Varun-Lavanya: మూడుముళ్లతో ఒక్కటైన ‘మెగా’ కపుల్‌!

తెరపై జంటగా రొమాన్స్‌ పండిస్తుంటారు ఎంతోమంది నటీనటులు. అలాంటి కొన్ని ముచ్చటైన జంటల్ని చూస్తే.. నిజ జీవితంలోనూ వీరు ఒక్కటైతే బాగుండనిపిస్తుంటుంది. ఆరడుగుల అందగాడు వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠిదీ అలాంటి చూడముచ్చటైన జంటే

Updated : 02 Nov 2023 13:26 IST

(Photos: Instagram)

తెరపై జంటగా రొమాన్స్‌ పండిస్తుంటారు ఎంతోమంది నటీనటులు. అలాంటి కొన్ని ముచ్చటైన జంటల్ని చూస్తే.. నిజ జీవితంలోనూ వీరు ఒక్కటైతే బాగుండనిపిస్తుంటుంది. ఆరడుగుల అందగాడు వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠిదీ అలాంటి చూడముచ్చటైన జంటే! ఇటీవలే తమ ప్రేమను నిశ్చితార్థంతో ఓ మెట్టెక్కించిన ఈ జంట.. వివాహంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రపంచంలోనే ది బెస్ట్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా పేరు పొందిన ఇటలీలోని టస్కనీ వీరి పెళ్లికి వేదికైంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుల జంట ప్రేమ కబుర్లు, పెళ్లి ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి..

అభిరుచులే కలిపాయి!

వెండితెరపై కలిసి నటించి.. ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. వరుణ్‌-లావణ్యల్నీ వెండితెరే కలిపింది. 2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం తొలిసారి కలిసి నటించిందీ జంట. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. గతేడాది డిసెంబర్‌లో లావణ్య పుట్టినరోజు సందర్భంగా తన ఇష్టసఖికి ప్రేమ ప్రతిపాదన చేశానంటున్నాడు వరుణ్‌.

‘దాదాపు ఐదారేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. నాకేదిష్టమో తనకు బాగా తెలుసు. మా అభిరుచులూ కలవడంతో మా మధ్య స్నేహం ప్రేమగా మారింది. నేనే ముందు ప్రపోజ్‌ చేశా. ఇరు కుటుంబాలూ మా ప్రేమను అంగీకరించాయి.. నిశ్చితార్థంలాగే పెళ్లీ సింపుల్‌గా ఉంటుంది..’ అంటూ ఇటీవలే తన మనసు విప్పాడీ హ్యాండ్‌సమ్‌. అనుకున్నట్లుగానే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా వీళ్ల పెళ్లి జరిగింది.

‘మెగా’ వేడుకల్లో సందడి!

ఇన్నేళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఇద్దరూ కలిసి కెమెరా కంటికి చిక్కిన సందర్భం ఒక్కటీ లేదు.. తమ ప్రేమను అంత రహస్యంగా ఉంచిందీ జంట. అయితే ‘మెగా’ ఫ్యామిలీలో జరిగిన పలు ఫంక్షన్లు, వేడుకల్లో లావణ్య సందడి చేయడం మనం చూశాం. నిజానికి వరుణ్‌ చెల్లెలు నిహారికకు లావణ్య మంచి స్నేహితురాలు! వారిద్దరూ తమ స్నేహితులతో కలిసి జిమ్‌లో, రెస్టరంట్లో.. ఇలా పలు చోట్ల దిగిన ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. ఇక ఉదయ్‌పూర్‌లో జరిగిన నిహారిక పెళ్లికీ హాజరై సందడి చేసిందీ డింపుల్‌ బ్యూటీ. ఆ సమయంలో రీతూ వర్మ, వరుణ్‌తో కలిసి ఫొటోలూ దిగింది. అయితే అప్పుడూ అతిథిగానే ఈ వేడుకల్లో పాల్గొందనుకున్నారంతా! కానీ ‘మెగా’ ఫ్యామిలీకి కాబోయే కోడలిగా ఆడపడుచు పెళ్లిలో భాగమైందన్న విషయం ఆ తర్వాత తెలుసుకుని  సంబరపడిపోయారు ఫ్యాన్స్‌.

ముందే హింట్‌ ఇచ్చిందా?

