Joe Biden: అణు దాడికి పాల్పడితే.. కిమ్‌ పాలన ముగిసినట్టే..: బైడెన్‌

అమెరికా, దక్షిణ కొరియా అధినేతలు ఉత్తరకొరియా(North Korea)కు ఘాటు హెచ్చరికలు పంపారు. శ్వేతసౌధంలో ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 27 Apr 2023 15:45 IST

వాషింగ్టన్: అమెరికా, దక్షిణ కొరియా నిర్వహిస్తున్న వరుస సైనిక విన్యాసాలు.. వీటికి ప్రతిగా ఉత్తర కొరియా చేపడుతున్న క్షిపణి పరీక్షలతో కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు అణుయుద్ధం అంచుకు నెడుతున్నాయంటూ ఉత్తరకొరియా(North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్(kim jong un) మండిపడ్డారు. దీనికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) హెచ్చరిక చేశారు. అణు దాడికే దిగితే.. కిమ్ వంశ పాలనకు అది ముగింపేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్వేతసౌధంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూ సుక్‌ యోల్‌(Yoon Suk Yeol)తో జరిగిన సమావేశం అనంతరం బైడెన్ ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు.   

ఉత్తర కొరియా దూకుడుగా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్ష నేపథ్యంలో దక్షిణ కొరియాకు అమెరికా రక్షణ సహకారం మరింత పటిష్ఠమవుతుందని ఇద్దరు నేతలు తెలిపారు. ‘అమెరికా, దాని మిత్ర దేశాలపై ఉత్తర కొరియా అణుదాడికి పాల్పడితే.. మా నుంచి వచ్చే ప్రతిస్పందన విధ్వంసకరంగా ఉంటుంది. ఆ సమయంలో ఉత్తర కొరియాలోని పాలనకు అది ముగింపే అవుతుంది’ అని బైడెన్ హెచ్చరించారు. ఆ దాడే జరిగితే.. అమెరికా అణ్వాయుధాలతో సహా కూటమి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వేగంగా బదులిచ్చేందుకు రెండు దేశాలు అంగీకరించాయని యూ సుక్‌ యోల్‌ వెల్లడించారు.  

ఇదిలా ఉంటే.. ఇరు దేశాల మధ్య యుద్ధ క్షేత్ర సమన్వయాన్ని మెరుగుపర్చుకోవడం, అమెరికా తన మిత్రపక్షాల రక్షణకు ఎంత అండగా నిలవనుందో చాటిచెప్పడానికే ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు ద.కొరియా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ రాజ్యం యుద్ధం మాట ఎక్కువగా వినిపిస్తోంది. అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండండి, అణుదాడికి సిద్ధంగా ఉండండి అంటూ తరచూ హెచ్చరికలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా అధ్యక్షుడి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో రెండు దేశాలు కీలక ఒప్పందం చేసుకోనున్నాయి. దానికింద అమెరికా అణు జలాంతర్గాములు దక్షిణకొరియా నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఒప్పందం ఖరారైతే దక్షిణకొరియాలో అమెరికా జలాంతర్గాములు మోహరించడం గత 40 ఏళ్లలో తొలిసారి కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని