Updated : 14/01/2023 17:50 IST

పండగ వేళ.. ఇవి అందుకే..!

భోగభాగ్యాల భోగి.. సిరిసంపదల సంక్రాంతి.. వచ్చేసింది. తెలుగింట పెద్ద పండగైన సంక్రాంతి అంటేనే రంగుల ముంగిళ్లు, ముద్దులొలికే గొబ్బిళ్లు, బంధుమిత్రుల సందళ్లు.. అయితే సంక్రాంతి పండగంటే ఇవే కాదు.. ఈ పండగలో పాటించే ప్రతి పద్ధతీ సామాజిక స్పృహ, శాస్త్రీయ నేపథ్యంతో కూడుకున్నదే!

వాటిని వదిలేయాలి..

మూడు రోజుల పండగ సంక్రాంతిలో మొదటి రోజు భోగి.. ఆరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి భోగిమంటలు వేస్తాం. ఇంట్లో అవసరం లేని చెక్క సామగ్రిని అందులో వేసి మంట పెడతాం. సామగ్రి కొన్నప్పుడు ఎంత ఖర్చయినా కావచ్చు.. కానీ అది పాడైపోయిన తర్వాత మాత్రం ఇంట్లో ఉంచుకుంటే దానివల్ల ఇతర వస్తువులకు స్థానం ఉండదు. అంతేకాదు.. అడ్డుగా కూడా అనిపిస్తుంది. అందుకే అలాంటిదాన్ని భోగిమంటలో వేసేస్తారు. మనలోని చెడు అలవాట్లు, జ్ఞాపకాలు కూడా అంతే.. అవి మనసులో ఉండిపోయినంత కాలం మంచి నడవడికకు, ప్రశాంతతకు చోటుండదు. దానివల్ల మన జీవితానికి ఎలాంటి లాభం ఉండదు సరికదా.. కొత్తగా, సరైన దారిలో జీవితాన్ని ప్రారంభించడానికి అది అడ్డుగా మారచ్చు. అందుకే ఇలాంటి జ్ఞాపకాలేవైనా ఉంటే వాటిని కూడా మంటలో వేసి మసి చేసేయాలి. అనారోగ్యకరమైన అలవాట్లు వదులుకోవాలి. ఇదే భోగి మంట చెప్పే తత్వం. కేవలం పాత జ్ఞాపకాలనే కాదు.. అవసరం లేని వస్తువులను మంటలో వేసినట్లు మనలోని దుర్గుణాలను కూడా మసి చేయాలన్నది భోగి మంట సారాంశం.

వారికీ ఆనందాన్నిస్తూ..

సంక్రాంతి వేళ ముఖ్యంగా చేయాల్సిన పనుల్లో దానధర్మాల గురించి చెబుతారు పెద్దలు.. సంక్రాంతి అంటేనే పంట ఇంటికొచ్చే వేళ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ చేసుకునే పండగ.. అందుకే ఈ పండగ వేళ దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యం.. పంట ఇంటికొచ్చేవేళ ఇంట్లో కుటుంబ సభ్యులకే కాదు.. పనివాళ్లకు కూడా బట్టలు తేవడం ఇంతకుముందు కనిపించేది. అంతేకాదు.. కొత్తగా వచ్చిన ధాన్యం, ఇతర పంటలతో గాదెలన్నీ నిండి ఉండడంతో సంక్రాంతి సమయంలో తప్పనిసరిగా దానధర్మాలు చేయాలని పెద్దలు చెప్పేవారు. పండగ హడావిడి మొదలుకాగానే హరిదాసు, గంగిరెద్దులవారు.. ఇలా ఎంతోమంది వచ్చి దానధర్మాలు తీసుకొని వెళ్లేవారు. పండిన పంటను పూర్తిగా మనమే అనుభవించకుండా.. అందులోంచి ఇతరులకు కూడా దానం చేయాలని పెద్దలు ఈ సూత్రాన్ని పాటించేవాళ్లు. అలాగే కనుమ రోజు పెద్దలను తలచుకోవడం, సాయం చేసే జంతువులను, పనిముట్లను పూజించడం ద్వారా మనవాళ్లను, మనకు మేలు చేకూర్చే వారిని మర్చిపోకూడదనే సూత్రాన్ని మన పెద్దలు పాటించేవారు..

అహాన్ని వదిలేయాలి..

సంక్రాంతి రోజు మన దగ్గర తక్కువే అయినా దేశంలో చాలాచోట్ల కనిపించే సంప్రదాయం 'తిల్‌గుల్'. అంటే నువ్వులు, బెల్లంతో కలిపి చేసిన ముద్దలను అందరితో పంచుకోవడం అన్నమాట. కేవలం మనవారితోనే కాదు.. ఇతరులతోనూ స్నేహపూర్వకంగా మెలగడం అన్నది ఇందులో దాగిన పరమార్థం. ఈ నువ్వుల ఉండలను మనకు తెలిసినవారందరితో పంచుకోవాలి. అహాన్ని వదిలి వారితో మంచిమాటలు మాట్లాడుతూ నోరు తీపిచేయాలి. అలాగే ధనవంతులు, పేదవారు అన్న విభేదాలను పక్కన పెట్టి ఒకరితో ఒకరు ఈ నువ్వుల ఉండలను పంచుకోవాలి. అలాగే సంక్రాంతి వచ్చేది చలికాలంలో కాబట్టి నువ్వులు, బెల్లం మన శరీరాన్ని వెచ్చబడేలా చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇంకా సంక్రాంతి వేళ పాటించాల్సిన పద్ధతుల్లో పతంగులు ఎగరవేయడం, సూర్య నమస్కారాలు, నదీస్నానాలు ఇలా ఎన్నో ఉన్నాయి.. వీటి వెనకా ఎన్నో శాస్త్రీయ కారణాలున్నాయంటారు పెద్దలు.. కీటకాలకు ఆహారం కోసం పిండితో ముగ్గులు పెట్టడం, ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గించేలా గడపలకు పసుపు రాయడం, గొబ్బెమ్మల పేరుతో పేడను ఉపయోగించడం... ఇలా ఈ పండగ వేళ చేసే ప్రతి పనీ సామాజిక స్పృహ, శాస్త్రీయ నేపథ్యంతో కూడుకున్నదే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని