Published : 04/11/2022 14:09 IST

‘ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.. ప్రేమిస్తున్నా’ అంటోంది..!

మా అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఈ మధ్య ఒకసారి తన ఫోన్‌ చూస్తే ఎవరో అబ్బాయి ఫొటోలు కనిపించాయి. గట్టిగా అడిగితే ఆ అబ్బాయి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడని, చెన్నైలో ఉంటాడని చెప్పింది. అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. అప్పటినుంచి నాకు చాలా కంగారుగా ఉంది. ఈ విషయం నా భర్తకు తెలిస్తే గొడవలవుతాయి. ‘సోషల్‌ మీడియాలో పరిచయమైన ప్రతి ఒక్కరినీ నమ్మకూడదు’ అంటే వినడం లేదు. పైగా ఫొటోలో ఉన్న వ్యక్తి పెద్ద వయసున్నవాడిలాగా కనిపిస్తున్నాడు. ఎంత నచ్చచెప్పినా నా మాట పట్టించుకోవడం లేదు. ఈ విషయం ఎవరితో చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన తర్వాత యువతీ యువకుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేమ అనేది చాలా సున్నితమైన అంశం. మీ అమ్మాయి వయసులో ఉన్నవారికి ఒక్కసారిగా ‘వద్దు’ అని చెబితే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి.

చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ప్రేమించినవారి గురించి చెడుగా చెబుతుంటారు. అలాగే ప్రేమించడమే పాపం అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ‘నీ గురించి మాకు తెలుసు. సరైన సమయంలో మీకు పెళ్లి చేస్తాం’ అని అంటుంటారు. కానీ, ఈ వయసులో వారు ఇలాంటి మాటలను పట్టించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో- ముక్కూ మొహం తెలియని వ్యక్తిని ప్రేమించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి, మీ కుటుంబ విలువల గురించి, ఇలాంటి విషయాల వల్ల సామాజికంగా ఎదురయ్యే సవాళ్ల గురించి వివరంగా అర్ధమయ్యేటట్లుగా తెలియచేయండి. ముందు చదువు పైన దృష్టి సారించమని, కెరీర్లో స్థిరపడ్డాకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించాలని చెప్పండి. అప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలకు మీ మద్దతు ఉంటుందని స్పష్టంగా తెలియచేయండి.

ఈ వయసులో ఉండే చాలామంది యువతీయువకులు ఎదుటి వ్యక్తిపై ఉన్న ఆకర్షణనే ప్రేమగా నిర్వచించుకుంటారు. అలాగే వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారు కూడా. కాబట్టి, మీ అమ్మాయి దృష్టి మళ్లించే ప్రయత్నం చేయండి. ఇందుకోసం తనకి ఇష్టమైన వ్యాపకాన్ని అలవాటు చేయండి. ఆ వ్యాపకం మీద నిమగ్నమయ్యే కొద్దీ ప్రేమ నుంచి దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది. ‘ఎంత నచ్చచెప్పినా అమ్మాయి వినడం లేదు. మా వారికి తెలిస్తే గొడవలవుతాయి’ అంటున్నారు. ఈ క్రమంలో ఒకవేళ మీరు చెబితే వినడం లేదనుకుంటే మీరు కాకుండా తను చనువుగా ఉండేవారితో చెప్పించే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి లోనవకుండా ప్రాక్టికల్‌గా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. అప్పటికీ తనలో మార్పు రాకపోతే సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు తగిన పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని