China: జిన్‌పింగ్‌ మూడోసారి ‘కింగ్‌’.. చైనా అధ్యక్షుడి సరికొత్త చరిత్ర

షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) చైనాకు జీవితకాలం అధినాయకుడిగా ఉండేందుకు మరో అడుగు పడింది. శుక్రవారం ఆయన ముచ్చటగా మూడోసారి చైనా (China) అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

Published : 10 Mar 2023 10:31 IST

బీజింగ్‌: చైనా (China) అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) సరికొత్త చరిత్ర లిఖించారు. ముచ్చటగా మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు అధ్యక్ష (President) బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్‌ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతో డ్రాగన్‌ దేశానికి ఆయన జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం లభించినట్లైంది.

గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) కాంగ్రెస్‌ సమావేశాల్లో.. 69 ఏళ్ల జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్‌ ఘనత సాధించారు. సీపీసీ (CPC)లో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో.. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సాధారణంగా సీపీసీ నిర్ణయాలనే యాంత్రికంగా అమలు చేస్తూ ‘రబ్బర్‌ స్టాంప్‌ పార్లమెంట్’గా పేరొందిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (చైనా పార్లమెంట్‌).. జిన్‌పింగ్‌ (Xi Jinping)ను మూడోసారి అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నుకుంది. మొత్తం 2,950 మందికి పైగా సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక తర్వాత.. జిన్‌పింగ్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇక జిన్‌పింగ్‌ అత్యంత సన్నిహితుడు హన్‌ ఝెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

అధికారాలన్నీ జిన్‌పింగ్‌ చేతుల్లోనే..

మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా సాయుధ దళాలకు (పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ PLA) అధిష్ఠానమైన కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గానూ జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ నేడు తీర్మానించింది. దీంతో అధికారాలన్నీ మళ్లీ జిన్‌పింగ్‌ చేతుల్లోకే వెళ్లాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా చైనా (China)లోని మూడు అధికార కేంద్రాలకు ఆయన నాయకుడిగా కొనసాగనున్నారు. దీంతో ఇక, జిన్‌పింగ్‌ జీవితకాలం అధికారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

శక్తిమంతమైన నేతగా..

2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్‌ (Xi Jinping) తొలిసారి నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ పదేళ్ల పదవీకాలంలో ఆయన.. చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్‌ తరవాత అంతటి శక్తిమంతమైన నేతగా ఆవిర్భవించారు. సాధారణంగా చైనాలో ఉన్నత నాయకులెవరూ రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, 68 ఏళ్లు నిండిన తరవాత రిటైరైపోవలసిందేనని మావో తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్‌ జియావోపింగ్‌ నిర్దేశించారు. అయితే ఈ నిబంధనను మారుస్తూ 2018లో జిన్‌పింగ్‌ సర్కారు రాజ్యాంగంలో కీలక సవరణ చేసింది. దీంతో రెండు పర్యాయాల పదవీకాల పరిమితి నుంచి దేశాధ్యక్షుడికి మినహాయింపు కల్పించింది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు ఆ సవరణ మార్గం కల్పించింది. ఇక, 2021లో జరిగిన సీపీసీ (CPC) ప్లీనరీ సమావేశంలో.. చైనాకు జీవితకాల అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా చారిత్రక తీర్మానం చేశారు. అలా.. జిన్‌పింగ్‌ చైనాకు ముచ్చటగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని