China: కొవిడ్‌ ఆంక్షలు సడలించినా.. చైనాలో కొనసాగుతున్న నిరసనలు

చైనా (China) ప్రభుత్వం అనుసరిస్తోన్న జీరో కొవిడ్‌ (Zero Covid) విధానంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలు సడిలిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Published : 13 Dec 2022 22:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీరో కొవిడ్‌ (Zero Covid) విధానాన్ని కఠినంగా అమలు చేస్తోన్న చైనాలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల షింజియాంగ్‌ రాజధాని ఉర్ముచిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోవడం చైనీయుల్లో (China) మరింత ఆగ్రహానికి కారణమయ్యింది. కొవిడ్‌ ఆంక్షల కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ 39 నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వందల మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగతుండడంతో దిగివచ్చిన ప్రభుత్వం.. కొవిడ్‌ ఆంక్షలను సడలించేందుకు ఉపక్రమించింది. ఇప్పటికే వివిధ నగరాలు, ప్రావిన్సుల మధ్య ప్రయాణ వివరాలను ట్రాకింగ్‌ చేసే యాప్‌ వినియోగాన్ని ఉపసంహరించుకోగా.. తాజాగా చాలా నగరాల్లో సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు, సినిమాలు, జిమ్‌లు తిరిగి తెరుచుకునేందుకు వీలు కల్పించింది. అయినా, జీరో-కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా చైనా వ్యాప్తంగా ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

కొవిడ్‌ కట్టడికి చైనా అనుసరిస్తోన్న విధానంపై స్వదేశంలో నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వుహాన్‌, చోంగ్‌కింగ్‌, షెన్‌జెన్‌, చెంగ్డూ నగరాలతో పాటు షింజియాంగ్‌లోనూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘైలోని రద్దీ ప్రదేశాల్లో కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నట్లు తెలిపారు. సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లతోపాటు ప్రజారవాణాపై ఉన్న ఆంక్షలనూ ఎత్తివేశారు. ఈ ప్రాంతాల్లో కొవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌ చూపించే అవసరం లేదని పేర్కొన్న అధికారులు.. పాఠశాలలు, బార్‌లతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించే వేదికల్లో మాత్రం కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టును చూపించాలని సూచించారు. మరోవైపు కొవిడ్‌ ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాపిల్‌ సంస్థ.. తమ ఉత్పత్తి కేంద్రాల్లో కొన్నింటిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

మరోవైపు చైనాలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నా తిరిగి వాటిని ఎప్పుడైనా అమలు చేయవచ్చనే భయం చైనీయుల్లో నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని