26 ఏళ్ల టెక్‌ సీఈవో.. నేరగాడి చేతిలో హత్యకు గురై..!

Tech CEO Murder: అమెరికాలో ఓ కంపెనీ సీఈవో చిన్న వయసులోనే హత్యకు గురయ్యారు. ఓ కరుడుగట్టిన నేరగాడు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Published : 27 Sep 2023 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా (USA)లో ఓ యువ టెక్‌ సీఈవో (Tech CEO) దారుణ హత్యకు గురయ్యారు. బాల్టిమోర్‌ ప్రాంతంలో ఎకోమ్యాప్‌ టెక్నాలజీస్‌ (EcoMap Technologies) కంపెనీ వ్యవస్థాపకురాలు, సీఈఓ పావా లాపెరి (Pava LaPere) గత సోమవారం తన అపార్ట్‌మెంట్‌లోనే విగతజీవిగా కన్పించారు. ఓ నేరగాడు ఆమెను హత్య (Murder) చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాల్టిమోర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

లాపెరి ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నుంచి సోమవారం ఉదయం పోలీసులకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఆమె ఫ్లాట్ నుంచి ఎంతకీ బయటకు రావడం లేదని దాని సారాంశం. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అపార్ట్‌మెంట్‌ తలుపు తెరిచి చూడగా లాపెరి విగత జీవిగా కన్పించారు. ఆమె తలకు బలమైన గాయమైనట్లు గుర్తించారు. దీని కారణంగానే ఆమె మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

నెల్సన్‌ మండేలా మనవరాలు కన్నుమూత

ఈమె హత్యకు 32 ఏళ్ల జేసన్‌ డీన్‌ బిల్లింగ్‌స్లే అనే వ్యక్తి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లైంగిక నేరం కేసులో గతంలో శిక్ష అనుభవించిన అతడు.. గతేడాది అక్టోబరులో జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అతడి వల్ల హానీ జరగొచ్చని బాల్టీమోర్‌ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. అయితే, లాపెరితో జేసన్‌కు ఎలాంటి పరిచయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నేరప్రవృత్తిలో భాగంగానే అతడు ఆమెపై దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

26ఏళ్ల లాపెరి.. 2018లో ఎకోమ్యాప్‌ టెక్నాలజీస్‌ పేరుతో స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు. తక్కువకాలంలోనే ఈ కంపెనీకి మంచిపేరొచ్చింది. మెటా వంటి దిగ్గజ సంస్థలకు ఈ కంపెనీ సేవలందిస్తోంది. దీంతో ఈ ఏడాది ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘30 అండర్‌ 30’ జాబితాలో లాపెరి చోటు దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని