H-1B Visa: హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌న్యూస్‌..

అమెరికన్‌ హెచ్‌-1బీ వీసాదారులు (H 1B Visa) తమ దేశానికి వచ్చి, ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా కెనడా కొత్త ప్రోగ్రామ్‌ తీసుకొస్తోంది.

Updated : 28 Jun 2023 16:28 IST

ఒట్టావా: అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల (H 1B Visa)కు కెనడా (Canada) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్‌ వర్క్‌-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ఫ్రేజర్‌ వెల్లడించారు. అంతేగాక, ఈ ప్రొగ్రామ్‌ కింద హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు చదువుకోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

‘‘హైటెక్‌ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా (USA), కెనడా (Canada) రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో చాలా మంది హెచ్‌-1బీ వీసాదారులే (H 1B Visa Holders). జులై 16, 2023 నాటికి హెచ్‌-1బీ వీసాలో అమెరికాలో పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

కాగా, ఈ కొత్త ప్రోగ్రామ్‌ కింద.. ఆమోదం పొందిన హెచ్‌-1బీ వీసాదారులకు మూడేళ్ల కాలావధితో ఓపెన్ వర్క్ పర్మిట్ (Open Work Permit) లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం వెల్లడించింది. ఇక, వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం లేదా చదువుకునేందుకు తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఇమ్మిగ్రేషన్‌ స్ట్రీమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇమ్మిగ్రేషన్‌ మంత్రి ఫ్రేజర్‌ వెల్లడించారు. అయితే, ఈ స్ట్రీమ్‌ కింద దరఖాస్తు చేసుకునేందుకు ఎవరెవరు అర్హులు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. 

టెక్నాలజీ సహా కొన్ని ప్రత్యేక రంగాల్లో అమెరికా (America)లో ఉద్యోగం చేసేందుకు వీలుగా విదేశీయులకు హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తుంటారు. వీరిలో అత్యధికంగా భారతీయులే ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికాలో చాలా కంపెనీలు లేఆఫ్‌లు చేపట్టడంతో ఈ హెచ్‌-1బీ వీసాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరంతా అమెరికాలో కొనసాగాలంటే వేరే ఉద్యోగాలు వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి ఈ కెనడా ఆఫర్‌ ఉపయోగపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు