USA: ఇరాన్‌ పేలుళ్ల వేళ.. అమెరికాలో క్యాపిటల్‌ భవనాలకు బాంబు బెదిరింపులు

USA: అమెరికాలోని పలు రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు వాటిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.

Updated : 04 Jan 2024 15:43 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా (USA)లో బాంబు బెదిరింపులు (Bomb Threats) తీవ్ర కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాల (state capitols)కు ఈ బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని ఖాళీ చేయించారు. ఇరాన్‌లో భీకర పేలుళ్ల వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జార్జియా, కనెక్టికట్‌, కెంటుకీ, మిషిగాన్‌, మిన్నెసోటా, మిసిసిపీ, మోంటానా, మైన్‌, హవాయి రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాలకు బుధవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని ఈ-మెయిల్‌ ఐడీ నుంచి ఒకేసారి అన్ని ఆఫీసులకు ఈ సందేశాలు చేరినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తక్షణమే ఆ భవనాలను ఖాళీ చేయించి డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. అవి నకిలీ బెదిరింపులని ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) తెలిపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

ఇరాన్‌ రక్తసిక్తం.. జంట పేలుళ్లలో 103 మంది దుర్మరణం

ఇటీవల అమెరికాలో ప్రాంక్‌ కాల్స్‌ బెడద తీవ్రమైంది. ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో కాల్పులు జరిగాయంటూ కొంతమంది పోలీసులకు ఫోన్‌ చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. క్రిస్మస్‌ రోజున రిపబ్లికన్‌ చట్టసభ్యుడి ఇంట్లో కాల్పులు జరిగినట్లు వచ్చిన నకిలీ ఎమర్జెన్సీ కాల్‌ కలకలం సృష్టించింది. ఆ తర్వాత ట్రంప్‌ను ప్రైమరీ పోరు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్న మైన్‌ రాష్ట్ర సెక్రటరీ (ఎన్నికల అధికారి) షెన్నా బెల్లోస్‌కు కూడా ఇలాగే ప్రాంక్‌ కాల్స్ చేశారు. తాజా ఘటన కూడా ఆ కోవలోనిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు ఇరాన్‌లో బుధవారం జంట పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల కిందట అమెరికా దాడిలో మరణించిన ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్‌, అమెరికా హస్తం ఉందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని