Covid Deaths: అమెరికాలో 10లక్షల కొవిడ్‌ మరణాలు..!

కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు అంతర్జాతీయ సమాజానికి నిబద్ధత అవసరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

Published : 13 May 2022 02:27 IST

అమెరికా, ఆఫ్రికాల్లో వైరస్‌ ఉద్ధృతి తగ్గలేదన్న డబ్ల్యూహెచ్‌ఓ

వాషింగ్టన్‌: కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు అంతర్జాతీయ సమాజానికి నిబద్ధత అవసరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దుఃఖానికి కారణమైన విషయంలో నిస్సత్తువగా ఉండకూడదన్న ఆయన.. ఈ గాయాలను గుర్తుంచుకోవడంతోపాటు వీలైనన్ని ప్రాణాలను రక్షించుకునేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో కొవిడ్‌ మరణాల సంఖ్య 10లక్షల దాటిన నేపథ్యంలో మాట్లాడిన జో బైడెన్‌.. కొవిడ్‌ లక్షల కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు.

ఆ రెండు చోట్ల తగ్గని ఉద్ధృతి : WHO

అమెరికా, ఆఫ్రికా దేశాలు మినహా విశ్వ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా గతవారం 35లక్షల కరోనా కేసులు నమోదుకాగా 25వేల మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. అంతకుముందుతో పోలిస్తే కేసుల్లో 12శాతం, మరణాల్లో 25శాతం తగ్గుదల కనిపించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికాలో 14శాతం, ఆఫ్రికాలో 12శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదికలో పేర్కొంది.

చాలా దేశాల్లో కొవిడ్‌ విజృంభణ తగ్గినట్లు చెప్పినప్పటికీ మొత్తంగా 50దేశాల్లో మాత్రం కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ హెచ్చరించారు. ఇందుకు ఒమిక్రాన్‌, దాని ఉపరకాలు కారణమవుతున్నాయని అన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనే రోగనిరోధకత ఆస్పత్రి చేరికలు, మరణాలను నిరోధిస్తున్నప్పటికీ వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగానే ఉంటోందన్నారు. ఇప్పటివరకు కేవలం 16శాతం పేద దేశాలకు మాత్రమే వ్యాక్సిన్‌ అందిన విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ గుర్తుచేశారు.

చైనాలో 145శాతం పెరుగుదల

ఇక కరోనా వైరస్‌కు పుట్టినిళ్లైన చైనాలో మాత్రం కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గతవారం రోజుల్లో అక్కడి కొవిడ్‌ కేసుల్లో 145శాతం పెరుగుదల కనిపించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వారాంతపు నివేదికలో పేర్కొంది. అయితే, కొవిడ్‌ కట్టడికి చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్‌ వ్యూహంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్‌.. ఇది ఎక్కువకాలం నిలుస్తుందని భావించడం లేదన్నారు. వైరస్‌ కట్టడికి పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్‌ ఉద్ధృతిని మాత్రం చైనా నియంత్రించలేకపోతున్న నేపథ్యంలో టెడ్రోస్‌  ఈవిధంగా మాట్లాడారు. మరోవైపు ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని