Published : 03/02/2022 14:37 IST

నెగెటివిటీ పోవాలంటే ఇలా చేయండి..!

పద్దెనిమిదేళ్ల శ్రీహిత ఏం అడిగినా సరే.. ప్రతికూలంగానే సమాధానమిస్తుంది. బహుశా.. చదువుకునే క్రమంలో కలిగే ఒత్తిడే ఇందుకు కారణం అనుకుంటున్నారు ఆమె తల్లిదండ్రులు..

24 ఏళ్ల ప్రజ్ఞ నిన్న మొన్నటి వరకు ప్రతి విషయంలోనూ సాధ్యమైనంత మేరకు సానుకూలంగానే స్పందించేది! కానీ అనుకోకుండా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. కారణం.. అన్ని విషయాల్లోనూ ప్రతికూలంగా ఆలోచించడమే!

వీళ్లే కాదు.. మనలో చాలామందికి ఈ సమస్య ఎదురవుతుంది. ఎంత సానుకూలంగా ఆలోచించాలని ప్రయత్నించినా అది పట్టు సడలడంతో ప్రతికూల ఆలోచనా ధోరణి దిశగా అడుగులు వేస్తాం. కానీ ఒక్కసారి ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడితే తిరిగి సానుకూల ఆలోచనా ధోరణిలోకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా మన ఆలోచనా ధోరణిని వీలైనంత వరకు సానుకూలంగా ఉండేలా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ జాగ్రత్తలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

ఆరోగ్యం బాలేనప్పుడో లేదా నిద్రలేమి వంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు మన ఆలోచనలు ప్రతికూలంగా సాగుతుంటాయి. ముఖ్యంగా రోజువారీ పనుల కారణంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆకలి, నిరాశ, డిప్రెషన్.. వంటి సమస్యలన్నీ ప్రతికూల ఆలోచనలకే దారి తీస్తాయి. అందుకే మన ఆలోచనలు సానుకూలంగా సాగాలంటే వీటన్నింటినీ అదుపులో పెట్టాల్సి ఉంటుంది. అందుకు తగినవిధంగానే జాగ్రత్తలు సైతం తీసుకోవాలి.

యోగా/ ధ్యానం..

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా, అనారోగ్య సమస్యల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా.. అందుకు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. ముఖ్యంగా యోగా, ధ్యానం.. వంటి వాటిని మన రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడడమే కాదు.. మన ఆలోచనా ధోరణి కూడా సానుకూలంగా సాగుతుందంటున్నారు నిపుణులు. అనవసర విషయాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెడుతూ కాసేపు ధ్యానం చేసినా అది మనకు చక్కని ఫలితాన్ని ఇస్తుందని వారు సూచిస్తున్నారు.

పేపర్‌పై రాయండి..

బాధ.. సంతోషం.. ఏదైనా సరే.. మనసులో ఉన్న విషయాలను వేరొకరితో పంచుకున్నప్పుడే మన మనసు తేలికపడుతుంది. అలాగని అన్ని విషయాలనూ అందరితోనూ పంచుకోలేకపోవచ్చు. లేదా అలా పంచుకోవడం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మీ బుర్రని తొలిచేస్తున్న ఆలోచనలేంటో పేపర్‌పై రాయడానికి ప్రయత్నించండి. ఏ అంశం గురించి మీరు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఆ ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయి? వాటి పర్యవసానం ఏ విధంగా ఉండచ్చు.. ఇలా మీ ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫలితంగా మీకూ ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతోపాటు ఆ ఆలోచనల నుంచి దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది.

మనసారా నవ్వండి..

ఈరోజుల్లో ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో మానసిక ఒత్తిడి ముందువరుసలో ఉంటోంది. అయితే దానిని ఎదుర్కొనే ఆయుధం కూడా మన దగ్గరే ఉందని మీకు తెలుసా?? అవునండీ.. ఆ ఆయుధం మన నవ్వే. బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు మనసారా నవ్వడానికి ప్రయత్నించి చూడండి. ఇందుకోసం నచ్చిన హాస్య సన్నివేశాలను చూడడం, జోక్స్ చదవడం, చెప్పడం, వినడం.. ఇలా మీకు నచ్చిన విధంగా మనసారా నవ్వడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం మాత్రమే కాదు.. మన ఆలోచనా తీరు కూడా సక్రమంగా సానుకూల ధోరణిలో సాగుతుంది.

సృజనాత్మకంగా వ్యవహరించండి..

ప్రతిఒక్కరిలోనూ క్రియేటివిటీ ఉంటుంది. వాళ్లు చేసే పనిలో అది కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది సాదాసీదా జీవనశైలికి అలవాటు పడిపోయి వారి సృజనాత్మకతను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. యాంత్రికంగా పని చేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల చేసే పనిలో ఆశించినంత ఫలితం రాదు సరికదా.. ఒక పని చేయడంలో మన మార్కు ఏంటో చూపించుకోవడం కూడా కష్టం అవుతుంది. అందుకే ఏ పని చేసినా సరే.. దాని గురించి సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ శైలిలో ఆలోచిస్తూ, చేసే పనిలో మీ మార్కు కనిపించేలా జాగ్రత్తపడండి. ఇలా చేస్తే మానసికంగా సంతృప్తి కలగడమే కాదు.. మన ఆలోచనలు కూడా సానుకూలంగానే సాగుతాయి.

ఇవీ ఆలోచనలను ప్రభావితం చేసేవే..

* నెగెటివ్ థింకింగ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు నచ్చిన పాట పాడి చూడండి. మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా ఆలోచనాధోరణిలో మార్పు వచ్చే అవకాశాలుంటాయి.

* మీరు ఉన్న ప్రదేశం నుంచి బయటకు వచ్చి కాసేపు అటూఇటూ నడవండి. ఈ సమయంలో మీకు బాగా నచ్చిన అంశాల గురించి ఆలోచించడానికి ప్రాధాన్యం ఇచ్చి చూడండి.

* మీకు బాగా ఇష్టమైన అభిరుచి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకొని వాటిపై దృష్టి పెట్టి చూడండి. అసలు ప్రతికూలంగా ఆలోచించే సమయం కూడా ఉండదంటే అతిశయోక్తి కాదేమో!

* ప్రతి విషయంలోనూ సాధ్యమైనంత మేరకు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, పాజిటివ్‌గా ఆలోచించండి.

* ఎంత నియంత్రించుకుందామని ప్రయత్నించినా నెగెటివ్ ఆలోచనలు అస్సలు ఆగట్లేదా?? అయితే ముందుగా మీ మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి కొద్ది నిమిషాల పాటు ధ్యానం లేదా శ్వాస మీద ధ్యాస పెట్టడం వంటివి చేయండి. ఆ తర్వాత పాజిటివిటీ గురించి ఉన్న కొటేషన్స్ చదవండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

* మీరున్న పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే మనసు దృష్టి మళ్లించే మరో పని ఏదో ఒకటి చేయాలి. ఈ క్రమంలోనే ఇతరులకు సహాయం చేయడం, సమాజ సేవలో పాల్గొనడం.. వంటివి చేసి చూడండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని