China: మసూద్‌ అజార్‌ సోదరుడికి చైనా అండ.. భారత్‌ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!

ఉగ్రవాద నిర్మూలనకు ఐరాస వేదికగా భారత్‌ (India), అమెరికా (US) చేస్తోన్న ప్రయత్నాలకు చైనా(China) మరోసారి మోకాలొడ్డింది. జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా చీఫ్‌ మసూద్‌ అజార్‌ (Masood Azhar)

Published : 12 Aug 2022 02:12 IST

యునైటెడ్‌ నేషన్స్‌: ఉగ్రవాద నిర్మూలనకు ఐరాస (United Nations) వేదికగా భారత్‌ (India), అమెరికా (US) చేస్తోన్న ప్రయత్నాలకు చైనా(China) మరోసారి మోకాలడ్డింది. జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా చీఫ్‌ మసూద్‌ అజార్‌ (Masood Azhar) సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ అజార్‌ (Abdul Rauf Azhar) పై ఆంక్షలు విధిస్తూ అమెరికా, భారత్‌ చేసిన ప్రతిపాదనను డ్రాగన్‌ అడ్డుకుని ఉగ్రవాదంపై తన ద్వంద్వ వైఖరిని మరోసారి ప్రదర్శించింది.

అబ్దుల్ రౌఫ్‌ అజార్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంతో పాటు అతడి ఆస్తులను స్తంభింపజేయడం, అతడి ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్‌ ప్రతిపాదించాయి. ఐరాస భద్రతా మండలిలో 15 శాశ్వత సభ్య దేశాలుండగా.. 14 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. ఒక్క చైనా (China) మాత్రం దీన్ని ‘హోల్డ్‌’లో పెట్టి అడ్డుకుంది. దీంతో అబ్దుల్ రౌఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

కాగా.. పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై నిషేధం తీసుకొచ్చేలా అమెరికా, భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలకు చైనా అడ్డుపుల్ల వేయడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనకు కూడా చైనా చివర్లో అడ్డుపడింది. అంతకుముందు జేషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించగా.. చైనా ఇదే విధంగా పలుమార్లు అడ్డుపడింది. అజార్‌ కార్యకలాపాలపై మరింత సమాచారం అవసరమైనందునే అడ్డుకుంటున్నట్లు సమర్థించుకుంది. అయితే చివరకు, అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో అజార్‌ను 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు.

ఎవరీ అబ్దుల్ రౌఫ్‌ అజార్‌..

మసూద్‌ అజార్‌ సోదరుడైన అబ్దుల్ రౌఫ్‌ 1974లో పాకిస్థాన్‌లో జన్మించాడు. జైషే ముఠాలో అత్యంత కీలక వ్యవహరించే రౌఫ్ పాకిస్థాన్‌లో యువతను ఉగ్రవాదం దిశగా ప్రేరేపించాడు. అనేక ఉగ్రదాడులకు కుట్రలు పన్నడమే గాక, స్వయంగా దాడులకు పాల్పడ్డాడు. 1999లో అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో భారత విమానాన్ని హైజాక్‌ చేసిన ఘటనలో రౌఫ్‌ ప్రధాన సూత్రధారి. ఆ తర్వాత 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వాయుసేన స్థావరంపై దాడికి పథకం రచించింది కూడా ఇతడే. 2010లో అమెరికా అతడిపై ఆంక్షలు విధించింది. రౌఫ్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని 2009లో భారత్‌ సొంతంగా ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత 2016లో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌లతో కలిసి ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అయితే వీటన్నింటిని కూడా చైనానే అడ్డుకోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని