Published : 16/02/2023 13:04 IST

ఈ నూనెతో జుట్టు ఒత్తుగా..!

సీజనల్‌ మార్పులు, వాతావరణ కాలుష్యం, తీసుకునే ఆహారం, తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం, నెరిసిపోవడం, చుండ్రు.. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఎంతో అపురూపంగా చూసుకునే మన జుట్టు ఆరోగ్యం, అందం దెబ్బతింటోంది. ఈ క్రమంలో కొంతమంది బయటి ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారుచేసుకొని ఉపయోగించే సహజ చిట్కాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఉల్లిపాయ నూనె కూడా ఇదే కోవలోకి వస్తుందని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ నూనెను తయారుచేసుకోవడం కూడా ఎంతో సులువు.

ఇలా తయారుచేసుకోవచ్చు!

కావాల్సినవి

ఎర్ర ఉల్లిపాయలు - 2 (మీడియం సైజువి)

కొబ్బరి నూనె - కప్పు

నువ్వుల నూనె - కప్పు

తయారీ

ముందుగా ఉల్లిపాయలపై పొట్టు తొలగించి పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఈ క్రమంలో కావాలంటే కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకోవచ్చు.

ఇప్పుడు స్టౌ మీద ప్యాన్‌ పెట్టి.. అందులో ఈ ఉల్లిపాయ పేస్ట్‌, మిగతా కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి బాగా కలుపుకోవాలి.

పెద్ద మంట పైన పెట్టి ఒక పొంగు వచ్చాక.. సిమ్‌ చేసి ఓ అరగంట పాటు మరిగించుకోవాలి. తద్వారా ఉల్లిపాయలోని సుగుణాలన్నీ నూనెలోకి చేరతాయి.

ఆ తర్వాత స్టౌ కట్టేసి నూనె చల్లబడే దాకా పక్కన పెట్టేయాలి.

ఆపై ఒక శుభ్రమైన క్లాత్‌ సహాయంతో ఈ నూనెను వడకట్టుకోవాలి. దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఆరు నెలల పాటు ఉపయోగించుకోవచ్చు.

కుదుళ్లు దృఢంగా.. జుట్టు ఒత్తుగా..!

ఉల్లిపాయ నూనెను కుదుళ్లపై వేసి మునివేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకోవాలి. తద్వారా కుదుళ్లలో రక్తప్రసరణ మెరుగవుతుంది.. నూనెలోని పోషకాలూ చర్మంలోకి ఇంకుతాయి. ఫలితంగా కుదుళ్లు దృఢమై జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనికంతటికీ కారణం ఉల్లిపాయలో అధికంగా ఉండే సల్ఫరే. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

కుదుళ్లు పొడిబారిపోవడం, అక్కడి చర్మం ప్యాచుల్లాగా రాలిపోవడం, చుండ్రు.. వంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఉల్లిపాయ నూనె ఉపయోగించాల్సిందే! ఈ నూనెలోని బయోయాక్టివ్‌ సమ్మేళనాలు ఇలాంటి కుదుళ్ల సమస్యల్ని తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం ఇప్పుడు చాలామందిలో కామనైపోయింది. అయితే ఉల్లిపాయ నూనె వాడితే ఈ సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఈ నూనెలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యను తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి.

ఉల్లిపాయ నూనె క్యారియర్‌ ఆయిల్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా అత్యవసర నూనె వాడాలనుకున్నప్పుడు దాన్ని ఈ నూనెలో చేర్చుకొని ఉపయోగిస్తే.. రెండు నూనెల్లో ఉన్న సుగుణాలు కుదుళ్లకు, జుట్టుకు సంపూర్ణంగా అందుతాయి.

ఉల్లిపాయ నూనె జుట్టుకు కండిషనర్‌లా కూడా ఉపయోగపడుతుంది. రోజూ ఈ నూనెతో మర్దన చేసుకుంటే కేశాలు పొడిబారిపోవడం, నిర్జీవమైపోవడం, గడ్డిలా మారిపోవడం.. వంటి సమస్యలకు చెక్‌ పెట్టచ్చు.

పేల సమస్య ఉన్న వారికీ ఈ నూనె మేలు చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగే కుదుళ్లలో వచ్చే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లనూ ఈ నూనెతో తగ్గించుకోవచ్చట!

ఉదయాన్నే తలస్నానం చేయాలనుకున్న వారు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్లు, జుట్టుకు పట్టించి.. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
దీని వాసన పడని వాళ్లు  తలస్నానానికి ముందే దీన్ని ఉపయోగించడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని