Updated : 13/10/2021 16:57 IST

మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే..!

చాలామంది మహిళలు మెనోపాజ్ దశలో బరువు పెరగడం మనం గమనిస్తూనే ఉంటాం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల దారుఢ్యం తగ్గి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం.. మొదలైన కారణాలే ఈ సమస్యకు కారణమవుతున్నాయి. అలాగే వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగించడం వల్ల క్యాలరీలు కరిగించే శక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. అయినప్పటికీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించడం.. వంటి వాటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో చూద్దామా..

సమతులాహారం..

మెనోపాజ్ దశలోకి చేరిన మహిళలు బరువు పెరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడంతో పాటు సమతులాహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. దీనికోసం తాజా పండ్లు, కూరగాయలు.. వంటి పోషకాలు ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు తక్షణమే ఇంకా మంచి ఫలితం రావాలంటే సంబంధిత నిపుణులను సంప్రదించి వాళ్ల సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

వ్యాయామం..

వయసు పైబడే కొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలతో పాటు బరువు పెరగడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలోకి చేరిన మహిళల విషయంలో పెరిగే బరువుతో పాటే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. దీని నుంచి విముక్తి పొందాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఓ మార్గం. ఇంట్లో రోజువారీ పనులతో పాటు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం, నిపుణుల సలహాతో జిమ్‌లో చేరడం, వ్యాయామాలు చేయడం అవసరం. దీనివల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు.. ఆరోగ్య సమస్యలకూ చెక్ పెట్టచ్చు.

ఒత్తిడి నుంచి విముక్తికి..

మెనోపాజ్ దశలో చాలామందికి ఎదురయ్యే రకరకాల ఒత్తిళ్ల వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా ఈ సమస్యలు బరువు పెరగడానికి దారితీస్తాయి. మరి దీన్నుంచి విముక్తి పొందాలంటే మెడిటేషన్, యోగా.. వంటి శిక్షణ తరగతుల్లో చేరడం ఉత్తమం. దీనివల్ల అటు ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత సొంతమవుతుంది.. ఇటు రాత్రుళ్లు నిద్ర కూడా బాగా పడుతుంది. ఫలితంగా బరువు తగ్గచ్చు.

సంకోచం వద్దు..

కొంతమంది మహిళలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ వద్ద చెప్పడానికి వెనకాడుతుంటారు. మెనోపాజ్ తర్వాత వచ్చే సమస్యల విషయంలోనూ అలాగే చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ సమస్యలన్నిటినీ ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలిగినప్పుడు, ఒకవేళ ఈ దశలో అవసరమైతే.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, బ్యాలెన్సింగ్ థెరపీ.. లాంటి చికిత్సల గురించి వైద్యులు సూచించే అవకాశం ఉంటుంది. ఆయా చికిత్సల వల్ల కూడా మెనోపాజ్ దశలో బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

చూశారుగా.. మెనోపాజ్ దశలో బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలో. మరి మీరు కూడా వీటిని దృష్టిలో ఉంచుకుని అధిక బరువు నుంచి విముక్తి పొందండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని