France: అధ్యక్ష భవనానికి తెగిన వేలు.. ఫ్రాన్స్‌లో కలకలం

ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనంలో ఓ తెగిన వేలు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి దీన్ని పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Updated : 15 Jul 2023 18:42 IST

పారిస్‌: ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్‌లో ‘తెగిన వేలు’తో ఉన్న ప్యాకేజీ కలకలం సృష్టించింది. ఈ వారం ఆరంభంలో అధ్యక్ష భవనానికి వచ్చిన ఓ ప్యాకేజీలో ఈ వేలును సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పారిస్‌ ప్రాసిక్యూటర్‌ అధికారి తాజాగా ధ్రువీకరించినట్లు ఫ్రెంచ్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ వేలు.. ప్యాకేజీని పంపించిన వ్యక్తిదే అయి ఉంటుందని ప్రాసిక్యూటర్‌ అధికారి అనుమానిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అతడి మానసిక స్థితి సరిగా లేకపోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎలిసీ ప్యాలెస్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవల ఫ్రాన్స్‌ (France)లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న కొద్ది రోజులకే అధ్యక్ష భవనానికి ఇలా తెగిన వేలితో బెదిరింపులు రావడం గమనార్హం. గత నెల పోలీసుల కాల్పుల్లో ఓ 17 ఏళ్ల యువకుడు మృతి చెందడటంతో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేలాది మంది ఆందోళనకారులు కొన్ని వారాల పాటు రోడ్లపై చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు ప్రభుత్వ భవనాలు, వాహనాలకు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. దీంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు శాంతించాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని