Mystery Hepatitis: చిన్నారుల్లో ఆ మిస్టరీ వ్యాధికి కరోనానే కారణమా..?

కరోనా వైరస్‌ను నుంచి కోలుకుంటోన్న పలు దేశాలను ఇటీవల ఓ అంతుచిక్కని కాలేయ వ్యాధి కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే.

Published : 18 May 2022 01:47 IST

ముమ్మరంగా కొనసాగుతోన్న పరిశోధనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటోన్న పలు దేశాలను ఇటీవల ఓ అంతుచిక్కని కాలేయ వ్యాధి కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఐరోపా, అమెరికా చిన్నారుల్లో వెలుగు చూస్తోన్న కాలేయ వ్యాధిపై కారణాలను విశ్లేషిస్తున్నప్పటికీ అది ఒక మిస్టరీగానే మారింది. అయితే, దీనిపై ఇప్పటికే ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుర్తించని కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల సంభవించే దుష్ప్రభావాలు పిల్లల్లో తీవ్రమైన కాలేయ వ్యాధికి కారణం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ మంది బాధిత చిన్నారుల్లో ఓ రకమైన అడినోవైరస్‌ను గుర్తించినప్పటికీ వీటిపై ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన అధ్యయనం అంతర్జాతీయ జర్నల్‌లో విశ్లేషణకు రావాల్సి ఉంది.

కరోనా వైరస్‌ బారినపడిన చిన్నారులు కాలేయ వ్యాధుల బారినపడే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయినప్పటికీ ఇటీవల తీవ్ర కాలేయ వ్యాధి బారినపడిన పిల్లలకు గతంలో కరోనా వైరస్‌ సోకిన దాఖలాలు కనిపించలేదు. అయితే, వారిలో మెజారిటీ పిల్లలకు మాత్రం కాలేయంపై దాడి చేసే 41ఎఫ్‌ అనే అడినోవైరస్‌ సోకినట్లు నిపుణులు గుర్తించారు. ఎక్కువ మంది చిన్నారుల్లో కొవిడ్‌ వెలుగు చూడనప్పటికీ లక్షణాలను గుర్తించలేకపోయి ఉండవచ్చని ది లాన్సెట్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే జీర్ణాశయ మార్గంలో అడినోవైరస్‌-42ఎఫ్‌ ప్రభావం కాలేయాన్ని దెబ్బతీయవచ్చన్నారు. ఈ నేపథ్యంలో కాలేయ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారుల మలం ద్వారా వారిలో ఏ మేరకు కరోనా వైరస్‌ ఉందో తెలుసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 450 కేసులు..

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ విజృంభణతో గత రెండేళ్లుగా సతమతమవుతోన్న ప్రపంచ దేశాలకు ఇటీవల ఓ అంతుచిక్కని వ్యాధి కలవరానికి గురిచేసింది. ఐరోపా, అమెరికాలో చిన్నారుల్లో వెలుగు చూస్తోన్న ఈ కాలేయ వ్యాధికి సంబంధించి ఇప్పటికే 450 కేసులు నమోదయ్యాయి. ఒక నెల వయసు నుంచి 16ఏళ్ల లోపు పిల్లల్లోనే నమోదవుతున్న ఈ వ్యాధి తీవ్రత వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యం పాలైన మొత్తం బాధిత చిన్నారుల్లో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. ఇలా పిల్లల్లో మిస్టరీగా మారిన ఈ వ్యాధిపై డబ్ల్యూహెచ్‌ఓతోపాటు అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ కచ్చితమైన కారణాలను ఇంకా గుర్తించలేకపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని