Updated : 01/07/2021 16:01 IST

ప్రశంసలను స్వీకరించడం నేర్చుకోండి..!

'పొగడ్త పన్నీరులాంటిది.. వాసన చూసి వదిలేయాలే తప్ప తాగకూడదు..' అంటారు మన పెద్దవాళ్లు.. అలాగని ఎదుటివాళ్లు మనల్ని ప్రశంసిస్తుంటే, దాన్ని ఒప్పుకోకపోవడం.. నేను దానికి అర్హురాలిని కాదనడం కూడా సరికాదు. దీనివల్ల ఎదుటివాళ్లు ఇకపై మిమ్మల్ని ప్రశంసించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించరు. ఇలా ఒకరకంగా వారు మిమ్మల్ని పొగిడే అవకాశాన్ని మీరు తగ్గిస్తున్నట్లే లెక్క. జీవితంలో మనం ఎంత సాధించినా.. వాటిని గుర్తించేవారు, మన గరించి నాలుగు మంచి మాటలు చెప్పేవారు లేకపోతే మంచి పని చేయాలన్న ఉత్సాహం కూడా పోతుంది. అందుకే ఎదుటివారు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం, మీకు ఆ పొగడ్తలను స్వీకరించే హక్కు లేదన్నట్టుగా వ్యవహరించడం ఉత్తమం కాదు.. మరి, ఇతరులు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు ఏం చేయాలంటే..

థాంక్యూ చెప్పడం మరవద్దు..

'కంగ్రాట్యులేషన్స్.. చాలా గొప్ప పని చేశావు. నీ వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత విజయవంతమైంది..' అని ఎవరైనా మిమ్మల్ని పొగిడితే ఏం చేస్తారు.. దగ్గరివాళ్లయితే 'మునగచెట్టు ఎక్కించకు' అని చెప్పడం.. అదే కాస్త పైఅధికారులతో మాట్లాడుతుంటే దాన్ని దాటవేయడం, లేదా నవ్వి వూరుకోవడం చేస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. అలా పట్టించుకోనట్లుగా ఉండడం వల్ల వారు ఇంకోసారి మీరు ఎంత గొప్ప పని చేసినా దాన్ని ప్రశంసించడానికి ఆసక్తి చూపించరు. అందుకే ఇలా ఎవరైనా మీపై ప్రశంసల వర్షం కురిపించినప్పుడు దాన్ని ఒప్పుకొని 'థాంక్యూ' చెప్పడం అలవాటు చేసుకోండి. అంతేకాదు.. దీనికి మీకు సహాయం చేసినవారి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం మర్చిపోవద్దు. ఫలితంగా వారు కూడా ఆనందంగా ఫీలవుతారు.

టాపిక్ మార్చద్దు..

మీరో పెద్ద ప్రాజెక్ట్ చక్కగా పూర్తిచేసి, క్త్లెంట్ వద్ద కంపెనీ పేరుప్రతిష్టలు నిలిపారనుకోండి.. బాస్ మిమ్మల్ని పిలిచి తప్పకుండా అభినందనలు తెలుపుతారు. ఇలాంటి సందర్భాల్లో మీరేం చేస్తారు.. థ్యాంక్స్ చెప్పేసి, వేరే టాపిక్‌లోకి విషయాన్ని మళ్లిస్తారు. దీనివల్ల ఎదుటివారికి మిమ్మల్ని ప్రశంసించే అవకాశాన్ని మీరే ఇవ్వట్లేదన్నమాట. అందుకే ఎంత ఇబ్బందిగా అనిపించినా.. ఎదుటివాళ్లు చెప్పాలనుకున్నది చెప్పేవరకూ టాపిక్ మార్చాలనిపించినా.. దాన్ని మార్చకుండా ఓపికతో ఉండండి. ఎదుటివాళ్లు పూర్తిగా మాట్లాడిన తర్వాత దానికి సమాధానం ఇచ్చి, ఆపై మరో టాపిక్ మాట్లాడుకోవచ్చు. కష్టపడి పనిచేసినప్పుడు ఎదుటివాళ్లిచ్చే ప్రశంసలను పొందే హక్కు మీకుంది. దాన్ని పూర్తిగా ఆస్వాదించండి.

చక్కటి బాడీలాంగ్వేజ్

ఎదుటివాళ్లు తమను ప్రశంసిస్తున్నప్పుడు కొందరు ముడుచుకుపోతారు. మరికొందరేమో.. తామే గ్రేట్ అన్నట్లుగా హావభావాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ రెండూ సరైనవి కావు. ఎదుటివారు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు చిరునవ్వుతో, హుందాగా దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. దీనివల్ల అవతలి వ్యక్తికి కూడా మీపై సదభిప్రాయం ఏర్పడి.. మరోసారి వారు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం దక్కుతుంది. అలాగే ఎదుటివారు మీ గురించి ప్రశంసాపూర్వకమైన మాటలు మాట్లాడుతుంటే కాళ్లు వూపడం, చేతులు నలుపుకోవడం, పెన్ను పట్టుకొని ఆడడం, తిప్పడం వంటివి కూడా చేయకూడదు. వారి కళ్లల్లోకే చూస్తూ ప్రశంసలను స్వీకరించాలి.

టీమ్‌ని మర్చిపోవద్దు..

మిమ్మల్ని పైఅధికారులు ప్రశంసిస్తుంటే బాగానే ఉంటుంది. అయితే మీకింది వారికి అదే అవకాశం దక్కాలని వారూ కోరుకుంటారు. అందుకే మిమ్మల్ని ఎదుటివారు ప్రశంసిస్తుంటే 'అంతా నా అదృష్టం..', 'ఇదేముంది? ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది..' అనే మాటలు వాడకండి. ఎప్పుడూ పాజిటివ్ ధోరణిలో ఆలోచించడం అలవాటు చేసుకోండి. సాధించిన విజయాన్ని తక్కువ చేసి చూడద్దు. ఒకవేళ మీరు సాధించింది నిజంగానే చిన్న విషయమే అయితే.. ముందు వారికి ధన్యవాదాలు తెలిపి.. 'నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని నా భావన..' అని వివరించాలి. ఇందులో మీకు సహాయం చేసిన మీ టీమ్ సేవలను కూడా గుర్తించడం.. అందరిలోనూ వారిని ప్రశంసించడం మర్చిపోవద్దు. ఒకవేళ మీ టీమ్‌లోని వారే మిమ్మల్ని ప్రశంసిస్తుంటే వెంటనే వారిని తిరిగి పొగడొద్దు. దీనివల్ల వారికి ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంటుంది. ముందు వారు చెప్పాలనుకున్నదంతా విని, ఆ తర్వాత 'నేను కూడా నీ సేవలను ప్రశంసిస్తున్నా. నువ్వు చాలా బాగా చేశావు. భవిష్యత్తులోనూ మనం ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా..' అంటే వారు ఎంతో ఆనందిస్తారు. కేవలం ఇదేకాదు.. నలుగురిలో మాట్లాడేటప్పుడు విజయానికి మీరొక్కరే కారణమని చెప్పకుండా టీమ్ సహకారం గురించి వివరించడం వల్ల వారికీ సంతోషంగా, ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి