Published : 22/11/2021 20:49 IST

టొమాటో కెచప్‌ని ఇలా కూడా వాడొచ్చు..

సమోసా, పిజ్జా, పఫ్స్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలు తినాలంటే.. టొమాటో కెచప్ తప్పనిసరి. కొన్ని రకాల వంటకాలను మరింత రుచిగా తయారుచేయడానికి సైతం టొమాటో కెచప్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అటు రంగు, ఇటు రుచితో నోరూరించేలా చేసే కెచప్ కొన్ని వస్తువులను శుభ్రం చేస్తుందనే విషయం మీకు తెలుసా? కెచప్‌తో వస్తువులు శుభ్రం చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ.. టొమాటోల్లో సహజసిద్ధమైన ఆమ్లగుణాలుంటాయి. వీటిని కెచప్‌లా తయారుచేసినప్పుడు అవి ఇంకాస్త అధికమవుతాయి. ఎందుకంటే దీనిలో వెనిగర్ కూడా కలుస్తుంది. కాబట్టి దీన్ని ఆహారంగానే కాదు.. కొన్ని రకాల లోహపు వస్తువులను శుభ్రం చేయడానికీ వినియోగించవచ్చు. మరి అవేంటో తెలుసుకొందామా..

రాగి వస్తువుల కోసం..

రాగితో తయారుచేసిన వస్తువులు అందంగా ఉండటం మాత్రమే కాదు.. ఇంటికి కొత్త కళను అందిస్తాయి. అయితే వీటిని శుభ్రం చేసే విషయంలో కాస్త ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే.. వాటిని శుభ్రం చేయడానికి మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తే.. రాగి వస్తువులు మెరిసే గుణాన్ని కోల్పోతాయి. అలాగని శుభ్రం చేయకుండా వదిలేస్తే.. రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. కాబట్టి ఇలాంటి వస్తువుల్ని తళతళా మెరిపించాలంటే టొమాటో కెచప్ ఉపయోగిస్తే సరి.. దీనికోసం టొమాటో కెచప్‌ను రాగి వస్తువుపై పల్చని పొరలా పూయాలి. 15-20 నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత మెత్తని నూలు వస్త్రంతో తుడిచి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఒకవేళ వస్తువుపై ఎక్కడైనా మచ్చలాగా ఉంటే అక్కడ మరోసారి కెచప్ పూసి పావుగంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది.

ఇత్తడి పాత్రలకు ఈ చిట్కా..

ప్రతి ఇంట్లోనూ ఇత్తడి వస్తువులు కచ్చితంగా ఉంటాయి. వీటిని శుభ్రం చేసే విషయంలోనూ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నీటిని నిల్వ ఉంచే ఇత్తడి పాత్రల లోపలి భాగంలో పచ్చగా తయారవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని టొమాటో కెచప్‌తో చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. టొమాటో కెచప్‌ను ఇత్తడి వస్తువులకు రాసి కాసేపాగిన తర్వాత మెత్తని వస్త్రంతో రుద్దుతున్నట్లుగా తుడవాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే ఇత్తడి వస్తువు కొత్త దానిలా తళతళలాడిపోతుంది. ఒకవేళ చిన్న చిన్న ఇత్తడి వస్తువులను శుభ్రం చేయాల్సి ఉంటే.. వాటిని కెచప్ నింపిన బౌల్‌లో వేసి కాసేపయ్యాక మెత్తటి వస్త్రంతో తుడిచి కడిగేస్తే సరిపోతుంది.

వెండి ఆభరణాలు రంగు మారకుండా..

ఖరీదైన లోహాల్లో వెండి కూడా ఒకటి. అవి కొంత కాలం తర్వాత రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. తిరిగి వాటిని మెరిపించాలంటే టొమాటో కెచప్‌ చక్కటి ప్రత్యామ్నాయం. దీనికోసం ఒక గిన్నెలో టొమాటో కెచప్‌ను పోసి దానిలో ఐదు నుంచి పది నిమిషాల పాటు శుభ్రం చేయాలనుకొంటున్న వెండి వస్తువుని ఉంచాలి. ఆ తర్వాత మెత్తటి టూత్‌బ్రష్‌తో రుద్ది పొడి వస్త్రంతో తుడిచి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. అయితే ఈ చిట్కాను పాటించేటప్పుడు టొమాటో కెచప్ ఎక్కువ సమయం ఆ వస్తువుపై ఉండకుండా జాగ్రత్తపడాలి.

గిన్నె మాడిపోతే..

వంట చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో పాత్ర మాడిపోతుంటుంది. అయితే దాన్ని శుభ్రం చేసే విషయంలో కాస్త కష్టపడాల్సి వస్తుంది. కానీ టొమాటో కెచప్‌ను ఉపయోగించి మాడిపోయిన గిన్నెను చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. దీనికోసం కొద్దిగా కెచప్‌ను గిన్నెలో వేసి సన్నని సెగపై వేడి చేయాలి. ఇలా చేసేటప్పుడు కెచప్‌లోని నీరు పూర్తిగా ఆవిరి కాకుండా జాగ్రత్తపడాలి. కెచప్ చిక్కగా తయారైన తర్వాత కొద్దిగా నీరు కలపాలి. ఆ తర్వాత గిన్నెను పొయ్యి మీద నుంచి దింపి రాత్రంతా పక్కన పెట్టి ఉంచాలి. కెచప్‌లోని ఆమ్ల గుణాలు.. పాత్రలో మాడిపోయిన పదార్థాన్ని తొలగిస్తాయి.

తుప్పు పట్టకుండా..

ఇనుప వస్తువుల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ అవి తుప్పు పడుతూనే ఉంటాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. అప్పుడే అవి తుప్పు బారిన పడకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ విషయంలో టొమాటో కెచప్ మనకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. దీనికోసం వాషింగ్‌సోడాను నీటిలో కలిపి దాన్ని ఇనుప వస్తువుపై స్ప్రే చేయాలి. ఆ తర్వాత దానిపై కెచప్ పూసి కాసేపాగిన తర్వాత రుద్ది కడిగేస్తే సరిపోతుంది. తరచూ ఉపయోగించే గార్డెనింగ్ టూల్స్ విషయంలోనూ ఇదే చిట్కా పాటిస్తే.. అవి తుప్పు పట్టిపోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని