Covid: భారత్‌లో 42 లక్షల ప్రాణాలు కాపాడిన కొవిడ్‌ టీకా

కొవిడ్‌ టీకా భారత్‌లో లక్షలాది ప్రజల పాలిట సంజీవనిలా పనిచేసినట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 42 లక్షల మరణాలను వ్యాక్సిన్‌ నిలువరించిందని పేర్కొంది.

Updated : 25 Jun 2022 07:46 IST

ప్రపంచంలో 2 కోట్ల మందికి ప్రాణరక్షణ: ‘లాన్సెట్‌’ అధ్యయనం

లండన్‌: కొవిడ్‌ టీకా భారత్‌లో లక్షలాది ప్రజల పాలిట సంజీవనిలా పనిచేసినట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 42 లక్షల మరణాలను వ్యాక్సిన్‌ నిలువరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల ప్రాణాలు కాపాడినట్లు తేల్చింది. కరోనా మహమ్మారి నుంచి టీకా ఎంత అద్భుతంగా ప్రజలను కాపాడిందో తెలుపుతూ.. అధ్యయన వివరాలను ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్‌’ ప్రచురించింది. మహమ్మారి బారినపడి ప్రపంచమంతా విలవిలలాడుతున్న తరుణంలో వచ్చిన కొవిడ్‌ టీకా.. కరోనా మృత్యుకోరలు పీకేయడంలో కీలకంగా వ్యవహరించిందని, అధిక ప్రాణనష్టం సంభవించకుండా కాపాడిందని అధ్యయనం తేల్చింది. విశ్వవ్యాప్తంగా దుర్భర, కఠిన పరిస్థితులను వ్యాక్సిన్లు నివారించాయని, వైరస్‌ను సమర్థంగా నిరోధించాయని పేర్కొంది. చైనా మినహా ప్రపంచంలోని 185 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. కొవిడ్‌ వ్యాప్తి, బాధితులు, మరణాలు సహా ఎలాంటి కచ్చితమైన సమాచారం బహిర్గతం కాని కారణంగా ఈ అధ్యయనంలో చైనాను పరిగణనలోకి తీసుకోలేదని అధ్యయనకర్తలు వెల్లడించారు. ఈ విశ్లేషణలో చైనాను పరిగణనలోకి తీసుకుని ఉంటే గణాంకాల్లో చాలా మార్పు ఉండేదని తెలిపారు.‘‘ఏడాది కాలంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వల్ల భారత్‌లో 42.10 లక్షల మరణాలకు అడ్డుకట్ట పడిందని అంచనా వేశాం’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజికి చెందిన ఒలివర్‌ వాట్సన్‌ వెల్లడించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 1.98 కోట్ల మరణాలను నిలువరించగలిగినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన ప్రకారం అన్ని దేశాలు 2021 చివరికల్లా రెండు డోసులతో కనీసం 40 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసినట్లయితే మరో 5.99 లక్షల ప్రాణాలు నిలిచేవని తాజా అధ్యయనంలో అంచనా వేశారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి 2020 డిసెంబరు 8 - 2021 డిసెంబరు 8 మధ్య కాలాన్ని తొలి సంవత్సరంగా భావించి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. వివిధ దేశాలు నమోదు చేసిన అధికారిక లెక్కల ప్రకారం చూసినా.. ఒకవేళ వ్యాక్సినేషన్‌ జరగకపోతే అధ్యయన సంవత్సరంలో 1.81 కోట్ల మరణాలు సంభవించేవని పరిశోధకులు అంచనాకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని