓ అంచనాకు రావచ్చు. ఈక్రమంలోనే వారు ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు వాటి గురించి వివరించడంతో పాటు.. మళ్లీ మళ్లీ వాటిని పునరావృతం చేస్తే వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థమయ్యేలా వివరించాలి. ఉదాహరణకు సరైన కారణం లేకుండా తోటి పిల్లలతో తరచూ గొడవ పడుతుంటే.. అలా చేయడం వల్ల కలిగే అనర్థాలు, ఎదురయ్యే ప్రమాదాలను వివరించాలి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు.. అవసరమైతే వారికి చిన్న చిన్న శిక్షలు సైతం విధించాలి. అలాగని వారిని కొట్టమనో.. తిట్టమనో కాదు. టీవీ చూడకుండా చేయడం, ఆటలు ఆడనివ్వకపోవడం వంటివన్నమాట! అప్పుడు వారు వాటి కోసమైనా తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే పిల్లలు ఏవైనా మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకోవడంతో పాటు ఓ చిన్న బహుమతి అందించడం ద్వారా వారు సన్మార్గంలో నడిచేలా చేయచ్చు.

ఒత్తిడి లేకుండా..

కొందరు తల్లిదండ్రులు పిల్లలపై 'అది చేయకు.. ఇలా ఉండద్దు..' అంటూ ఎన్నో రకాల ఆంక్షలు విధిస్తుంటారు. పైగా తాము సాధించాలనుకున్న లక్ష్యాలు, ఆశయాలను బలవంతంగానైనా తమ చిన్నారుల ద్వారా సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పైగా భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలను సైతం ఇప్పుడే నిర్ణయించేసి దాన్ని సాధించి తీరాలని ఆదేశిస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే చిన్నారులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఫలితంగా వారు చేయాలనుకున్న వాటిని చేయలేకపోతుంటారు. అంతేకాదు.. ఒత్తిడి కారణంగా పిల్లల్లోని సృజనాత్మకత సైతం తగ్గిపోతుంటుంది. అందుకే వారు ఎందులో ఆసక్తి కనబరుస్తున్నారో గమనించి అందులో నైపుణ్యం సాధించేలా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఒత్తిడిని జయించి తమ జీవితానికి చక్కని బాట వేసుకోగలుగుతారు.

స్నేహపూర్వకంగా..

పిల్లల నుంచి పెద్దల వరకు స్నేహపూర్వకమైన వాతావరణంలోనే గడపడానికి ఇష్టపడుతుంటాం. అయితే అలాంటి వాతావరణం చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండదు. పైగా కొందరు చిన్నారులు తాము ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పినప్పుడు వారి అమ్మానాన్నలు కసురుతుంటారు. ఫలితంగా చిన్నారులు తమ మనసులోని భావాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య ఉండటం అంత మంచిది కాదు. అందుకే ఇంట్లో ఎప్పుడూ స్నేహపూర్వకమైన, సరదాలతో కూడిన వాతావరణం ఉండేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. అలాగని పూర్తిగా వారికి స్వేచ్ఛనివ్వమని కాదు. వారికి స్నేహహస్తాన్ని అందిస్తూనే.. తప్పు చేస్తున్నప్పుడల్లా హెచ్చరిస్తుండాలి. అప్పుడు చిన్నారులు అన్ని విషయాలు మనతో పంచుకుంటారు. కాబట్టి వారి వ్యక్తిత్వం, ఆలోచనలు అన్నింటిపై మనకు కూడా పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తదనుగుణంగా వారి జీవితాన్ని మలచే అవకాశం ఉంటుంది.

నిష్పక్షపాతంగా..

చాలా కుటుంబాల్లో కనిపించే సమస్య ఇది. ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంటుంది. బాగా చదువుతున్నారనో లేదా అల్లరి చేస్తున్నారనే కారణంతో తల్లిదండ్రులు ఒకరినే ముద్దు చేస్తుంటారు. తనని చూసి నేర్చుకొమ్మని మరొకరికి చెబుతుంటారు. అంతేకాదు.. వారు చేసిన తప్పులని పెద్దగా పట్టించుకోరు. అదే సమయంలో మరో చిన్నారి చిన్న పొరపాటు చేసినా వారిపై విరుచుకుపడిపోతుంటారు. ఇలా చేయడం వల్ల మీ అంతట మీరే తోబుట్టువుల మధ్య అంతరం పెంచినవారవుతారు. పైగా తల్లిదండ్రులపై కూడా చిన్నారుల మనసుల్లో ప్రతికూల భావాలు కలిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి.. ఇద్దరిలోనూ సానుకూల అంశాలను గమనించి వాటిలో మెరుగయ్యేలా ప్రోత్సహించాలి. ప్రతికూల భావాలను తొలగించే ప్రయత్నం చేయాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని