Published : 23/07/2022 20:49 IST

ప్యూమిస్ స్టోన్ వాడుతున్నారా?

చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోయి నిగనిగలాడుతూ మెరవాలన్నా, అవాంఛిత రోమాలు తొలగించుకోవాలన్నా.. అది ప్యూమిస్ స్టోన్‌తో సాధ్యపడుతుందన్న విషయం తెలిసిందే. కానీ, ప్యూమిస్ స్టోన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతాం.

చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి క్లెన్సింగ్, స్క్రబింగ్ చేయడం సహజమే. వాటితో పాటు స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ ఉపయోగించడం కూడా మంచి పద్ధతే. అయితే ఈ ప్యూమిస్ స్టోన్ ఉపయోగించే ముందు దాంతో ఏ చర్మ భాగాన్నైతే శుభ్రపరుచుకోవాలని అనుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని గోరువెచ్చగా ఉన్న నీటిలో తడపాలి. అలాగే ప్యూమిస్ స్టోన్ కూడా నానబెట్టాలి. ఉదాహరణకు దీంతో కాళ్లను శుభ్రం చేసుకోవాలని అనుకుంటే రెండు కాళ్లు గోరు వెచ్చని నీటిలో కాసేపు ఉంచాలి.  అదే నీటిలో ఈ ప్యూమిస్ స్టోన్ కూడా నానబెట్టి.. ఆ తర్వాత కాళ్లపై గుండ్రంగా, మృదువుగా, సున్నితంగా రుద్దుకోవాలి.

తేమను సంరక్షించుకోవాలి..

ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి చర్మం శుభ్రపరుచుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఎందుకంటే గరుకుగా ఉండే ఈ రాయి వల్ల చర్మంలో ఉండే సహజ తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం నిర్జీవంగా, పొడిగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మాయిశ్చరైజర్ వాడకం కూడా తప్పనిసరి. అప్పుడే చర్మం తాజాగా నిగనిగలాడుతూ ఉంటుంది.

గోళ్లకు కూడా..

చేతులు మృదువుగా మారాలన్నా, చేతి వేళ్లు, గోళ్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా మానిక్యూర్ చేయించుకుంటే చాలు. అలాగని బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి కూడా చేతులను శుభ్రపరచుకోవచ్చు.

అవాంఛిత రోమాలు తొలగించడానికి...

కేవలం పాదాలు, చేతులు, చర్మ సంరక్షణకే కాదు.. ప్యూమిస్ స్టోన్‌ని అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి ఆ భాగాన్ని నీటితో తడిపి తర్వాత సబ్బు రాయాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్‌తో ఆ ప్రాంతంలో రుద్దితే అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. తరచుగా ప్యూమిస్ స్టోన్‌ను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు పెరగడం కూడా తగ్గుతుంది.

పాదాలకు ఇలా!

గోరువెచ్చని నీటిలో పాదాలను పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.  వీలైతే ఈ నీటికి కొంచెం ఎప్సమ్ సాల్ట్‌ని కలపండి. తద్వారా పాదాలు నీటిలో నాని, మెత్తబడ్డాక ప్యూమిస్ స్టోన్‌తో మడమలను, అరికాళ్లను మృదువుగా మర్దన చేస్తే మృతకణాలు, మురికి సులభంగా తొలగిపోతాయి.

వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు!

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్యూమిస్ స్టోన్ వాడేప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

ఇతర శరీర భాగాల మాదిరి ముఖం మీద ప్యూమిస్‌ స్టోన్‌ను ఉపయోగించడం మంచి పద్ధతి కాదు.

అలాగే పగిలిన చర్మంపై ప్యూమిస్ స్టోన్‌ని రుద్దకూడదు. అసలే దెబ్బతిన్న చర్మంపై గరుకుగా ఉండే ఈ రాయితో రాపిడి చేస్తే చర్మగ్రంథులు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది.

మృత కణాలను తొలగించడానికి ఈ స్టోన్ ఉపయోగపడుతుంది కదా అని పొడిగా ఉన్న చర్మంపై మరీ గట్టిగా రుద్దితే చర్మం గీసుకుపోతుంది.

అలాగే ఒకరు వాడిన ప్యూమిస్ స్టోన్ ఇంకొకరు వాడకూడదు. దీనివల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశాలున్నాయి.

శుభ్రం చేయడమూ ముఖ్యమే!

ప్యూమిస్ స్టోన్‌ని ఉపయోగించిన తర్వాత దాన్ని శుభ్రంగా కడగడం మర్చిపోకండి. మామూలుగా నీటితో కడిగినా మురికి తొలగకపోతే వేడి నీటిలో కాసేపు మరగబెడితే చాలు. మురికి పోయి ప్యూమిస్ స్టోన్ శుభ్రపడుతుంది. లేదంటే ఈ స్టోన్‌కి ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో మురికి అలానే ఉండిపోయి మళ్లీ ఉపయోగించినప్పుడు దాని వల్ల లేనిపోని చర్మ సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని