Published : 17/10/2021 14:13 IST

పిల్లలు ఇష్టంగా తినే ఈ రెసిపీ మీరూ ట్రై చేయండి!

పోషక విలువలు పుష్కలంగా ఉన్న పోహా(అటుకులు)తో ఇడ్లీ, ఉప్మా, దోసెలు, లడ్డూలు, పాయసం, బ్రెడ్‌ రోల్స్, కట్లెట్స్‌...ఇలా ఎన్నో రుచికరమైన వంటకాలు తయారుచేసుకోవచ్చు. అయితే ఈసారి అటుకులతో కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటే క్రొకెట్స్‌ తయారుచేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే వీటిని బ్రేక్‌ఫాస్ట్‌ లేదా స్నాక్స్ సమయంలో వారికి అందించవచ్చు.

పిల్లల కోసం పోహా క్రొకెట్స్!

పోహాతో పాటు వివిధ రకాల కూరగాయలు, మసాలా దినసులతో తయారుచేసే ఈ క్రొకెట్స్‌ను తక్కువ సమయంలో సులభంగా రడీ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే పిల్లలకు సులభంగా దీన్ని తయారుచేసి అందించచ్చు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. మరి దీన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం రండి.

పోహా క్రొకెట్స్‌

కావాల్సిన పదార్థాలు

* పోహా (అటుకులు)- ఒకటిన్నర కప్పు

* ఉడకబెట్టిన బంగాళా దుంపలు- 2

* ఉల్లిపాయ – 1

* పచ్చి బఠానీలు- అర కప్పు

* కరివేపాకు(సన్నగా తరగాలి)- ఒక టీస్పూన్‌

* పచ్చి మిర్చి - 2

* ఆవాలు- ఒక టీస్పూన్‌

* కొత్తిమీర (సన్నగా తరగాలి)- ఒక టేబుల్‌ స్పూన్‌

* కారం- అర టీస్పూన్‌

* పసుపు - పావు టీస్పూన్‌

* ఉప్పు - తగినంత

* మైదా పిండి - అరకప్పు

* బ్రెడ్‌ క్రంబ్స్‌ - అరకప్పు

* నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ

ఒక పాత్రలో అటుకులు తీసుకొని కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని వడకట్టి మరో బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో ఉడకబెట్టి మెదిపిన బంగాళాదుంప ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు వేసి.. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా సమ భాగాలుగా విడదీసి పొడవాటి క్రొకెట్స్ (బుల్లెట్స్‌లా)లా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత మైదాపిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దల్లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారుచేసిన క్రొకెట్స్‌ని మైదా మిశ్రమంలో ఒకసారి, ఆపై బ్రెడ్‌ క్రంబ్స్‌లో మరోసారి దొర్లించి కాగిన నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. ఇలా సిద్ధమైన క్రొకెట్స్‌ని చట్నీ/సాస్‌తో కలిపి తీసుకుంటే మరింత రుచికరంగా ఉంటాయి.

పిల్లలకెందుకు మేలంటే!

* ఫైబర్‌తో నిండి ఉండే అటుకులు తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు దీనిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తయారుచేసి అందించచ్చు.

* అటుకుల్లో గ్లూకోజ్‌, క్యాలరీలు, కొవ్వుల్లాంటి బరువు పెంచే పదార్థాలు ఉండవు.

* ఇక పోహాలో ఉండే ఎ, బి, సి, కె-విటమిన్లు, ప్రొటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

* అలాగే ఈ కొక్రెట్స్‌ తయారీలో ఉపయోగించిన ఇతర పదార్థాలన్నీ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని