Published : 02/02/2023 20:55 IST

Breakup: మీ మాజీని మర్చిపోలేకపోతున్నారా?

‘నువ్వే నా ప్రపంచం.. నువ్వు లేక నేను లేను’ అనే డైలాగులు చాలామంది ప్రేమికుల చాటింగుల్లో కనబడుతుంటాయి. వీరిలో కొంతమంది కొంతకాలం గడిచిన తర్వాత రకరకాల కారణాలతో విడిపోతుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి నుంచి మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ లేనిదే చాలామందికి రోజు గడవదు. అలాంటిది ఒక్కసారి ‘బ్రేకప్‌’ చెప్పిన తర్వాత పరిస్థితులకు అలవాటు పడడం చాలామందికి కష్టమైన పనే. వారి ప్రేమ తాలూకు జ్ఞాపకాలు వారిని వెంటాడుతుంటాయి. ఈక్రమంలో కొంతమంది పైకి ‘బ్రేకప్‌’ చెప్పినా తమ మాజీని మర్చిపోలేరంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. వారు ఆ విషయాన్ని కొన్ని రకాల చర్యలతో బయటకు వ్యక్తపరుస్తుంటారు. మరి అవేమిటో, వాటి నుంచి ఎలా బయటపడాలో చూద్దాం రండి..

ఫోన్ చేస్తున్నారా?

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కొంత కష్టమైన పనే. ప్రేమలో ఉన్నన్ని రోజులు ఎన్నో జ్ఞాపకాలు హృదయంలో గూడుకట్టుకుపోతుంటాయి. అవి ఒక్కరోజులో పోయేవి కావు. దాంతో తెలియకుండానే వారి నంబర్‌కు డయల్‌ చేయడం, మెసేజ్‌లు పెట్టడం, ఎప్పుడూ కలుసుకునే ప్రాంతానికి వెళ్లడం, సామాజిక మాధ్యమాల్లో వారి స్టేటస్‌లు చెక్‌ చేయడం వంటివి చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటివి చేస్తున్నట్లయితే మీ మాజీని ఇంకా మర్చిపోలేదనే భావించాలి. కాబట్టి, బ్రేకప్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయంపై మీరు స్థిరంగా ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి ఊగిసలాట లేకుండా మీ మాజీతో ఉన్న అన్ని సంబంధాలను తెంచేసుకుని కొత్తగా జీవితాన్ని ప్రారంభించండి.

పదే పదే ప్రస్తావిస్తూ...

సాధారణంగా మనం రోజులో ఎక్కువసేపు ఎవరితో మాట్లాడుతుంటామో, ఎవరి గురించి ఆలోచిస్తుంటామో.. వారి పేరును ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా అనుకోకుండానే ప్రస్తావిస్తుంటాం. దాంతో మనం వారికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో మనతో మాట్లాడేవారికి ఇట్టే తెలిసిపోతుంటుంది. అలాగే కొంతమంది బ్రేకప్ అయినా వారి పేరుని ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రస్తావిస్తుంటారు. ఇలా ఎప్పుడో ఓసారి జరిగితే పర్లేదు కానీ తరచుగా ఇలానే జరుగుతుంటే మీరు మీ మాజీని ఇంకా మర్చిపోలేకపోతున్నారనే విషయం అర్థమవుతుంది. కాబట్టి, దీని నుండి బయటకు రావడానికి నచ్చిన వ్యాపకంపై దృష్టి కేంద్రీకరించండి.

వాటిని దూరంగా ఉంచండి...

ప్రేమలో ఉన్నప్పుడు చాలామంది తమ జ్ఞాపకాలను పదిలపరుచుకుంటారు. ఉదాహరణకు ఇద్దరూ కలిసి మొదటిసారి చూసిన సినిమా టిక్కెట్లు, పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి, ప్రేమికుల దినోత్సవం రోజు పంచుకున్న గ్రీటింగ్‌ కార్డు.. ఇలాంటివి ప్రత్యేకంగా దాచుకుంటుంటారు. కొంతమంది విడిపోయిన తర్వాత కూడా వాటిని చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని బాధపడుతుంటారు. ఇలా చేయడం వల్ల మీరు మీ మాజీని మర్చిపోయి ముందుకు సాగలేకపోతున్నారన్న బలహీనతే బయటకు కనబడుతుంటుంది. కాబట్టి, ఆ జ్ఞాపకాలను మీ కంటికి కనిపించకుండా మీ అంతట మీరే దూరం చేయండి. అలా చేయలేకపోతే మీ స్నేహితుల సహాయంతో అయినా సరే అవి మీ కళ్ల ముందు లేకుండా చూసుకోండి.

అది వృథా ప్రయాసే...!

బాగా కావాల్సిన వారితో గొడవపడినప్పుడు.. ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందిలో ఉంటుంది. అలాగే ‘బ్రేకప్‌’ తర్వాత తమ మాజీ ఏం చేస్తున్నారో అని తెలుసుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. దీనికోసం కొంతమంది ఫేక్‌ ఖాతాలు తెరిచి వాళ్లు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? వాట్సప్‌లో స్టేటస్‌ ఏం పెట్టారు? డీపీ ఫొటోలు మారుస్తున్నారా? అని చెక్‌ చేస్తుంటారు. దీనివల్ల మీ సమయం మరింత వృథా అవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి వాటికి దూరంగా ఉండి కెరీర్‌పై దృష్టి పెట్టడమే మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని