Published : 14/02/2023 13:20 IST

వేలంటైన్ లేరా? అయితే ఇలా చేసేయండి!

వేలంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. ప్రేమలో పడ్డవారి సందడి గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకేరోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.. కానీ వేలంటైన్స్ డే రోజు ఒంటరిగా ఉండేవారి పరిస్థితేంటి? ప్రత్యేకంగా ఏముంది? ఇతర రోజుల్లాగే ఇదీ గడిచిపోతుంది అనుకుంటున్నారు కదూ.. అయితే ప్రేమ అనేది కేవలం జంటల మధ్య ఉండేది మాత్రమే కాదు.. అది విశ్వవ్యాప్తమైనది.. అందుకే ప్రేమికుల రోజును జంటగా లేని వారు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి, ఈ వేలంటైన్స్ డేకి మీరూ సింగిల్ అయితే దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం రండి..

మీకు మీరే వేలంటైన్!

ప్రపంచంలో మనల్ని ఎంతగానో ఇష్టపడే మొదటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా? మనమేనండీ.. అవును.. మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో ఎవరూ ఉండరు.. అందుకే ఈ వేలంటైన్స్ డే రోజు మిమ్మల్ని ప్రేమించడానికి ఓ వ్యక్తి లేరని బాధపడే బదులు మీకు మీరే వేలంటైన్‌గా మారిపోండి.. ఎప్పటినుంచో మీరు కొనాలనుకుంటున్న వస్తువును కొని ఈ వేలంటైన్స్ డేకి మీకు మీరే కానుకగా ఇచ్చుకోండి. అలాగే వేలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన వంటకాలు తయారుచేసి లేదా ఆర్డర్ చేసుకొని ఆరగించండి.. ఈ రోజంతా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ట్రీట్ చేసుకోండి. మీలోని మంచి గుణాలన్నింటినీ ఒక చోట రాసి మీకు మీరే చదివి వినిపించుకోండి. దీనివల్ల మీ విలువేంటో మీకూ అర్థమవుతుంది కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

స్నేహితులతో గడపండి..

ఒకవేళ ఒంటరిగా సమయం గడపడం మీకు ఇష్టం లేకపోతే మీ స్నేహితులతో కలిసి వేలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీకు బాగా క్లోజ్ అయిన ఒకరిద్దరు స్నేహితులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి. లేదా మీ ఇంట్లోనే అందరూ కలిసి పార్టీ చేసుకోండి. దీనివల్ల ఈ రోజును కాస్త కొత్తగా గడిపేందుకు వీలుంటుంది.

కొత్తగా ప్రయత్నించండి..

చాలామంది వేలంటైన్స్ డేతో మనకేం సంబంధం లేదులే అంటూ మిగిలిన రోజుల్లాగే సాధారణంగా గడిపేద్దాం అనుకుంటారు. కానీ ప్రేమ అనేది కేవలం భార్యాభర్తలు, ప్రేమికులకు సంబంధించిన విషయం కాదు.. అది సార్వజనీనమైనది. అందుకే ప్రేమ కోసం ఏర్పాటు చేసిన ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకొనేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుందని గుర్తుంచుకోవాలి. ఇందుకోసం ఎప్పుడూ చేయని కొత్త పనులను ఈరోజు ప్రయత్నించి చూడవచ్చు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా.. ధైర్యం లేక, లేదా సమయం చాలక వాయిదా వేస్తున్న పనులను ఈరోజు ప్రయత్నించండి. జుట్టుకు కొత్త కలర్ వేసుకొని ప్రయత్నించడం, కొత్త ట్యాటూ వేసుకోవడం, ట్రెక్కింగ్ చేయడం వంటివి ట్రై చేయండి.. ఏదైనా మొదటిసారి చేసిన రోజును ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంచుకుంటాం కాబట్టి ఈరోజును కూడా మర్చిపోలేనిదిగా మార్చుకోవచ్చు.

ప్రేమను పంచండి..

ప్రేమ ప్రతి బంధంలోనూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించాలే కానీ అందరితో కలిసి ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు. అందుకే ఈ ప్రేమికుల రోజుకి మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికో సర్‌ప్రైజ్ ఇవ్వండి. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నట్లయితే మీ శక్తిమేరకు ఓ చిన్న బహుమతి కొని వారికి అందించి మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. కేవలం తల్లిదండ్రులే కాదు.. తోబుట్టువులకు కూడా ఇలాంటి బహుమతులు అందించవచ్చు. అలాగే మీకు జంతువులంటే ఇష్టమైతే యానిమల్ షెల్టర్స్‌కి వెళ్లి వాటితోనూ సమయం గడపవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని