Published : 19/11/2022 19:37 IST

శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం..

శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల కేవలం శరీరంలోనే కాదు.. శిరోజాల్లో కూడా తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతేకాకుండా కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికమవుతుంది. కాబట్టి చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకుంటూ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలల్లాంటి ముంగురులతో అందంగా ఉండచ్చు.

తరచూ తలస్నానం వద్దు..!

కొందరు రోజూ తలస్నానం చేస్తే, మరికొందరు వారానికి మూడు లేదా నాలుగుసార్లు చేస్తూ ఉంటారు. శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అలాగే తలస్నానానికి ఉపయోగించే షాంపూ కూడా మీ శిరోజాలకు సరిపడినదై ఉండాలి.

కండిషనింగ్ కూడా..

తలస్నానానికి ముందు జుట్టుకు కండిషనర్ (ప్రీవాష్ కండిషనర్స్) తప్పకుండా అప్త్లె చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. షాంపూలో ఉండే రసాయనాల ప్రభావం కూడా జుట్టుపై అంతగా ఉండదు.

అతి వేడి వద్దు..

ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండి, వేడినీటితో స్నానం చేయాలనిపించడం సహజం. అయితే స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి.

అలాగే జుట్టుకు సంబంధించి ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే వస్తువులు కూడా వాడకపోవడం మంచిది. అంటే డ్రయర్స్, కర్లర్స్, స్ట్రయిటనర్స్.. మొదలైన వాటిని దూరంగా ఉంచాలి. టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. అలాగే కండిషనర్ పెట్టుకున్న తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్‌ను తలకు చుట్టుకున్నా కుదుళ్లకు మంచి పోషణ అంది బలం చేకూరుతుంది.

నూనె కూడా..

చలికాలంలో శిరోజాలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి బాగా ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెన కూడా సరైనది ఎంచుకోవాలి. పళ్లు కాస్త దూరంగా, వెడల్పుగా ఉన్నవైతే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని