ప్రతి శిలా ఓ కోహినూర్‌!

హైదరాబాద్‌ చారిత్రక నగరమే కాదు.. పురాతన రాతి సంపదకు నిలయం.. ప్రకృతి చెక్కిన శిల్పాలకు పెట్టని కోట.. 250 కోట్ల సంవత్సరాల చరిత్ర వీటి సొంతం. ఈ ప్రాంతపు సంస్కృతి, భాష, పేర్లు, ఆహారపు అలవాట్లు, మనుషులజీవనవిధానం, జీవవైవిధ్యం బండలతో,

Updated : 05 Sep 2022 12:50 IST

హైదరాబాద్‌ చారిత్రక నగరమే కాదు.. పురాతన రాతి సంపదకు నిలయం.. ప్రకృతి చెక్కిన శిల్పాలకు పెట్టని కోట.. 250 కోట్ల సంవత్సరాల చరిత్ర వీటి సొంతం. ఈ ప్రాంతపు సంస్కృతి, భాష, పేర్లు, ఆహారపు అలవాట్లు, మనుషుల జీవనవిధానం, జీవవైవిధ్యం బండలతో, రాళ్లతో పెనవేసుకుని ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన అరుదైన సంపదని అభివృద్ధి పేరుతో కనబడకుండా చేస్తుంటే ఊరుకోలేకపోయారు ఉమ మాగల్‌. ఆ శిలలను కాపాడుకోవాలనే సందేశంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ‘అదర్‌ కోహినూర్స్‌’ సినిమా తీశారామె. దీని విడుదల సందర్భంగా వసుంధరతో ముచ్చటించారావిడ...

హైదరాబాద్‌కు చెందిన ఉమ మాగల్‌ గచ్చిబౌలిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చేశారు. పెళ్లి తర్వాత గచ్చిబౌలికి మారారు. ప్రతిచోట ఎన్నో రాళ్లు, గుట్టలు.. అక్కడ గడిపిన క్షణాలు.. తనే కాదు ఆమె పిల్లలు కూడా వాటిపైనే ఎక్కువగా ఆడుకునేవారు. తర్వాత అమెరికాలో చాలాకాలం ఉన్నారు. తిరిగి హైదరాబాద్‌ వచ్చాక అభివృద్ధి చూసి ముచ్చటేసినా.. శిలా సంపద తరిగిపోవడం కలిచివేసిందామెను. మన గడ్డ మీద ఉన్న ప్రతి శిలా ఒక కోహినూర్‌ అన్నది తన నమ్మకం. అదుకే వీటిని పరిరక్షించుకోవాలనే సదాశయంతో సినిమాని తెరకెక్కించారు.

చిత్ర అనుభవంతో..

అమెరికాకు వెళ్లకముందు దిల్లీలో మాస్‌ కమ్యూనికేషన్‌ చేశారు ఉమ. అమెరికాకు వెళ్లాక టెంపుల్‌ యూనివర్సిటీ నుంచి చిత్ర నిర్మాణంలో పట్టా తీసుకుని ఆచార్యురాలిగా పనిచేశారు. భారత్‌ వచ్చాక సామాజిక అంశాలపై డాక్యుమెంటరీలు రూపొందించారు. ఫిల్మ్‌ అండ్‌ మీడియాలోనూ బోధకురాలిగా పనిచేశారు. నాటక రంగంపై ‘ది ప్లేయర్స్‌’ అనే డాక్యుమెంటరీ తీశారు. ఆ క్రమంలో హైదరాబాద్‌లోని రాళ్లపైన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో సినిమా తీయాలనుకున్నారు. తన స్నేహితురాలు, పరిశోధకురాలు, డ్రామా థెరపిస్టు మహనూర్‌ యార్‌ఖాన్‌ని ఈ ప్రయాణంలో సహాయకురాలిగా చేర్చుకున్నారు. స్థానిక కళలు, కవితలు, సాహిత్యం, వాడుక భాష, హాస్యం, పాటలు.. ఇలా ప్రతిదీ రాళ్లతో ఎలా ముడిపడి ఉందో పాప్‌ సంగీతంలో చెప్పించారు. అందమైన ప్రకృతికి ప్రతీక అయిన శిలలను పిండి చేయడమంటే తెలంగాణ సంస్కృతికి, పర్యావరణానికి తీవ్ర అన్యాయం చేయడమేనని.. రెండు దశాబ్దాల్లో జరిగిన పరిణామాలను చూపెట్టారు. అలరించి ఆలోచింప చేసే దృశ్య కావ్యంగా దీన్ని చిత్రీకరించారు. నగర పురోగతికి ఆటంకం కల్గించకుండా మిగిలి ఉన్న శిలాసంపదను పరిరక్షించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగగలమనే ఆశ, నమ్మకం కల్గించే ప్రయత్నం చిత్రంలో కనిపిస్తుంది.


తలా ఒక చేయి వేసి..

‘మొదట్లో శిలల దుస్థితి చూసి దుఃఖం వేసింది. గత వైభవ స్మృతులు, జరిగిన నష్టం బాధించాయి. కానీ మాకు అందిన ప్రోద్బలంతో నగర అపూర్వ శిలా సంపదను ఉత్సవ స్థాయిలో ఆరాధించాలన్న మా ప్రయత్నాన్ని ఎంతోమంది బలపరిచారు. మరెంతోమంది క్రౌడ్‌ ఫండింగ్‌లో విరాళాలు కూడా అందజేయడం మాకెంతో మానసిక బలాన్ని, నైతిక మద్దతును ఇచ్చింది. నేపథ్య సంగీతం మొదలు వాద్యకారులు, గాయకులు అందరూ పారితోషికం లేకుండా పనిచేశారు’ అని వివరించారు ఉమ.

- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్