ప్రేమలో ఉన్న వారి మాటలు ఓ పట్టాన అర్థం కావు.. ఒక్కోసారి వారు హింట్‌ ఇచ్చినా అర్థం చేసుకోలేకపోతాం. ఈ అందాల రాక్షసి కూడా తన ఇష్టసఖుడిపై తనకున్న ప్రేమ గురించి కొన్ని సందర్భాలలో పరోక్షంగా చెప్పింది. మొన్నామధ్య తన చిత్రం ‘పులి- మేక’ ప్రమోషన్‌లో భాగంగా ‘సుమ అడ్డా’ కార్యక్రమంలో పాల్గొంది లావణ్య. అందులో ‘నాని, వరుణ్‌.. వీరిద్దరిలో ఎవరు హ్యాండ్‌సమ్‌?’ అని సుమ అడగ్గా.. ‘వరుణ్‌ హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు!’ అని తడుముకోకుండా సమాధానమిచ్చింది.

ఇక ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్లో భాగంగా.. అల్లు అరవింద్‌ లావణ్యను మెచ్చుకున్న సందర్భంలోనూ వరుణ్‌-లావణ్యల ప్రేమ విషయం తెలియలేదు. నిజానికి లావణ్య ఉత్తరాది నుంచి వచ్చింది. అలాంటిది ఆ ఈవెంట్‌ వేదికపై చక్కటి తెలుగులో మాట్లాడేసరికి.. ‘ఉత్తరాది నుంచి వచ్చినా చక్కగా తెలుగు మాట్లాడుతున్నావ్‌. ఓ తెలుగబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిలవ్వు..’ అంటూ లావణ్యతో సరదాగా సంభాషించారు. దానికి ఈ డింపుల్‌ బ్యూటీ ఓ స్మైల్‌తో సరేనంటూ సమాధానమిచ్చింది. ఇలా పలుమార్లు వీరి ప్రేమ, పెళ్లి గురించి హింట్స్‌ వచ్చినా తెలుసుకోలేకపోయామంటున్నారు చాలామంది ఫ్యాన్స్‌.

పెళ్లిలో ట్రెడిషనల్‌గా..!

జూన్‌లో నిశ్చితార్థం అయినప్పట్నుంచి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయిందీ టాలీవుడ్‌ జంట. ప్రపంచంలోనే ది బెస్ట్‌ వెడ్డింగ్‌ డెస్టినేషన్స్‌లో ఒకటైన ఇటలీలోని టస్కనీని తమ పెళ్లి వేదికగా చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. అక్కడే తమ స్నేహితులకు, ఇతర కుటుంబ సభ్యులకు విడివిడిగా బ్యాచిలరేట్‌ పార్టీలు, కాక్‌టెయిల్‌ పార్టీలు ఏర్పాటు చేసింది.. ఆయా వేడుకల్లో మోడ్రన్‌గా మెరిసిపోయిన ఈ జంట.. పెళ్లిలో పూర్తి సంప్రదాయబద్ధంగా ముస్తాబైంది. వధువుగా లావణ్య ఎరుపు రంగు చీరలో కుందనపు బొమ్మలా కనిపించింది. భారీగా ఎంబ్రాయిడరీ చేసిన ఈ చీరకు మ్యాచింగ్‌ వెయిల్‌ ధరించి తన లుక్‌ని పూర్తిచేసిన ఈ చక్కనమ్మ.. బన్‌ హెయిర్‌స్టైల్‌ వేసుకొని దాన్ని మల్లెపూలతో అలంకరించుకుంది. ఇలా తన అటైర్‌కు తగినట్లుగా భారీ జ్యుయలరీని ఎంచుకొని పదహారణాల తెలుగింటి వధువుగా దర్శనమిచ్చింది. ఇక వరుడు వరుణ్‌.. తన ఇష్టసఖికి కాంట్రాస్ట్‌ కలర్‌లో ఉన్న ఐవరీ రంగు ధోతీ-షేర్వాణీలో ముస్తాబై రాయల్‌గా కనిపించాడు. నవ్వుతూ, ఎంజాయ్‌ చేస్తూ జంటగా దిగిన ఫొటోల్ని ఈ మెగా హీరో సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అటు సెలబ్రిటీలు, ఇటు నెటిజన్లు.. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ ఈ కొత్త జంటను ఆశీర్వదిస్తున్నారు.

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ మెగా కపుల్‌!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్