Published : 02/02/2023 13:00 IST

సుఖనిద్రకు ఈ అలవాట్లు..!

సుఖ నిద్ర వల్ల అందంతో పాటు ఆరోగ్యంగా ఉండచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, నేటి యాంత్రిక జీవనశైలి, మితిమీరిన గ్యాడ్జెట్ల వినియోగం వల్ల చాలామంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. దాని ఫలితంగా పలు సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే వీటిని ఇప్పటికిప్పుడు మార్చుకోవడం కష్టమైన పనే. కానీ, మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల సుఖ నిద్రలోకి జారుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. సుఖ నిద్రను పొందడానికి ఎలాంటి అలవాట్లను అలవరచుకోవాలో ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. మరి, ఆ అలవాట్లేంటో తెలుసుకుందామా...

దినచర్యలో మార్పులు..

ఆయుర్వేదంలో దినచర్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరూ సమయపాలన అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చంటున్నారు రుజుత. కానీ, చాలామంది కెరీర్‌, బిజినెస్‌లో పడి వేళకు నిద్రపోవడం లేదు. అందుకే చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి, సుఖ నిద్ర కోసం రోజూ ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికి నిద్రపోవాలంటున్నారు రుజుత. దీనివల్ల సుఖ నిద్రను పొందడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఏజింగ్‌ సమస్యను కూడా నివారించవచ్చంటున్నారు.

గోరువెచ్చటి నీళ్లతో..

చాలామంది పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే ఆ నీళ్లకు వేపాకులు లేదా జాజికాయలు జోడించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందచ్చంటున్నారు రుజుత. కుదిరితే రెండిటినీ కలపచ్చంటున్నారు. దీనివల్ల ప్రశాంతమైన నిద్రను పొందచ్చంటున్నారు. వేపాకులు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంతో పాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అందుకే దీనిని సర్వరోగ నివారిణి అంటుంటారు. అలాగే జాజికాయల్లో కూడా యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.

నెయ్యితో..

కొంతమంది గ్యాస్‌, పొట్ట ఉబ్బరం సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. దీనివల్ల వారు రాత్రిళ్లు సరిగా నిద్రపోలేరు. ఇలాంటి వారు అరికాళ్లకు నెయ్యితో మర్దన చేసుకోవాలని సూచిస్తున్నారు రుజుత. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే అలసట, ఆందోళన ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతి ద్వారా త్వరితగతిన ఉపశమనం పొందచ్చంటున్నారు.

ఇవి కూడా..

సుఖనిద్ర కోసం పైన పేర్కొన్న అలవాట్లను అలవరచుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు రుజుత. మరి అవేంటో చూద్దామా...

రాత్రి భోజనానికి, నిద్రపోవడానికి మధ్య కనీసం రెండు, మూడు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.

నిద్రపోవడానికి 60 నిమిషాలు ముందు నుంచే గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలి.

పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పసుపు పాలను తీసుకోవాలి.

నిద్రపోయే గదిలో మంచి వెంటిలేషన్‌ ఉండడంతో పాటు డార్క్‌గా ఉండేలా చూసుకోవాలి.

పడుకునే ముందు ధ్యానం చేసుకోవాలి.


Cny1k0yD_fF

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని